.
. ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం ) .. …. యన్టీఆర్- దాసరి కాంబినేషన్లో తయారయిన సూపర్ డూపర్ హిట్ సినిమా 1980 అక్టోబరులో విడుదలయిన ఈ సర్దార్ పాపారాయుడు … వీళ్ళిద్దరి కాంబినేషన్లో మూడో సినిమా . మూడు సినిమాల్లోనూ యన్టీఆర్ ద్విపాత్రాభినయమే .
ఈ టైటిల్ని ఎంపిక చేసుకున్న దాసరిని మెచ్చుకోవాలి . తెలుగు వాళ్ళకు సుపరిచితమైన పేరు బొబ్బిలి బెబ్బులి తాండ్ర పాపారాయుడు . ఆ పేరు వింటేనే దేశభక్తుల రక్తం ఉడుకుతుంది . పైపెచ్చు బొబ్బిలి యుధ్ధంలో ఆ పాత్రలో నటించిన యస్వీఆర్ ఆ పేరుకు చిరస్మరణీయతను తెచ్చారు . బహుశా ఈ టైటిల్ ఎంపికలో ఇవన్నీ ఉన్నాయేమో !
Ads
ఈ సినిమా కధను క్రాంతికుమార్ , పాలగుమ్మి పద్మరాజు , దాసరి ఉమ్మడిగా నేసారని అంటారు . ఎంత బాగా నేసారంటే విజయా వాళ్ళు గుర్తుకొస్తారు . అంత గొప్పగా స్క్రీన్ ప్లేను తయారుచేసుకుని , ఒక్క సీనుని కూడా తొలగించలేనంతగా దర్శకత్వం వహించారు దాసరి . ఇంక డైలాగులయితే చెప్పనలవి కాదు . తండ్రి యన్టీఆర్ డైలాగులతో ప్రేక్షకులు ఊగిపోవాల్సిందే . బాప్ రే ! ఏం డైలాగులు ! దాసరి రచన , దర్శకత్వ విశ్వరూపం .
పదే పదే గుర్తొచ్చేవి… పిచ్చివాడా నా అనుభవమంత లేదు నీ వయస్సు… మా వంటవాడు భారతీయుడు… ఇలాంటి డైలాగులు భలే పేలాయి… ఇంక యన్టీఆర్ . నాకయితే భలేగా నచ్చింది తండ్రి యన్టీఆర్ మేకప్ , గెటప్ . గెటప్పుని భలే డిజైన్ చేసారు దాసరి . మేకప్ ఎవరు చేసారో కాని బ్రహ్మాండంగా ఉంటుంది . ఇంక ఆయన నటన . తండ్రి పాత్రలో తన నట విరాటరూపాన్నే చూపారు . హేట్సాఫ్ . కొడుకు యన్టీఆర్ . డ్యూయెట్లలో పడుచు పిల్లోడులా కష్టపడ్డాడు . ఇరవై ఏళ్ళ శ్రీదేవికి ధీటుగా గంతులేసాడు .
https://www.youtube.com/watch?v=cOauxtEL-wk&ab_channel=TeluguOne
చక్రవర్తి పాటల సంగీతాన్ని అదరగొట్టేసాడు . నాకు అప్పటికీ ఇప్పటికీ చాలా ఇష్టమయింది బెనర్జీ బృందం బుర్రకధ . మహాకవి శ్రీశ్రీ వ్రాసిన బుర్రకధకు బెనర్జీ నటన , బాలసుబ్రమణ్యం గాత్రం , యన్టీఆర్ వీర , రౌద్ర రస నటన , దాసరి చిత్రీకరణ మహాద్భుతం . అల్లూరి పాత్ర పోషించాలనే తన కోరికను ఈ పాట ద్వారా తీర్చుకున్నాడు…
https://www.youtube.com/watch?v=q-i2U8kP9ug&ab_channel=ShalimarTelugu%26HindiMovies
నాలుగు డ్యూయెట్లలో యన్టీఆర్ , శ్రీదేవి ఇరగతీసారు . దాసరే వ్రాసిన తెల్లచీరె కళ్ళకాటుక పాటలో శ్రీదేవి స్లీవ్ లెస్ జాకెట్టుతో కుర్రకారుని ఉర్రూతలూగించారు . పందొమ్మిది వందల ఎనభై వరకు, ఉయ్యాలకు వయసొచ్చింది , హల్లో టెంపర్ పాటలు సూపర్ హిట్టయ్యాయి . సినిమా రిలీజయిన యాభై రోజులకు జ్యోతిలక్ష్మి డాన్సును కలిపారు . దాసరే వ్రాసారు . జ్యోతిలక్ష్మి చీరె కట్టింది పాట . చాలా హుషారుగా ఉంటుంది . ఎందుకు కలిపారో !!
శారద , గుమ్మడి , రావు గోపాలరావు , సత్యనారాయణ , అల్లు రామలింగయ్య , ప్రభాకరరెడ్డి , త్యాగరాజు , పండరీబాయి ప్రభృతులు నటించారు . ప్రేక్షకులు మరచిపోలేని నటన , పాత్ర మోహన్ బాబుది . తెల్ల ఆఫీసరుగా యన్టీఆర్ని ఎదుర్కున్నప్పుడు అతని డైలాగ్ డెలివరీ మరచిపోలేనిది . బహుశా ఆ డెలివరీ అతనికి మాత్రమే సాధ్యం .
ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్సుకు దర్శకుడు దాసరి దగ్గర నుండి ప్రతీ నటుడు , నిర్మాత , మేకప్ మేన్ , చక్రవర్తి , రాళ్ళెత్తిన ప్రతివాడూ కారణమే . 22 కేంద్రాల్లో వంద రోజులు ఆడిన ఈ సినిమా 300 రోజులు ఆడి డబ్బుల వర్షాన్ని కురిపించింది . ఈ సినిమా డైలాగుల ఆడియో కేసెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి .
ఇవన్నీ కాదు ; నలభై ఏళ్ళ తర్వాత కూడా ఈ సినిమాలో ప్రతీ సీను , డైలాగు నాలాంటోళ్ళకు ఇంకా గుర్తున్నాయి . అదీ ఈ సినిమా గొప్ప . తెలుగు సినిమా రంగంలో , యన్టీఆర్ కెరీర్లో , దాసరి చరిత్రలో ఓ మైలురాయి .
మాతరంలో చూడనివారు ఎవరూ ఉండరు . ఈతరంలో ఎవరయినా ఉంటే చాలా అర్జెంటుగా చూసేయండి . యూట్యూబులో ఉంది . An unmissable , entertaining , emotion-filled , great movie . వీర , రౌద్ర , శృంగార , శ్రావ్య సంగీత భరిత చిత్రరాజం . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు
Share this Article