.
శ్రీతేజ… అబ్బాయి పేరు గుర్తుందా..? సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అమ్మ చనిపోగా, ఈ కొడుకు ఇంకా హాస్పిటల్‌లో ఉన్నాడు…
ఈరోజుకూ చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు… రాత్రి పరిస్థితి ఇంకా సీరియస్ అయినట్టు ఓ వార్త… పోనివ్వండి, ఎవడు పట్టించుకుంటాడు… ఆప్టరాల్ ఓ చలి చీమ…
Ads
మొత్తం సినిమాలోకం, సోకాల్డ్ సినిమా పెద్దలందరూ పుష్పరాజ్‌ను పరామర్శించడానికి, ఓదార్చడానికి, సంఘీభావం ప్రకటించడానికి ఆ ఇంటి ముందు వరుస కట్టారు…
ఓ ముఖ్యమంత్రి ఫోన్ చేసి ధైర్యం చెబుతాడు… గల్లీ నుంచి ఢిల్లీ దాకా మద్దతు ప్రకటనలు… కేంద్ర ప్రభుత్వం దాకా… అవునూ, బన్నీ బాధితుడా..? నిందితుడా..? సమాజం తను ఎవరిని ఇంతగా పరామర్శిస్తోంది..?
సరే, ఆమె చనిపోయిందా, ఓ 25 లక్షలు పారేస్తాంలే అన్నారు కదా… పాపం, ఆ పిల్లాడు… ఆ బన్నీ మీద పిచ్చి ప్రేమతోనే కదా అక్కడి దాకా వచ్చి మరణం ముంగిట కొట్టుకుంటున్నాడు… ఒక్కడు ఒక్కడన్నా వెళ్లారా..? చూశారా..? పర్లేదులెండి, ఆయన రాత్రి ఆ జైలులో నిద్రపోయాడా, ఫుడ్డు తీసుకున్నాడా..? అది కనుక్కొండి ముందు… ఆ పసి ప్రాణానిదేముంది..? ఆఫ్టరాల్ ఓ చలి చీమ…
నిన్న బన్నీ ఇంటి ముందు కెమెరాలు దిగేసి… ఎడాపెడా ఊదరగొట్టిన కెమెరాలకు బన్నీ మార్క్ రేటింగులు కావాలి… ఆ చలి చీమ పరిస్థితిని వార్తగా చేస్తే ఎవడికేం లాభం..? అదుగో వాడొచ్చాడు, ఇదుగో వీడొచ్చాడు… జూమ్ చేయి… కారు దిగుతున్నాడు, చూడు… జాగ్రత్తగా కవర్ చేయి… కెమెరామన్ల తొక్కిసలాట జరగొచ్చు, జాగ్రత్త…
బన్నీ మీద పెట్టబడిన కేసు, రాజకీయ మర్మాలు, చట్ట నిబంధనలు, న్యాయాల గురించిన వ్యాఖ్యానం కాదు ఇది… లోకం తీరు మీద..! మన ప్రసార సాధనాల దారిద్య్రం మీద..! మన ప్రయారిటీల పైత్యాల మీద..!
ఆ చలి చీమ తండ్రే ఏమంటున్నాడో తెలుసా..? పర్లేదు, ఆయన్ని అరెస్టు చేస్తారని తెలియదు, కేసు వాపస్ తీసుకుంటా..! మరేమనుకుని కేసు పెట్టాడు..? ఇక్కడా… భార్య పోయిన బాధకన్నా, కొడుకు దురవస్థ బాపతు నొప్పికన్నా… ఇంకేదో బలంగా ఉంది… ఏమిటది..?
నిన్నటి నుంచీ ఈ పోటో పెట్టి తెలుగు నెటిజనం సానుభూతి చెబుతోంది… అక్కడ పెద్ద తలలు క్యూలు కడుతున్నాయి సరే, ఈ పిల్లాడి పరిస్థితేమిటని అడుగుతున్నయ్… నాన్సెన్స్, మత్త గజానికీ చలిచీమకూ పోలిక ఏమిటసలు..?
వాడెవడో కూస్తున్నాడు… తొక్కిసలాటలో భక్తులు మరణిస్తే దేవుళ్లనూ అరెస్టు చేస్తారా అని…! అవును సార్, తప్పయింది… ఆ దేవుళ్లనైనా ప్రాసిక్యూట్ చేయాల్సిందే… కానీ మీరు సాగిలబడే ఈ దేవుళ్లకు మాత్రం కోపం రావద్దు… అంతేకదా…
పోతేపోనివ్వండి సార్, శ్రీతేజవంటి చలి చీమలు ఎన్ని పోతేనేం..? అనియంత్రిత వినోద దందాలో వేల కోట్లు పోగేసుకునే కథానాయకుల జోలికి వెళ్లాలంటే చట్టం కూడా కాస్త ఆలోచించాలి..!!
Share this Article