నిజానికి ఎమ్మెల్యేలను కొనేయడంలో మంచి నేర్పరితనం సాధించిన బీజేపీ ఇన్నాళ్లు శివసేన ప్రభుత్వాన్ని పడకుండా సంయమనం పాటించడమే పెద్ద విశేషం… ప్రస్తుతం విధేయత, నిబద్ధత, నిజాయితీ వంటి లక్షణాలు కలిగిన నాయకులు ఎక్కడున్నారు..? పైగా మహారాష్ట్రలో ఓ మహావికాస్ అవధి కూటమే ఓ వింత ప్రయోగం… అఫ్ కోర్స్, రాజకీయాల్లో అన్నీ చల్తా… ఇది జరగదు, జరగకూడదు అనేదేమీ ఉండదు కదా…
బీజేపీ, శివసేన పార్టీలది కాషాయ జెండాలు, ఎజెండాలే… ఒకప్పుడు కలిసి కాపురం చేసినవే… కానీ ఇప్పుడు ప్రత్యర్థులు… శివసేన పోకడలకు పూర్తి భిన్నంగా ఉండే కాంగ్రెస్, ఎన్సీపీలతో అదే శివసేన కూటమి కట్టింది… కుర్చీ ఎక్కింది… నిజానికి జనం తీర్పు బీజేపీ వైపే అధికం… కానీ వచ్చిన ఆ 106 సీట్లు సరిపోలేదు… రాష్ట్రీయ సమాజపక్ష్, జనసూర్యశక్తిపక్ష్ పేరిట ఒక్కొక్క సీటున్న పార్టీలు ప్లస్ అయిదుగురు స్వతంత్రుల మద్దతు… కానీ సమకూరిన సంఖ్య 113 మాత్రమే… సరిపోలేదు…
శివసేనతో పోలిస్తే దాదాపు డబుల్ సీట్లు గెలిచింది బీజేపీ… ఐనాసరే, మాకే సీఎం కుర్చీ కావాలని శివసేన పంతం… దాంతో బీజేపీ వదిలేసి, నాలుగు రోజులాగి ఓ పట్టు పడదాంలే అనుకుంది… బీజేపీ ప్రభుత్వంలోకి రాకుండా ఉండటమే లక్ష్యంగా ఎన్సీపీ (53 సీట్లు), కాంగ్రెస్ (44) శివసేనకు మద్దతు ఇచ్చాయి… అంతేకాదు, బహుజనవికాస్ అగధి (3), సమాజవాదీ (2), ప్రహార్ జనశక్తి పార్టీ (2), పీజంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ (1) మరో 8 మంది స్వతంత్రులు కూడా ఈ క్యాంపులోనే చేరారు…
Ads
వెరసి మెజారిటీ మార్కు 145కు దాటి శివసేన ప్రభుత్వానికి 24 ఎమ్మెల్యేల అదనపు మద్దతు ఉంది… ఇక్కడే అసలు చిక్కుంది బీజేపీకి… ప్రస్తుతం శివసేన పార్టీ సీనియర్ ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో దాదాపు 21 మంది శివసేన ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లారు… గుజరాత్‌లోని ఓ స్టార్ హోటల్‌లో మకాం వేశారని సమాచారం… అంటే బీజేపీ క్యాంపులోకి చేరబోతున్నారని అర్థం…
బీజేపీ కూటమి బలం 106 కదా… కానీ శాసనమండలి ఎన్నికల్లో ఏకంగా 133 ఓట్లు వచ్చాయి… అంటే శివసేన అధికార కూటమి నుంచి భారీగా క్రాస్ ఓటింగు జరిగినట్టు లెక్క… ఇప్పుడు పరిస్థితి ఏమిటయ్యా అంటే… శివసేనకు చెందిన 21 మంది తమ క్యాంపు వైపు వచ్చినా సరే బీజేపీకి సరిపోరు… 32 మంది కావాలి తనకు… కాకపోతే ఆ 21 మంది దూరమైతే శివసేన సర్కారుకు తక్షణం ఫరక్ ఏమీ పడదు… కానీ తన కూటమిలో ఉన్న 8 మంది స్వతంత్రులు, ఒకటీరెండు చిన్న పార్టీలు గనుక బీజేపీకి సై అంటే మటుకు శివసేన ప్రభుత్వం కూలిపోవడం ఖాయం…
ఆల్‌రెడీ బీజేపీకి అవసరమైన మేరకు సంఖ్యాబలం సమకూరిందని మరో సమాచారం స్ప్రెడ్ అవుతోంది… సో, సగం పదవీకాలం ముగియగానే బీజేపీ ఇలా శివసేన కూటమికి స్పాట్ పెట్టేసినట్టే… కానీ ప్రస్తుతానికి ఇంకా హంగ్ చిత్రం కనిపిస్తోంది… తమకు కుర్చీ దక్కినా దక్కకపోయినా సరే శివసేనను కకావికలం చేయాలనే పట్టుదల బీజేపీలో కనిపిస్తోంది…
Share this Article