Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సావాసగాళ్లు గుమ్మడి, సత్యనారాయణలు కూడా డాన్సులు చేశారు..!!

October 2, 2024 by M S R

నాకు బాగా నచ్చిన సంసారపక్షమైన సినిమా . సందేశాత్మక కధ . మంచం ఉన్నంతవరకే కాళ్ళు చాపుకోవాలి . చెంబులో ఉన్న నీళ్ళతోనే కాళ్ళు కడుక్కోవాలి . One should not bite more than what he can chew . మనిషి ప్రశాంతంగా జీవించటానికి కావలసిన సందేశం ఉన్నది ఈ సినిమాలో . 1977 లో వచ్చింది .

ఇద్దరు సావాసగాళ్ళు . ఒకరేమో ఉంగరాల సాంబయ్య అనబడే బడాయి బసవయ్య . మరొకరు ఉన్నదానితో మట్టసంగా సంసారాన్ని నడిపించే సత్యం . సాంబయ్యగా సత్యనారాయణ నటన బ్రహ్మాండం . సత్యంగా నటించిన గుమ్మడి చక్కగా నటించారు . ఒకరంటే ఒకరికి చాలా అభిమానం , ప్రేమ , ఇష్టం .

మరో రెండు జోడీల సావాసగాళ్ళు . సాంబయ్య కూతురు రాణిగా ప్రభ , సత్యం కూతురు సీతగా జయచిత్ర . వీళ్ళు కూడా సావాసగాళ్ళే కానీ తండ్రులంత కాదు . మరో సావాసగాళ్ళ జోడీ కృష్ణ , గిరిబాబు . కృష్ణ , జయచిత్రలు ఒక జంట . గిరిబాబు , ప్రభ ఒక జంట . మొదటి జంట మట్టసంగా కుటుంబాన్ని నడుపుకునే వాళ్ళు . రెండో జంట స్పీడు స్పీడుగా బండి నడుపుతూ బొక్కబోర్ల పడేవాళ్ళు .

Ads

ఈ కాంట్రాస్టులను చాలా ప్రస్ఫుటంగా చూపారు దర్శకుడు బోయిన సుబ్బారావు . ఆయనకు ఇదే మొదటి సినిమా . మంచి బోణీనే . తర్వాత చాలా సినిమాలకు దర్శకత్వం వహించారు . సురేష్ , విజయా , AVM వంటి బేనర్లకు నిర్మాతలే కధను , స్క్రీన్ ప్లేను తయారు చేసుకుంటారు .

రామానాయుడు నిర్మాతగా ఉన్న ఈ విజయా – సురేష్ కంబైన్స్ సినిమాలో నిర్మాతల కంట్రిబ్యూషన్ కనిపిస్తుంది . మెయిన్ కధకు సమాంతరంగా ఓ పిట్టకథ నాగేష్ , రమాప్రభ , అల్లు రామలింగయ్యలది నడుస్తూ ఉంటుంది . ఆ హాస్యానికి రూపకల్పన అప్పలాచార్య చేసారు . అపహాస్యం కాలేదు . బాగానే ఉంటుంది . మోదుకురి జాన్సన్ డైలాగులు పదునుగా ఉంటాయి .

జె వి రాఘవులు సంగీత దర్శకత్వంలో పాటలు బాగుంటాయి . ఆత్రేయ వ్రాసిన కుచ్చిళ్ళు జీరాడు కోక కట్టి పాట బాగుంటుంది . జీరాడు కుచ్చిళ్ళు . భలే పదాన్ని ప్రయోగించారు ఆత్రేయ . జీరాడు అనే మాట జనం సాధారణంగా ఉపయోగించటం చూడం . చూస్తామా !? మోదుకురి జాన్సన్ వ్రాసిన గోంగూరకే పాట చాలా హుషారుగా ఉంటుంది . ఎందుకోననుకుంటి గోంగూరకు వంటి జానపద పదాలు కాలేజి స్టేజిల మీద చూస్తుంటాం . అలాంటి అల్లరి పాటను పెట్టారు . ఆ పాటకు తగ్గట్టుగానే జయచిత్ర చలాకీగా అందరినీ తన వానర బృందంతో అల్లరి చేస్తుంది .

కొసరాజ వ్రాసిన జాతర పాట బంగారు తల్లివి నీవమ్మ అనే మూకుమ్మడి డాన్స్ పాటను బాగా చిత్రీకరించారు . సోగ్గాడు , దసరా బుల్లోడు వంటి సినిమాల్లో చూసిన ఊరు ఊరంతా పాల్గొనే డాన్స్ . గుమ్మడి , సత్యనారాయణలు కూడా ఎగురుతారు .

ఆనందమానందమాయె అందాల బొమ్మకు సిగ్గాయెనే , జాగేల ఏలరా , తొక్కుడు బండీ ఓ లబ్బరు బండి అబ్బి అనే మరో ఆట పట్టించే పాట , మిగిలిన పాటలూ శ్రావ్యంగా ఉంటాయి . సినిమాలో కృష్ణ , జయచిత్ర డ్యూయెట్లు , చలాకీ నటన బాగుంటాయి . కృష్ణ చాలా ఫ్రెష్ గా , యంగ్ గా కనిపిస్తారు .

జయచిత్ర , ప్రభ ఇద్దరూ బాగా నటించారు . ఇంక సత్యనారాయణ , గుమ్మడి జీవించేసారు . వాళ్ళిద్దరి సావాసం ముచ్చటగా ఉంటుంది . అలాంటి సావాసగాళ్ళు ఈరోజుల్లో ఉంటారా అని అనిపిస్తుంది . Fair weather friends కాలం కదా !

కమర్షియల్ గా కూడా బాగా సక్సెస్ అయింది . హైదరాబాద్ , గుంటూరు , విజయవాడ , కాకినాడ , విశాఖపట్నం సెంటర్లలో వంద రోజులు ఆడింది . మద్రాస్ విజయా గార్డెన్సులో వంద రోజుల వేడుకలు జరిగాయి . సినిమా యూట్యూబులో ఉంది . తప్పక చూడండి . ముఖ్యంగా కుర్రాళ్ళు , మధ్యవయస్కులు తప్పక చూడాలి . కుటుంబాలను ఎలా మట్టసంగా నడుపుకోవాలో తెలుస్తుంది . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు…….. (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒకే గది… ఒకే రోజు… కథ అక్కడక్కడే తిరిగే ‘షో టైమ్’… రక్తికట్టింది…
  • ఐదు రోజుల టెస్టు మ్యాచ్ 3 BHK… ప్రేక్షకులకు కావల్సింది T20 ….
  • వావ్, మళ్లీ కేవీపీ కనిపించాడు… అద్సరే గానీ సర్కారు గౌరవానికి రోశయ్య అర్హుడే…
  • భార్యా రూపవతీ శత్రుః….. కాదు, కాదు… భర్తా రూపవాన్ శత్రుః…
  • అయ్యో, తమ్ముడూ… ఎమోషన్, యాక్షన్ రెండూ ‘లయ’తప్పాయి..!!
  • Walk Of Fame Star… ఈ అంతర్జాతీయ గౌరవాన్ని దీపిక ‘కొనుక్కుందా..?!
  • ఓహో, నువ్వు సినిమా హీరోయిన్‌వా..? నేనెప్పుడూ నిన్ను చూడలేదమ్మా..!!
  • సరిగ్గా కుదరాలే గానీ… బేజా ఫ్రై టేస్టు… ఆరోగ్యానికి బెస్టు… ఇప్పుడిదే ట్రెండు…
  • రెండు శత్రు దేశాల్లోనూ ఒకడే జాతీయ హీరో… ఇంట్రస్టింగ్…
  • ఎస్వీరంగారావు… మెగా ఆర్టిస్టే కాదు… మెగాఫోన్ పట్టాడు, పైసలూ పెట్టాడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions