కపటిలా కనిపించే క్రికెట్ బోర్డు పెద్దమనిషిని మిథాలీరాజ్ అడుగుతుంది… కొన్ని బేసిక్ నీడ్స్‌తోపాటు తమ పేర్లు రాసి ఉన్న చొక్కాలు కావాలని..! ఆయన బయట నుంచి వాచ్‌మెన్‌ను లోపలకు పిలిచి ఒకరిద్దరు మహిళా క్రికెటర్ల పేర్లు చెప్పమని అడుగుతాడు… ఎవరినైనా గుర్తించగలవా అనీ అడుగుతాడు… వాచ్‌మెన్ తలవంచుకుంటాడు… ఆ పెద్ద మనిషి వాచ్‌మెన్‌ను చూపిస్తూ, మిథాలీ వైపు అదోరకం తృణీకారభావంతో చూస్తాడు…
నిజమే… ఆడ క్రికెట్‌ను ఎవరు చూస్తారు… క్రికెట్ బోర్డు, సెలెక్టర్ల దృష్టిలో అదే భాష, అదే చిన్నచూపు ఉండేది… కాదు, కాదు, ఉంది… ఉంటుంది… ఆ వివక్షకు కారణాలు బోలెడు ఉండవచ్చుగాక… స్పాన్సరర్లు దొరకరు, టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలు ఉండవు, మీడియాలో ఆహా ఓహో కథనాలు ఉండవు… ఆ క్రికెటర్లకు కమర్షియల్ యాడ్స్ దొరకవు… స్టేడియం నిండదు… ఓరకమైన అనాసక్తి…
మగ క్రికెట్‌లో ఎవరైనా హాఫ్ సెంచరీ చేస్తే హాఫ్ పేజీ కథనాలు ఉంటాయి… మహిళా క్రికెటర్ ఎవరైనా 23 ఏళ్లపాటు ఓ పరుగుల యంత్రంలా పిచ్ మీద పరుగు తీస్తూనే ఉన్నా ఎవరికీ పెద్దగా పట్టదు… ఈ సమాజ సహజ వివక్షే ఇందులోనూ కనిపిస్తోందా..? సిక్సర్లు, క్యాచులు, ఫోర్లు, వికెట్లు అన్నీ ఉన్నా… ఈ మ్యాచుల్లో స్పీడ్ ఉండదనీ, థ్రిల్ ఉండదనీ, మగ క్రికెట్‌లో కనిపించే ఫైటింగ్ స్పిరిట్ స్పష్టంగా కనిపించదనీ సగటు క్రికెట్ అభిమాని ఆరోపణ…
Ads
చాన్నాళ్లపాటు ఇండియన్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఉన్న మిథాలీరాజ్ బయోపిక్ సినిమా తీస్తే కూడా అదే స్పందన… అదే అనాసక్తి… ఎందుకు..?
ఇది హైదరాబాదులోని ఓ థియేటర్… శాభాష్ మిథు సినిమా ఫస్ట్ షో… కేవలం ముగ్గురు ప్రేక్షకులు… ఆ షో వసూళ్లు 600 రూపాయలు… ఆ మ్యాచులు జరిగే స్టేడియంలాగే కనిపిస్తోందా..? అవును, అంతే… సినిమాలో ఓ జర్నలిస్టు ఆమెను అడుగుతాడు… మీకు ఇష్టమైన మగ క్రికెటర్ ఎవరూ అని..! నీకు ఇష్టమైన మహిళా క్రికెటర్ ఎవరు అనే ప్రశ్న మగ క్రికెటర్లలో ఎవరినైనా అడగ్గలవా అని రివర్స్ ప్రశ్నిస్తుంది మిథాలీ… కల్పన ఏమీ కాదు, నిజంగానే అలా అడిగింది ఓసారి…
ఆత్మాభిమానం ఉంది, ప్రతిభ ఉంది, ఓపిక ఉంది, ఏళ్ల తరబడీ ఆడే స్టామినా ఉంది, కెప్టెన్సీ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి… కానీ ఆమెకు దక్కిన గౌరవం ఏపాటి..?! అయితే సినిమా విషయానికొస్తే… ఆమె జీవితకథలో ఘర్షణ లేదు… ఆర్థిక కష్టాలు లేవు… పేరెంట్స్ ప్రోత్సాహం ఉంది… జట్టులో పెద్దగా కుట్రలు, కుమ్ములాటలు లేవు… ఛాలెంజెస్ లేవు… దాంతో ఆమె కథ కాస్త నిరాసక్తంగా అనిపిస్తుంది… పాపం డైరెక్టర్ ఏవో తిప్పలు పడ్డా ఫలితం లేదు… మహిళా క్రికెట్ మ్యాచ్‌లాగే ఈ బయోపిక్ కూడా స్లో… పాటలు బాగాలేవు…
తాప్సీ పన్ను ఏదో కష్టపడింది… క్రికెట్ బేసిక్ మెళకువలు నేర్చుకుంది… కానీ సరైన పంచ్ ఉన్న సీన్లు పడలేదు… బీజీఎం బాగున్నా కాస్త సీన్లు పైకి లేచేవి… మిగతావాళ్ల గురించి పెద్దగా చెప్పడానికి ఏమీలేదు… మొదటి వరల్డ్ కప్ గెలిచిన మగ క్రికెట్ మీద, పాపులర్ క్రికెటర్ల మీద తీసిన 83 సినిమా నడిచిందే అంతంతమాత్రం… ఇదేకాదు, క్రికెటర్లంటే సమాజంలో ఫుల్ క్రేజ్… కానీ సచిన్ మీద, ధోనీ మీద తీసిన బయోపిక్స్ కూడా ఫ్లాపే… లైవ్ మ్యాచుల్లోనే క్రికెటర్ల ఆట చూడటం మజా… లేదంటే దినేష్ కార్తీక్ వంటి సినిమా కథల్ని మించిన జీవితకథ అయి ఉండాలేమో..!!
Share this Article