.
అసలే నెగెటివ్ టాక్‌తో… నెగెటివ్ సోషల్ క్యాంపెయిన్లతో కుంటుతున్న గేమ్ చేంజర్ సినిమాపై మరో పిడుగు పడినట్టే… ఎలాగంటే..? 1) డాకూ మహారాజ్… బాలయ్య మార్క్ ‘అతి’ని ప్రేమించే ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు… గేమ్ చేంజర్‌కు ఇది మొదటి దెబ్బ…
2) సంక్రాంతికి వస్తున్నాం… ఈ సినిమా ఇప్పుడు ఫ్యామిలీ ప్రేక్షకులను, పండుగవేళ గిరాకీని సొమ్ము చేసుకోబోతోంది… ఇది రెండో దెబ్బ… అక్కడక్కడా కొన్ని లోపాలు పంటి కింద రాళ్లుగా ఉన్నా సరే, స్థూలంగా ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టెయినర్ పలు కోణాల్లో…
Ads
టీవీ షోలు, సోషల్ మీడియాను వాడుకుంటూ ఈ సినిమాకు మంచి బజ్ ఎలా క్రియేట్ చేశారో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా… (మీనాక్షి, ఐశ్వర్య ఉత్సాహంగా పాల్గొన్నారు దాదాపు అన్ని ప్రమోషన్ ప్రయాసల్లోనూ…) అదీ ఈ సినిమాకు బాగా పనిచేయనుంది…
ఇక ఈ సినిమా గురించి… వెంకటేశ్‌కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి… సరదాగా, అలవోకగా చేసుకుంటూ పోయాడు… పైగా తనకు మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంది… పైగా ఎఫ్2, ఎఫ్3 సినిమాలు చేసిన సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ దర్శకుడు అనిల్ రావిపూడితో… మళ్లీ ఓ సక్సెస్ మూవీ…
పరిమిత బడ్జెట్‌తోనే, మంచి ప్లానింగుతో, వేగంగా సినిమా తీయగలిగే అనిల్ రావిపూడికి మరో విషయమూ తెలుసు… థియేటర్ దాకా వచ్చే కుటుంబ ప్రేక్షకులకు ఎలాంటి కంటెంట్ కావాలో…! అందుకే కామెడీ ప్రధానంగా నడిపించాడు సినిమాను ఎప్పటిలాగే… ఐతే ఉత్త కామెడీ స్కిట్లను పేర్చుకుంటూ పోవడం కాదు… అవసరమైనచోట్ల కొన్ని మెరుపులు ఉన్నాయి…
ప్రత్యేకించి బుల్లిరాజు పాత్రలో నటించిన పిల్లాడు… ఫస్టాఫ్‌లో ఒకటీరెండు సీన్లు బాగా పండాయి… సేమ్, సెకండాఫ్‌లోనూ ఇంకాస్త పదునైన సీన్లు రెండు పడి ఉంటే సినిమా ఇంకాస్త రేంజ్ పెరిగేది… అలాగే ఐశ్వర్య రాజేష్… ఈ తెలుగు పిల్లను తెలుగు సినిమా ఇన్నాళ్లూ సరిగ్గా వాడుకోలేదు… తనకు అనుగుణమైన పాత్ర పడితే దంచేయగలదు… అమాయకురాలైన భార్య పాత్రలో మెప్పించింది…
లక్కీభాస్కర్ విజయం మీనాక్షి చౌదరిలో విశ్వాసం నింపినట్టుంది… వెంకటేష్ వంటి సీనియర్ హీరో సరసన తన పాత్రకు సరిపడా నటనను అందించింది… ఈమెకు తెలుగు సినిమాల్లో ఇంకా కెరీర్ బాగానే ఉండేట్టుంది..
వెంకటేశ్ ఓ మాజీ పోలీసు… ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు… ఉమ్మడి కుటుంబంతో హాయిగా ఉంటుంటాడు… తన మాజీ గరల్ ఫ్రెండ్, పోలీసు అధికారి మీనాక్షి ఓసారి వచ్చి ఓ కేసులో సాయం కోరుతుంది… భార్య తనూ వస్తానంటుంది… ఆ ఇద్దరి నడుమ నలిగే పాత్ర వెంకటేష్‌ది… దీనికి ఓ క్రైమ్ టచింగ్ ఇచ్చి అలా అలా ఓ పాత కథనే తనదైన శైలిలో నడుపుతూ పోయాడు దర్శకుడు… సరైన ట్రీట్‌మెంట్ ఉంటే పాత కథయినా, లాజిక్కులు లేకపోయినా జనం పట్టించుకోరనేది తన నమ్మకం…
ఉపేంద్ర లిమాయే నటన అతి… ఓపికకు పరీక్ష… ఫస్టాఫ్‌లో కామెడీ బాగుంటే, సెకండాఫ్‌లో అక్కడక్కడా కృతికంగా, కావాలని ఇరికించినట్టుగా అనిపిస్తుంది… శ్రీనివాసరెడ్డి, నరేష్, అవసరాల శ్రీనివాస్ ఎట్సెట్రా వోకే… సినిమాకు ప్రధాన బలం సంగీతం కూడా… ఇప్పటికే బయట హిట్టయిన గోదారి గట్టు మీద పాటతోపాటు మిగతావీ బాగున్నాయి… బీజీఎం సందర్భోచితంగా ఉంది… రమణ గోగుల గాత్రం మరో అకర్షణ…
సెకండాఫ్ కాస్త ఇంపాక్ట్‌ఫుల్‌గా లేకపోవడానికి దర్శకుడికి ఇచ్చిన సమయం సరిపోక హడావుడిగా చుట్టేసినట్టున్నాడు… టీచర్లకు సంబంధించిన ఓ సోషల్ మెసేజ్ కూడా అకస్మాత్తుగా చేర్చినట్టుంది… అందుకే మిగతా సినిమాతో సరిగ్గా సింక్ కాలేదు… పర్లేదు, మరీ దిల్‌రాజు భాషలో చెప్పాలంటే… ఈసారి పండుగ వినోదాల్లో తెల్ల కల్లు, మటన్ పులుుతోపాటు ఈ సినిమాను కూడా చేర్చుకోవచ్చు..! (ఈ రివ్యూ యూస్ ప్రీమియర్స్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా…)
Share this Article