ప్రియాంక గంగలో మునిగి స్నానం చేస్తోంది…. తప్పదు… నేను హనుమాన్ భక్తుడిని, ఢిల్లీ సీనియర్ సిటిజెన్స్‌ను అయోధ్య యాత్రకు ప్రభుత్వ ఖర్చుతో పంపిస్తానంటున్నాడు కేజ్రీవాల్… తప్పదు… నేను బ్రాహ్మణ మహిళను, రోజూ చండీపారాయణం చేస్తే తప్ప బయటికి రాను, నాకన్నా పెద్ద హిందువు ఎవరూ లేరంటోంది మమత… తప్పదు… హనుమాన్ చాలీసా నిత్యపారాయణం మొదలుపెడుతున్నామంటోంది కవిత… తప్పదు… నాకన్నా పెద్ద హిందువు ఎవరో చూపించండి అంటాడు కేసీయార్… తప్పదు… స్వాముల వారి ఎదుట చేతులు కట్టుకుని కూర్చుని ఆశీస్సులు పొందుతూ, దేవుళ్లకు పట్టువస్త్రాలు మోస్తూ కనిపిస్తాడు జగన్… తప్పదు… శబరిమలపై పాత వైఖరి మార్చుకుని సైలెంట్ అయిపోతుంది కేరళ సీపీఎం… తప్పదు… శారదాపీఠం వెళ్లి శాలువా కప్పుకుని ఆశీస్సులు పొందుతాడు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ… తప్పదు… నాస్తికత్వ, హేతువాద ధోరణులకు అన్నాడీఎంకే వంటి ద్రవిడ పార్టీల కేడర్ మంగళం పాడేస్తున్నయ్… తప్పదు…
ఎందుకు తప్పదు అంటే తప్పడం లేదు కాబట్టి… మైనారిటీలను బుజ్జగించడమే లౌకికవాదమనీ, హిందూ పదం ఉచ్చరిస్తేనే మతవాదులం అయిపోతామనీ భావించే ఓ భ్రమాత్మక సెక్యులరిజం నుంచి బయటపడుతూ… సాఫ్ట్ హిందుత్వ అనే ఓ కొత్త బాటలోకి లౌక్యపు అడుగులు వేస్తున్నాయి లౌకికపార్టీలు… వేయించబడుతున్నయ్… ఎందుకు..? సెగ తగులుతోంది… బీజేపీ మతం పేరిట సాగిస్తున్న రాజకీయం వాటికి సురుకు పుట్టిస్తోంది… మైనారిటీ వోట్లు ఓ వోటుబ్యాంకుగా ఉపయోగపడుతూ… హిందూ వోట్లు చీలిపోతూ… ఎవరు మైనారిటీలపై ఎక్కువ ప్రేమ చూపిస్తే వాళ్లకే లబ్ధి ఇన్నాళ్లూ… దాన్నే అస్త్రంగా బీజేపీ మార్చుకుంటోంది… హిందూ సంఘటనపైనే కాన్సంట్రేట్ చేస్తోంది… నిజానికి అద్వానీ అయోధ్య రథయాత్ర సమయంలో కూడా ప్రత్యర్థి పార్టీలను హిందుత్వ వైపు నెట్టేయడం సాధ్యపడలేదు… కానీ ఇప్పుడు ఓ మార్పు మెల్లిమెల్లిగా కనిపిస్తోంది… లౌకిక పార్టీలను వాటి పాత ధోరణుల నుంచి విరుద్ధ దిశకు నెట్టేస్తోంది… మొరాయిస్తూనే అటువైపు అడుగులు వేస్తున్నాయి చాలా పార్టీలు… ఏమిటీ సాఫ్ట్ హిందుత్వ..?
Ads
బీజేపీ ప్రయోగించే హిందుత్వ అస్త్రానికి ఓ విరుగుడు ఇది… మేమూ హిందువులమే, మేమూ దేవుడి భక్తులమే, కానీ మేం మతరాజకీయాలు చేయం అని చెప్పడానికి… వాళ్ల హిందుత్వాన్ని, దైవభక్తిని ప్రదర్శించడం…! అయితే ఇది వర్కవుట్ అవుతుందా..? బీజేపీ మత రాజకీయానికి ఇది వేక్సిన్ అవుతుందా..? అకస్మాత్తుగా మొహం మీదకు వస్తున్న నామాలు, చేతులకు రుద్రాక్షల కంకణాలు, నోటి నుంచి వెలువడే మంత్రాలు, మేమూ బ్రాహ్మలమే సుమీ అనే కులప్రస్తావనలు బీజేపీని కౌంటర్ చేయగలవా..? ఈ హఠాత్ హిందుత్వాలు ప్రజల్ని నమ్మించగలుగుతున్నాయా..? ఇది ఓ డిబేట్… ఎందుకంటే..? మొన్నటి గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ హిందూ అస్త్రాన్ని బ్రేక్ చేయడానికి టీఆర్ఎస్ నానా అవస్థలూ పడింది… కేసీయార్ యాగాల్ని, యాదాద్రి నిర్మాణాన్ని పదే పదే ఫోకస్ చేయడంతోపాటు మజ్లిస్‌తో తమకు అసలేమీ సంబంధం లేనట్టుగా నానా ప్రచారాలూ చేసుకుంది… కానీ ప్రజలు పెద్దగా విశ్వసించలేదు… ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు ఎమ్మెల్సీల ఎన్నికల్లో హిందుత్వ ప్రచారంకన్నా పీవీ ఠీవి, పీఆర్సీ హామీల వైపు డైవర్ట్ అయిపోయింది…
ఇప్పటికీ బీజేపీకి హిందుత్వే దిక్కు… పాలనలో అనేకానేక వైఫల్యాలున్నా సరే రాముడే తమను ఎప్పటికప్పుడు గట్టెక్కిస్తాడనేది దాని నమ్మకం… ప్లస్… దేశాభిమానం, జాతీయవాదం అనే బ్రహ్మపదార్థాల వంటి నినాదాలు సరేసరి… అయోధ్య పేరిట వచ్చినవి 2100 కోట్లు… ఆ డబ్బు అయోధ్య ట్రస్టుకు పెద్ద సమస్యేమీ కాదు… కానీ చందాల పేరిట సంఘ్ పరివార్ దాదాపు పదీపదిహేను కోట్ల కుటుంబాల్ని కలిసింది… చందాలు ఇచ్చే వారంతా బీజేపీకి వోట్లు వేస్తారని కాదు… ఆ పేరిట విస్తృతంగా జనంలోకి వెళ్లడం, కేడర్ మొత్తాన్ని మళ్లీ యాక్టివేట్ చేసుకోవడం దాని ఉద్దేశం… జనసంపర్కం ‘‘మన వాళ్లెవరు..? తటస్థులెవరు..? ప్రత్యర్థులెవరు..?’’ అనే గుర్తింపు కోసం… అవగాహన కోసం… అదొక స్ట్రాటజీ… అందుకే టీఆర్ఎస్ ఆమధ్య అయోధ్య చందాల మీద అంతగా గాయిగాయి చేసింది… అవునూ, కేవలం మతమే బీజేపీ బలమా..? దిద్దుబాట్లు లేని పాలన వైఫల్యాలు, ప్రజలపై భారం మోపుతున్న ప్రభుత్వ విధానాల మాటేమిటి అంటారా..? ప్రజలు అవి కూడా గమనిస్తున్నారు..!! చివరగా ఒకటి చెప్పుకోవాలి… యాగాలు, చండీ పారాయణాలు, గంగాస్నానాలు, చాలీసా పఠనాలు చేస్తేనే హిందువా..? అస్తిత్వం వేరు- ఆస్తికత్వం వేరు… ఇది చాలా పెద్ద ప్రశ్న..! మన పొలిటికల్ బుర్రలకు సమజయ్యే చాన్సే లేదు..!!
Share this Article