Taadi Prakash…………….. ఆధునిక తెలుగు కవిత్వం పుట్టినరోజు
satire, sarcasm… Sharp weapons of Sri Sri
——————————————————————
శ్రీశ్రీ ఆయువుపట్టు హాస్యంలో, వ్యంగ్యంలో వుంది…
మాంత్రికుడి ప్రాణం ఎక్కడో మర్రిచెట్టు తొర్రలోని చిలకలో వున్నట్టు!
వెక్కిరింత శ్రీశ్రీ వెపన్.
అవతలివాడు కవి, రచయిత, రాజకీయ నాయకుడు, కమ్యూనిస్టు వ్యతిరేకి, పండితుడు… ఇలా ఎవరైనా సరే తిట్టాలనుకుంటే వాళ్ళని అయిదారు లైన్ల చిట్టి కవితతోనే పడగొట్టేవాడు.
ఆనాడూ ఈనాడూ హాస్యానికి విలువ కద్దు
సాహిత్య సభాంగణాన వ్యంగానిది మొదటి పద్దు
అన్నారాయన.
*
ఖగరాట్ కృషి ఫలితంగా
పొగాకు భూలోకమందు పుట్టెనుగానీ
పొగచుట్టలెన్నియైనను
సిగిరెట్టుకు సాటిరావు సిరిసిరిమువ్వా!
*
ఎప్పుడుపడితే అప్పుడు
కప్పెడు కాఫీ నొసంగ గలిగిన సుజనుల్
చొప్పడిన యూరనుండుము
చొప్పదకున్నట్టియూర చొరకుము మువ్వా!
విప్లవాలు, సాయుధ పోరాటాల కోసం కాకుండా కేవలం సరదా కోసం యిలా శ్రీశ్రీ రాసినవి ఎంతో బావుంటాయి.
వ్యంగ్యం దివ్యౌషధం
ఇక శ్రీశ్రీ మాటల గారడీ గురించి చెప్పేదేముందీ!
శబ్దం. అలంకారం, సౌందర్యం, వెటకారం కలగలిపి నాలుగు దిక్కుల్నించీ ఒకేసారి దాడి చేస్తాడు. చదువరిని పరవశింప చేస్తాడు.
for poetry words are an excellent order of amusement – అన్నారుగా!
ఆ పదునైన భాషే ఆకర్షణ. భాషాసౌష్టవమే భావానికి తేజస్సు సమకూరుస్తుంది.
హాస్యం వెర్రితనం కాదనీ, వెకిలితనం కానేకాదనీ చెప్పాడాయన.
సమస్యలు అమావాస్యలైతే అవశ్యకరణీయాలు
హాస్యకిరణాల ప్రసారణాలురా శిష్యా … అన్నాడు.
*
తలకాయలు తమతమ జే
బులలోపల దాచుకొనుచు పోలింగుకు పో
వలసిన రోజులు వస్తే
సెలవింక డెమోక్రసీకి సిరిసిరిమువ్వా!
*
నేనూ ఒక మూర్ఖుణ్నే
ఐనా నాకన్న మూడులగపడుతుంటే
ఆనంద పారవశ్యము
చే నవ్వక తప్పలేదు సిరిసిరిమువ్వా!
*
భోషాణ ప్పెట్టెల్లో
ఘోషా స్త్రీలను బిగించి గొళ్ళెం వేస్తూ
“భేషు బలే బీగా”లని
శ్లేషించెను సాయిబొకడు సిరిసిరిమువ్వా!
అని ఈజీగా చమత్కరిస్తాడు శ్రీశ్రీ.
******
‘స్మశానాల వంటి నిఘంటువులు’ అని శ్రీశ్రీ అనడం మృతభాషని వదిలించుకోమనే!
అంటే వచనం అయినా, కవిత్వమైనా పంటకాల్వ లాంటి ప్రజల భాషలో ప్రవహించాలని చెప్పడమే.
and language is the goldmine of thought అనికదా పెద్దలు అన్నది.
శ్రీశ్రీ గనక విప్లవ కవి కాకుండా వుంటే విశ్వనాథ సత్యనారాయణ అంతటి క్లాసికల్ కవి అయ్యుండేవాడు. అలవిమాలిన పాండిత్యంతో బహుశా విశ్వనాథని మించిపోయేవాడేమో!
కంద పద్యం ఛందస్సుని ప్రేమిస్తూ…
అందంగా, మధురస ని
ష్యందంగా, పటితృ హృదయ సంస్పందంగా
కందా లొకవంద రచిం
చిందికి మనసయ్యె నాకు సిరిసిరిమువ్వా!
అన్నారు శ్రీశ్రీ ఆ శతకంలో.
నాటి మహాకవులు తిక్కనకీ, పోతనకీ ఏమాత్రమూ తీసిపోనివాడు శ్రీశ్రీ అని నాతో పెద్ద తెలుగు కవులు నలుగురైదుగురు అన్నారు.
శ్రీశ్రీ తన గురించి తానే ఎంతో భరోసాతో యిలా చెప్పుకున్నాడు :
నరవానర కిన్నెర శేఖర దానవ యక్షశుద్ధ
సాధ్యాసాధ్యాతి రథమహారథుల భవత్ చిర
కీర్తిని పొగుడుతారు శ్రీశ్రీ గారూ!
******
1934 – 37 సంవత్సరాల్లో మహాకవి ఎగరేసిన నవ్య కవితా పతాక నేటికీ రెపరెపలాడుతోంది గనకనే కాళోజీ అంతటివాడు –
నీవు రాసిపారేసిన కవితలు గుబాళిస్తుంటే
నీవు త్రాగిపారేసిన సీసాల సంగతి మాకేల – అన్నాడు, ఎంతో ప్రేమతో.
******
తేనెకు సీసా, బంగరు
పళ్ళెమునకు గోడ చేర్పు కావాలి సరే
మధుకనక ప్రాముఖ్యం
సీసా గోడలకు లేదు సిరిసిరిమువ్వా!
*
బారెట్లా అయితే సాం
బారెట్లా చెయ్యగలడు? భార్య యెదుట తా
నోరెట్లా మెదిలించును?
చీరెట్లా బేరమాడు సిరిసిరిమువ్వా!
*
మనుషుల గురించి కవి నిర్వచనం చూడండి :
ఇస్పేటు జాకీలం / ఎగేసిన బాకీలం
మృత్యువు సినిమాలో / మూడు భాషల టాకీలం
భగవంతుని టోపీలం / కవిత్రయపు కాపీలం
గోరంతల కొండంతలం
ఒకటికి రెండింతలం!
మనిషిని చాచికొట్టి, చావచితగ్గొట్టి యిలా హేళన చేయడం ఎంత సహజంగా వుందో అంత నవ్విస్తుంది కూడా!
******
ఇవన్నీ శ్రీశ్రీ 50, 60 ఏళ్ల క్రితం రాసినవే. ఇప్పటి తరం గురించి ఒక కవిమిత్రుడు కబుర్లు చెబుతూ, “వీళ్ళకా! సరుకు తక్కువ సందడెక్కువ” అన్నాడు. శ్రీశ్రీని మళ్లీమళ్లీ చదువుకోవాల్సిన అవసరం వుంది. శ్రీశ్రీ సిద్ధాంతంతో విభేదించవచ్చు. నక్సలిజాన్నీ, హింసనీ ఆయన సమర్థించడం మనకి నచ్చకపోవచ్చు. ఆయనకిద్దరు భార్యలని రంగనాయకమ్మ కంప్లయింట్ చేయొచ్చు. శ్రీశ్రీ తాగుతాడని కొందరు ఈసడించవచ్చు. కానీ, తెలుగు సాహిత్యానికీ, కవిత్వానికీ ఆయన కాంట్రిబ్యూషన్ని ఎవరూ కాదనలేరు. ‘ఫిరంగిలో జ్వరం ధ్వనించే మృదంగ నాదం’ లాంటి కవిత్వమే కాదు, అనువాదాలు, గల్పికలు, నాటకాలు, లిమరిక్కులు, విమర్శనా వ్యాసాలు, హాస్యంతో అలరారే ప్రశ్నలూ, జవాబులూ. యివేనా, యింకా ఎన్నో… ఎన్నెన్నో…
అలనాటి చలం, విశ్వనాథ, కృష్ణశాస్త్రి, అబ్బూరి … శ్రీశ్రీ కవిత్వాన్ని అనుభవించి పలవరించారు. ఇప్పటి శివారెడ్డి, శిఖామణి, విమల, సీతారాం, అఫ్సర్, గోరటి వెంకన్న, ప్రసాదమూర్తి, నూకతోటి రవికుమార్ దాకా అందరూ శ్రీశ్రీ కవిత్వాన్ని ప్రేమించినవాళ్ళే. శ్రీశ్రీ నినాదాలు చేస్తూ మెరుపు వేగంతో నడిచివెళ్ళిన దారుల్లోనే తమని, తమ కవిత్వాన్ని డిస్కవర్ చేసుకున్నవాళ్ళే.
******
రష్యన్ మహారచయిత ఆంటన్ చెహోవ్ ప్రపంచ ప్రసిద్ధ నాటకం the cherry orchard (1904) ని ‘సంపెంగ తోట’ అని శ్రీశ్రీ అనువదించారు. కారల్ చాపెక్ రాసిన mother అనే గొప్ప నాటకాన్ని ‘అమ్మా’ అని అనువదించారు.
ఆధునిక కవిత్వంలో శ్రీశ్రీ చెయ్యని ప్రయోగం అంటూ లేదు. శ్రీశ్రీ ఒక్కడే … ఒక విజ్ఞాన సర్వస్వం అనే వెలకట్టలేని బహుమానాన్ని మనకిచ్చి వెళిపోయాడు.
వాడెవడో పాత విప్లవ చాదస్తపు కవి అని కొట్టిపారేయకుండా యీ తరం శ్రీశ్రీని చదువుకోవాలి. మేం శ్రీశ్రీని చదువుకున్నాం అని గర్వంగా చెప్పుకోగలగాలి. ఇది కేవలం wishful thinking గా, అరణ్యరోదనగా మిగిలిపోయినా సరే!
******
“అసలు మా ఇంటిపేరు పూడిపెద్ది. శ్రీరంగం నారాయణబాబు తాత గారి అన్న శ్రీరంగం సూర్యనారాయణ మా నాన్న గారిని దత్తత చేసుకున్నాడు. అందువల్ల శ్రీరంగం శ్రీనివాసరావు అయ్యాను అని శ్రీశ్రీ ఒకసారి చెప్పారు.
1970వ దశకంలో ఆంధ్రజ్యోతి వార పత్రికలో ప్రశ్నలూ – జవాబులు బాగా పాపులర్.
వాటిల్లోంచి కొన్ని గుర్తు చేసుకుందాం.
మీరు చెప్పే పోరాటమంటే, సాయుధ పోరాటమే కదా?
శ్రీశ్రీ : చీపురు పుల్లలతో విప్లవం రాదు.
నేటికాలంలో రచయితలు ఎక్కువగా శృంగారాన్ని వాడుతున్నారు. మీ అభిప్రాయం?
శ్రీశ్రీ : ఏ కాలంలో తక్కువగా వాడారు?
నాటక కళ అంటే ఏమీ తెలీనివాళ్లూ, రంగస్థలం మీద నిల్చోబెడితే పారిపోయేవాళ్లూ గిరీశం పాత్ర గురించీ, నాటక రచనల గురించీ ఎలా సమీక్షిస్తారో అర్థం కాదు. మీరేమంటారు?
శ్రీశ్రీ : ఏమంటాను. వంకాయ కూర మీద అభిప్రాయం చెప్పడానికి వంటమనిషి కానక్కర్లేదంటాను.
మన తెలుగు సినిమాల్లో కొన్ని పాటలు వినలేకపోతున్నాం. ఆవిధంగా రాయాలని ఏమైనా నిబంధన వుందా?
శ్రీశ్రీ : ఏమీ లేదు. ఇష్టంలేని పాటలు వినమని నిర్బంధం కూడా లేదు.
దేశంలో అక్కడక్కడ భూస్వాములపై నక్సలైట్లు జరుపుతున్న దాడులపై మీ అభిప్రాయం ఏమిటి?
శ్రీశ్రీ : అయ్యయ్యో, అక్కడక్కడ మాత్రమేనా అని.
ఓసారి ఒక పెద్దాయన అడిగిన తాత్విక ప్రశ్నకు సమాధానంగా చెప్పిన ఒక జోక్.
శ్రీశ్రీ : “ఇంకో 500 కోట్ల సంవత్సరాల్లో ఈ భూమి మరో గ్రహంతో ఢీకొని నాశనమైపోతుంది” అని ఒక ఖగోళ శాస్త్రజ్ఞుడు అంటూవుండగా, “పరాకుగా విన్నాను. ఎన్నేళ్లో మళ్లీ చెప్పండి” అని అడిగాడొక సామాన్యుడు.
శాస్త్రజ్ఞుడు : 500 కోట్ల సంవత్సరాలు.
సామాన్యుడు : హమ్మయ్య, రక్షించేరు. అయిదు కోట్లే అనుకున్నాను.
మీరు కూడా సినిమా పాటలు రాస్తున్నారే. మావలె మీక్కూడా ఆర్థిక బాధలున్నాయా?
శ్రీశ్రీ : ఎంత చెట్టుకి అంత గాలి. పీత కష్టాలు పీతకుంటాయి.
సినిమా రంగం మీద శ్రీశ్రీ కామెంట్ :
సినిమా గొప్ప ఆయుధమని మన రాజకీయ పార్టీలు గుర్తించలేదు. తమిళనాడులో గుర్తించాయి. ఇంతకూ తెలుగు సినిమా రంగంలో చాలామంది కాముకులే గాని అభ్యుదయ కాముకులు కాదు. అంచేత ఈ ఊబిలోంచి బైటపడాలని కొన్నాళ్లుగా అనుకుంటున్నాను.
మిమ్మల్ని నేటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేస్తే, తెలంగాణా పరిష్కారానికి మీరు తీసుకునే ప్రథమ చర్య ఏమిటి?
శ్రీశ్రీ : ముఖ్యమంత్రి పదవికి రాజీనామా యివ్వడం.
ఒక స్త్రీని ఒక పురుషుడు ప్రేమించి చివరికి విఫలుడై జీవితం మీద విరక్తి చెందితే, అతనికి మీరిచ్చే సలహా?
శ్రీశ్రీ : ఇంకో స్త్రీని ట్రై చేసి చూడమని.
మీరు సినిమా కవిగా స్థిరపడ్డారు కదా. అది మీ సామ్యవాద కవిత్వానికి దోహదకారి అయిందా?
శ్రీశ్రీ : పుడోవ్ కిన్ (ప్రపంచ ప్రసిద్ధ రష్యన్ డైరెక్టర్ – ఫిల్మ్ టెక్నిక్ రచయిత) సినిమా ఇరవయ్యో శతాబ్దపు కళ అన్నాడు. ఆ కళని పెట్టుబడిదారీ విధానం prostitute గా చేసింది. Prostitute అయినందువల్ల స్త్రీత్వం ఎక్కడ పోతుంది? అలాగే కళ విలువ కూడా తగ్గదు. బాగుకీ, భ్రష్టుకీ కూడా సినిమా వినియోగపడుతుంది.
ప్రకాష్ : కవి శేషేంద్ర శర్మ గురించి మీరేం అనుకుంటున్నారో కచ్చితంగా చెప్పండి.
శ్రీశ్రీ : గోడ మీద కోకిల
పురాణం సుబ్రహ్మణ్యశర్మ : మీ గేయాల్లో మీకు బాగా ఇష్టమైందేది?
శ్రీశ్రీ : శరశ్చంద్రిక. ముందు రేడియోలో చదివా. (1954, దసరా) కృష్ణా పత్రిక, విశాలాంధ్ర లో కూడా వేశారు.
పురాణం : పోయెం మీకు గుర్తుందా?
శ్రీశ్రీ : నవీన విశ్వవిద్యాలయాల్లో
పురాణ కవిత్వం లాగా
శ్రవణయంత్రశాలల్లో
శాస్త్రీయ సంగీతం లాగా
ఇలా వచ్చేవేం వెన్నెలా?
ఎలా వర్ణించను నిన్ను?
అంటూ మొదలెట్టి మధ్యలో ఎక్కడో … ఎలాగైనా నువ్వు మాకు ఏకరక్త బంధువ్వి అన్నాను చందమామని. మానవుని మేనమామ చందమామ. అదివరకు ‘ఒక రాత్రి’లో ..
‘ఆకాశపుటెడారిలో కాళ్లు తెగిన
ఒంటరి ఒంటెలాగుంది జాబిల్లి’ అన్నాను. ఇది విశ్వనాథ సత్యనారాయణకి బాగా నచ్చింది. ఆయనకి క్లాసికల్ ఇమేజెస్ చాలా యిష్టం.
“ఎవరో సంస్కృత మహాకవులు చెప్పాల్సింది, వీడు చెప్పాడు” అన్నాట్ట ఎక్కడో.
సుఖమైన జీవితం నుండి కష్టాల ప్రాంగణంలోకి అడుగు పెట్టినపుడు మీరెలా ఫీలయ్యారు?
శ్రీశ్రీ : నేనెప్పుడూ optimist (ఆశావాది) నే. అందుకే బూర్జువా శ్రీశ్రీ నుండి రెబెల్ శ్రీశ్రీ తయారయ్యాడు.
******
శ్రీశ్రీ సినిమా కబుర్లు చాలా బావుంటాయి. అప్పట్లో వాసన్ అనే ప్రసిద్ధ నిర్మాత వుండేవాడు.
ఆయన మీద శ్రీశ్రీ జోకు :
సినిమా హిట్టయితే వాసన్
ఫ్లాపయితే ఉపవాసన్
రిపబ్లిక్ ప్రొడక్షన్స్ వారి పాత ‘బొబ్బిలి యుద్ధం’ సినిమాలో సూపర్ హిట్ పాట “అందాల రాణివే నీవెంత జాణవే” శ్రీశ్రీ రాశారు.
సినిమాలో ఒక జావళి వుండాలని బొబ్బిలి యుద్ధం దర్శక నిర్మాత సీతారాం భావించారు. జావళి రాయగలవాళ్ళెవరు? ఆయన ధైర్యం చాలక ఎస్ రాజేశ్వరరావుతో శ్రీశ్రీని అడిగించారు. శ్రీశ్రీ అలవోకగా రాసిన జావళి :
నినుజేర మనసాయెరా, స్వామి
తనువార నను జేరరా… అంటూ ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు.
******
చివరిమాటగా ఒక పాట :
శ్రీశ్రీ రాసిన మొదటి రెండు మూడు సినిమా పాటల్లో ఒకటి ‘ఆహుతి’ చిత్రానికి రాసింది.
‘అమర దేశం’ (1956) సినిమాలో శ్రీశ్రీ పాట ఇది. కేవలం రికార్డు కోసం పాటంతా యిస్తున్నాను.
మానసలాలస సంగీతం
మధుమయ జీవన సంకేతం
నూతన చేతన సంగీతం
మధుమయ జీవన సంకేతం
నూతన చేతన సంచలిదంచిత
సమాజ జీవన సంకేతం … నూతన చేతన సంగీతం
వంచిత పీడిత జనసందోహపు
పాంచజన్యరవ సంకేతం … నూతన చేతన …
రాగభావమున పశువులు శిశువులు
పాములు పరవశమందాలీ
జీవగాన చైతన్యవంతమై
భావవేగమున జనగణమనముల
ఉడుకు నెత్తురే పొంగాలీ
ఈ సోమరితనమే పోవాలీ
ఈ సోమరితనమే పోవాలీ …
… మానసలాలస సంగీతం
******
Poets own punch :
self – portrait
విదూషకుడి temperament
ఏదో ఒక discontent
బ్రదుకుతో experiment
పదాలు patent, రసాలు torrent
సదసత్సమస్యకి solvent
శ్రీశ్రీ giant
మహాకవికి 111 వ జన్మదిన శుభాకాంక్షలు.
చివరిమాట :
కొన్నేళ్ల క్రితం ఆర్టిస్ట్ అన్వర్ వేసిన ఈ శ్రీశ్రీ బొమ్మ బాపు గారికి బాగా నచ్చింది. ఆయన ప్రత్యేకంగా అన్వర్ కి ఫోన్ చేసి శ్రీశ్రీ బొమ్మ భలేగా వేశావని మెచ్చుకున్నారు.
– TADI PRAKASH 9704541559
Share this Article