.
రవితేజ… సినిమాల్లో నిలదొక్కుకోవడానికి నానా కష్టాలూ పడ్డాడు… నిలబడ్డాడు, ఎదిగాడు… మంచి నటుడు తెలుగు తెరకు దొరికాడని సినీ ప్రేమికులు కూడా ఆనందించారు… కానీ..?
సగటు తెలుగు హీరోల్లా… రొటీన్, ఫార్ములా, మూస పాత్రలకు పరిమితమై… టేస్టున్న ప్రేక్షకులకు దూరమయ్యాడు..,. జస్ట్, తనిప్పుడు ఓ సోకాల్డ్ మాస్ హీరో… అదే బాడీ లాంగ్వేజ్, అదే మొనాటనస్ పోకడ…
Ads
మొన్నామధ్య చెప్పుకున్నాం గుర్తుందా..? నీయమ్మని, నీ యక్కని, నీ చెల్లిని అని ఓ పాట చేశాడు… సినిమా పేరు మాస్ జాతర అట… పరమ దరిద్రపు లిరిక్స్… దీని మీద గతంలో ‘ముచ్చట’ కూడా ఓ కథనం ఇచ్చింది… ఇదీ లింకు…
నీయమ్మని, నీయక్కని, నీతల్లిని… ఈ డర్టీ సాంగ్‌కు సిగ్గూశరం లేని సమర్థన..!!
ఏదో ప్రెస్‌మీట్‌లో దర్శకుడు, హీరో, హీరోయిన్ నిస్సిగ్గుగా సమర్థించుకున్నారు కూడా… అది మరీ రోత యవ్వారం… ఇప్పుడు మరో లిరికల్ పాట యూట్యూబ్‌లో కనిపిస్తోంది… పాపం, రవితేజ టేస్ట్ చూసి నవ్వాలా, జాలిపడాలా అర్థం కాలేదు…
సూపర్ డూపర్ సూపర్ డూపర్ అని మొదలవుతుంది… జనం హిట్టు చేయకపోయినా మనమే రాసుకుంటే అయిపాయె… ట్యూన్ కూడా కాజల్ చెల్లివా, కరోనా కజిన్‌వా పాటకు పేరడీలాగా…
‘‘ఈ పాటకు రిథమ్ లేదు, పదం లేదు, కదం లేదు, అర్థం లేదు, పర్థం లేదు… స్వార్ణం గీర్థం అసలు లేదు’’ ఇవే ఫస్ట్ లైన్స్… ట్రూ, అక్షర సత్యం… తెలుగు సినిమా పాట ప్రస్తుతం కునారిల్లుతున్న దురవస్థకు సరిగ్గా అద్దం పడే పదాలు… ఈ పాట కూడా అంతే కదా…
‘‘ఈపాటకు స్కేలు లేదు, పెన్ను లేదు, కాగితం లేదు, తాళం లేదు, తలుపు లేదు… తలాతోకా లేనేలేదు…’’ ఇవి తరువాత వచ్చే లైన్లు… నిజం… అక్షరాలా నిజం, అంగీకరిస్తున్నాం రవితేజా… నిజంగానే ఈ పాటకు అవన్నీ లేనేలేవు…
‘‘ఈ పాటకు ట్యూనింగ్ లేదు, ప్లానింగ్ లేదూ, పల్లవి లేదు, చరణం లేదు, సెన్స్ లేదు, కామన్ సెన్స్ లేనేలేదు…’’ హబ్బ, ఎంత బాగా చెప్పాడో రచయిత… ఇప్పటికే మాంచి పాటలు రాస్తున్న కాసర్ల శ్యామ్ ఎట్సెట్రా ఇక సర్దుకొండి, మీ పనైపోయింది…
‘‘ఏదో సిచ్చువేషన్ ఉంటేనే హిట్టవుతుందా..? పెద్ద హిట్టవుతుందా..? సిగ్నేచర్ స్టెప్పు ఉంటేనే బ్లాక్ అవుతుందా, బ్లాక్ బస్టవుతుందా..?
‘‘పబ్లిసిటీ ఉంటేనే ట్రెండవుతుందా..? ఫుల్లు ట్రెండవుతుందా..? ప్రమోషన్ చేస్తేనే వ్యూస్ వస్తాయా..? మిలియన్ వ్యూస్ వస్తాయా..? రేడియోలో రాకున్నా, యూట్యూబులో వినకున్నా… మౌత్ టాకుతోనే మోత మోగిపోద్దిలే…
ఈ పాటకు సింగర్ లేడు, రైటర్ లేడు, డాన్సర్ లేడు, సౌండ్ లేదు, గ్రౌండ్ లేదు… నేమ్ ఫేమ్ లేనే లేదు…’’ అవును మరి, సగటు తెలుగు సినిమా పాటకు ఇవన్నీ ఎందుకు..? వద్దు గురూ, అసలు వద్దే వద్దు… ఇలాంటి పాటలకు కొరియోగ్రఫీ చేయడంలో బాగా ఖ్యాతి తెచ్చుకున్న శేఖరే దీనికీ నృత్యదర్శకుడు అట…
‘‘చావు కాడ, పెళ్లి కాడ, మంచి కాడ, చెడ్డ కాడ, మందూ పార్టీ కాడ, పార్టీ మీటింగు కాడ… ఆటో నుంచి ఆడి దాకా, లోకల్ నుంచి ఫారిన్ దాకా… దావత్తులు, పబ్బులల్ల మోగేదీ పాటరా…’’ వావ్, చావు కాడ కూడా ఈ పాటే పాడుకుంటారట…
‘‘అమ్మ నాయన అక్క చెల్లి అన్న తమ్మి బావ బావమరిది అత్త షడ్డకుడు అందరొక్కచోట కూడి పాడుకునే పాటరా… చల్ దుంకు, నువ్ ఎగురు, నువ్వు దరువెయ్, నువ్వు షురూ చెయ్…’’
చదివారు కదా… అద్భుతమైన సాహిత్యం… గీత రచయిత ఎవరో గానీ తననేమీ అనడానికి లేదు… నిర్మాత, దర్శకుడు, హీరోల అద్భుత అభిరుచి అది, వాళ్లు కోరినట్టు…. నిజంగానే ఏ పాట లక్షణాలూ లేని పాటను రాసి వాళ్ల వైపు విసిరేసి ఉంటాడు…
శ్రీలీల… ఎప్పటిలాగే, అన్ని సినిమాల్లోలాగే… ఏవో పిచ్చి డ్రెస్సులతో, ఒళ్లంతా ఊపుతూ, జుట్టు రేపుతూ… మూస స్టెప్పులు వేసింది… అంతే, ఆమె కెరీర్ ఇలాగే… ఆమె పాత్రల ఎంపికకు అభినందనలు, ఇప్పటికే జనానికి ఆసక్తి పోయింది… ఇలాంటి పాటలే చేస్తూ… నువ్వు దుంకు, నువ్వు ఎగురు…
రవితేజదేముంది..? వయస్సయిపోతోంది… 57 దాటుతున్నాడు… పోయిందేముంది తనకు..? ఎటొచ్చీ శ్రీలీలకే ఇంకా మస్తు కెరీర్ ఉన్నా సరే, పైసల కోసం ఈ తిక్క పాటలు..!!
Share this Article