‘‘పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ తాగిన స్థితిలో గురుద్వారాకు వచ్చినందుకు గాను శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ తప్పుపట్టింది… క్షమాపణ కోరింది… సీఎంపై బీజేపీ అధికార ప్రతినిధి పోలీస్ కేసు కూడా పెట్టాడు’’….. ఇదీ వార్త… పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు… ముఖ్యమంత్రి అయితేనేం… ఎంత పెద్ద హోదాలో ఉంటేనేం… మతం పట్ల అపరాధాన్ని కనబరిస్తే గురుద్వారా కమిటీలు గానీ, అత్యున్నత సిక్కు మత వ్యవహారాల మండలి అకాల్ తఖ్త్ గానీ ‘శిక్షించగలదు’… మత వ్యవహారాల మీద అంత పట్టు ఉంటుంది…
అందుకే సిక్కు మతస్తులు తమ ప్రార్థన స్థలాల పట్ల, మత వ్యవహారాల పట్ల భయభక్తులతో ఉంటారు… ఇది చదువుతుంటే మొన్న శ్రీకాళహస్తి ఆలయంలో మంత్రి కొట్టుకు వ్యతిరేకంగా వినిపించిన భక్తుల నిరసన నినాదాలు గుర్తొచ్చాయి… నిజానికి అక్కడ మంత్రిది కాదు తప్పు, ఆ అధికార దర్పానికి తగినట్టుగా వ్యవహరించే దేవాదాయ శాఖ సిబ్బందిది… ఆ మంత్రి స్థానంలో ఇంకెవరు ఉన్నా అధికారులు అలాగే తమ భక్తిప్రపత్తులను చాటుతారు… అసలు దేవాదాయ శాఖ అంటేనే గుళ్లను దోచుకునే అధికార వ్యవస్థ కదా…
ఒక మంత్రి గుడికి వెళ్తే… నిజానికి ఈ దర్పం అవసరమా..? క్యూలో పిల్లలు, ముసలోళ్లు ఉంటారు… గంటల తరబడీ క్యూ లైన్ ఆపేస్తే ఎదురయ్యే అవస్థల మాటేమిటి..? అప్పట్లో గవర్నర్‌గా వ్యవహరించిన నరసింహన్ అయితే మరీ అరాచకం… ప్రొటోకాల్ పేరిట తనకు రాచమర్యాదలు, భక్తగణానికి అష్టకష్టాలు… రోజూ వేలమంది భక్తులు హాజరయ్యే తిరుమలలో కూడా ఆయన యుక్తాయుక్త విచక్షణను విస్మరించి, సగటు భక్తుడి అవస్థలకు కారకుడయ్యేవాడు…
Ads
ఇది నిన్నటి ఆంధ్రజ్యోతి బ్యానర్ స్టోరీ… దేవాదాయ శాఖ అధికారగణానికి ఫర్నీచర్ కావాలట… గుళ్లవారీగా తాఖీదులు పంపించారు… కొత్త జిల్లాలు ఏర్పడితే, వాటికి హిందూ ఆలయాలు ఫర్నీచర్ పంపించాలట… అరాచకం… ఒక చర్చి, ఒక మసీదు, ఒక గురుద్వారా నుంచి వసూలు చేయగలదా ప్రభుత్వం ఇలా..? పోనీ, భక్తగణం అవస్థలకు కారకులయ్యే అధికారులు, నాయకులను శిక్షించేందుకు ప్రబంధక్ కమిటీ వంటి వ్యవస్థ ఉందా ఎక్కడైనా..?
గుళ్ల ట్రస్టు బోర్డులన్నీ రాజకీయ పునరావాస కేంద్రాలే కదా… అంతెందుకు..? మొన్న తిరుపతిలో వేలాది మంది భక్తుల తొక్కిసలాట జరిగితే, ఓ ఉన్నతాధికారి అత్యంత నిర్లక్ష్యంగా భక్తుల్లో క్రమశిక్షణ లోపించిందని ఆరోపించాడు… అలా తూలనాడే వారిని శిక్షించడానికి మతపరమైన కట్టుబాటు, అధికారం, పట్టు ఏమైనా ఉందా..? లేదు..! అన్యమత ఉద్యోగులు… అన్యమత వ్యాపారులు… ఆ వివాదాల్లోనూ రాజకీయ నిర్ణయాలే… అసలు ఒక మత, ఆధ్యాత్మిక సంస్థలోకి ప్రభుత్వం ఎందుకు ఎంటర్ కావాలి..? ఎందుకు విధివిధానాల్ని శాసించాలి..? చివరకు పూజలు ఎలా జరగాలో కూడా రాజకీయ నాయకులు, కోర్టులు, అధికారులు నిర్ణయిస్తారు… ఆగమాలు, అర్చనలు, ఆచారాల గురించి వాళ్లకున్న జ్ఞాన పరిధి, నైతిక పరిధి ఏమిటి..?
ఇవన్నీ చిక్కు ప్రశ్నలు… యాదగిరిగుట్ట పునఃప్రారంభం ఓ అధికారిక కార్యక్రమంలాగా, ఒక పార్టీ ఉత్సవంలాగా జరిగిన తీరు కూడా చూశాం కదా… అయితే ఇవన్నీ కేవలం తెలుగు రాష్ట్రాలకు చెందిన సమస్య కాదు… దేశం మొత్తమ్మీద ప్రతి రాష్ట్రంలో ఉన్న తంతే… ఆమధ్య ఏదో తప్పు చేస్తే ఓ మంత్రికి వంటశాలలో గిన్నెలు కడగాలనీ, భక్తుల చెప్పులు తుడవాలని చెప్పగలిగింది ఓ ప్రబంధక్ కమిటీ… హిందూ సంస్థలకు సంబంధించి సాధ్యమేనా..? సవాలక్ష పీఠాలు… అహాలు… ఆధిపత్య పోకడలు… పైగా శైవం, వీరశైవం, వైష్ణవం, స్మార్తం, ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతాలు… చివరకు దేవుడి నామాలు (పేర్లు, తిలకాలు), గోత్రాలు కూడా మార్చేస్తున్నా ఉలుకుపలుకు లేని హైందవ సమాజం కదా… పెద్దగా ఆశించడం వృథా…!!
Share this Article