83 ఏళ్లు… సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం… పలు దశల్లో ప్రధాని పదవికి పోటీదారు… మంచి వ్యూహకర్త… ఎన్నో ఎదురుదెబ్బలు, విజయాలు… కానీ ఈ జీవితపు తుది అంకంలో ఓ విచిత్రమైన దురవస్థను అనుభవిస్తున్నాడు… తన బిడ్డ కోసం తనను దెబ్బకొట్టిన తనవాళ్లనే దేబిరిస్తున్నాడా..? డెస్టినీ..?
ఏ సోనియా గాంధీ నాయకత్వాన్ని ధిక్కరించి బయటికి వచ్చాడో అదే సోనియా కాంగ్రెస్‌తో దోస్తీ చేసి, ఏ శివసేన అయితే తనకు దీర్ఘకాలంగా ప్రత్యర్థో అదే శివసేనతో జతకట్టి, ఓ కూటమి కట్టి మహారాష్ట్రలో అధికారం చేజిక్కించుకుంటే… బీజేపీ విసిరిన పావులకు తన సొంత అన్న కొడుకే పడిపోయాడు… 25 ఏళ్ల తన సొంత పార్టీ ఎన్సీపీని తను రాజకీయంగా పెంచి పోషించిన అజిత్ పవారే చీల్చాడు… కాదు, హైజాక్ చేశాడు… ఎన్నికల సంఘం కూడా వెన్నుపోటుదారుడి చీలికనే అసలైన పార్టీగా గుర్తించింది… (తెలుగుదేశం, శివసేన అనుభవాల్లాగే…) 53 మంది ఎమ్మెల్యేల్లో 41 మంది అజిత్ పవార్‌కే జైకొట్టారు…
బీజేపీ కొట్టిన ప్రలోభాల దెబ్బకు అంతటి శివసేనే నిలువునా చీలిపోయింది… ఠాక్రే కుటుంబంపై తిరుగుబాటు చేసిన ఏకనాథ్ షిండే ఏకంగా సీఎం అయ్యాడు… అజిత్ పవార్ (64) డిప్యూటీ సీఎం అయ్యాడు… ఎన్నికల సంఘం శివసేన షిండే చీలికనే అసలైన పార్టీగా గుర్తించింది… ఆ ఠాక్రే తన చీలికకు శివసేన (ఉద్దవ్ బాలాసాహెబ్ ఠాక్రే) అని పేరు పెట్టుకుని, తనూ మనుగడ కోసం కొట్టుమిట్టాడుతున్నాడు…
Ads
ఈ స్థితిలో శరద్ పవార్‌కు ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు, తన పార్టీలో తన తరఫున మిగిలిన చీలికకు (ఎన్సీపీ శరద్ చంద్ర పవార్) అని పేరు పెట్టుకున్నాడు, అది నామమాత్రం పార్టీ ఇప్పుడు… జనంలో వ్యతిరేకత కనిపిస్తోంది… దానికితోడు తన అడ్డా బారామతి సీటులో కొన్ని టరమ్స్‌గా గెలుస్తున్న బిడ్డ సుప్రియా సూలేపై అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ (60) పోటీకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి… ఆమె అప్పుడే జనంలోకి వెళ్తోంది దూకుడుగా…
ఈసారి తన బిడ్డను గెలిపించుకునే స్థితి కనిపించడం లేదు… మరోవైపు తను స్థాపించిన ఓ సంస్థలోనే సీఎం షిండే, డిప్యూటీ సీఎంలు అజిత్ పవార్, ఫడ్నవీస్ నమో మహారోజ్‌గార్ ఈవెంట్ ఒకటి మార్చి రెండున నిర్వహించబోతున్నారు… ఆ ప్రోగ్రాంకు సుప్రియా సూలేను (ప్రస్తుత ఎంపీ) పిలిచారు తప్ప శరద్ పవార్‌ను పిలవలేదు… తన సొంత అడ్డాలో తను లేకుండా ఓ అధికారిక ప్రోగ్రాం జరుగుతూ ఉండటం ఇదే మొదటిసారి…
మనసులో ఎంత ఇరిటేట్ అవుతున్నాడో గానీ… తన కోడలు వంటి సునేత్ర నిలబడితే తన బిడ్డ సుప్రియ (55) గెలిచే సూచనల్లేవు… అందుకని తనంతట తనే అనేక మెట్లు దిగి… మా ఇంటికి భోజనానికి రండి అని సీఎం, ఇద్దరు డిప్యూటీలను ఆహ్వానిస్తూ ఓ లేఖ రాశాడు… సునేత్ర నిలబడకుండా, తన బిడ్డ గెలుపుకి సానుకూల వాతావరణం కోసం రాయబేరాల కోసం ఈ పిలుపు అని మహారాష్ట్ర మీడియా, పొలిటికల్ సర్కిళ్లలో ప్రచారం…
అబ్బే, మా లోకసభ స్థానం వైపు ఏ విశిష్ట అతిథులు వచ్చినా మా ఇంటికి పిలిచి భోజనం పెట్టడం మా ఆనవాయితీయే, ఆ ముగ్గురినీ పిలవడంలో వేరే రాజకీయ ఉద్దేశాలు ఏమీ లేవు అని సుప్రియ చెబుతోంది… కానీ ఆమె కోసమే పాపం శరద్ పవార్ అలా దిగిపోతున్నాడు అనీ, ఈ అధికార త్రిమూర్తులు గనుక గట్టిగా నొక్కితే మిగిలిపోయిన తన చీలిక పార్టీతో శరద్ పవార్ ఎన్డీయేలోకి కూడా రావొచ్చునని ఓ ఊహాగానం… ఇక్కడ చెప్పుకునేది ఏమిటంటే… అంతటి శరద్ పవార్ సైతం ఈ స్థితిలో ఉన్నాడంటే డెస్టినీ ఎంత బలమైందీ అని..!
Share this Article