ఓసీడీ గురించి అడిగితే ఆమధ్య ఏదో ప్రెస్‌మీట్‌లో ఓ జర్నలిస్టుకు క్లాస్ పీకింది కదా రెజీనా కసాండ్రా… దానికితోడు శాకిని, డాకిని అనే సినిమా పేరు కూడా కలిసి… కాస్త ఇంట్రస్టు క్రియేట్ చేసింది సినిమా… పైగా సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణ… తరువాత సినిమాకు హైప్, ప్రచారం, ప్రమోషన్ ఇంకాస్త వచ్చేందుకు ‘‘మగాడైనా మాగీ అయినా రెండే నిమిషాలు’’ అని రెజీనా చేసిన వ్యాఖ్య మరింత ఉపయోగపడింది… పాజిటివో, నెగెటివో సినిమా పేరు చర్చల్లోకి, రచ్చలోకి రావాలి… అదేకదా నేటి ట్రెండ్…
దానికి రెజీనా ఫుల్లు న్యాయం చేసినట్టే… అసలే తెలుగు మార్కెట్‌లో ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న నటి ఆమె… మల్టీ స్టారరే ఇది కూడా… కాకపోతే ఇద్దరు హీరోలు కాదు, ఇద్దరు హీరోయిన్లు… పైగా మిడ్ నైట్ రన్నర్స్ అనే కొరియన్ మూవీకి రీమేక్… మరి ఇద్దరు భామలు కామెడీ పంచులు వేస్తూ, ఫైట్లు చేస్తూ, ఇన్వెస్టిగేషన్లు చేస్తూ కథ నడిపిస్తుంటే బాగుండాలి కదా… అక్కడే వచ్చింది చిక్కు…
రెజీనా, నివేదా థామస్… ఇద్దరూ మంచి నటులే… కాకపోతే ఈ సినిమాలో ఆ నటనను పిండుకునేంత సీన్ ఆ పాత్రలకు లేదు… కాబట్టి అలవోకగా సరదాగా చేస్తూపోయారు… నివేదా బరువు గురించి పట్టించుకోకపోతే మరో నిత్యా మేనన్ అయ్యే ప్రమాదం అయితే కనిపిస్తోంది… కథాకాకరకాయ పెద్దగా ఏమీ ఉండదు… ఇద్దరూ పోలీస్ ట్రెయినీస్… మొదట్లో ఒకరంటే ఒకరికి పడదు, తరువాత కలిసిపోతారు… అనుకోకుండా ఓ అమ్మాయి కిడ్నాప్ చూస్తారు…
Ads
పోలీసులు పట్టించుకోరు, వీళ్లిద్దరే సొంతంగా, అనధికారికంగా ఇన్వెస్టిగేషన్‌కు పూనుకుంటారు… అమ్మాయిల కిడ్నాపుల వెనుక ఓ మాఫియా… ఓ సున్నితమైన సమస్య చుట్టూ ఇంకాస్త ఎమోషనల్‌గా కథనాన్ని అల్లుకుంటే బాగుండేది… కానీ దర్శకుడు పెద్దగా ఇంట్రస్టు చూపించినట్టు లేడు… సంగీతం కూడా సోసో… సినిమాటోగ్రఫీ కాస్త బాగున్నట్టనిపిస్తుంది… అన్నట్టు సినిమాలో రఘుబాబు, పృథ్వి కూడా ఉన్నారు… లీడ్ కేరక్టర్లలో ఒకరికి అతి శుభ్రత పిచ్చి… ఓసీడీ డిజార్డర్… మరొకరు తిండిపోతు… ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే ఉంటుంది… ఏదో మొదట్లో కేరక్టర్లు, సీన్లు బాగానే రాసుకున్నట్టున్నాడు దర్శకుడు, కానీ మధ్యలో ఎక్కడో తను దారితప్పి, సినిమాను కూడా పట్టాలు తప్పించేశాడు…
సురేష్ ప్రొడక్షన్స్ అంటే ప్రేక్షకుల్లో కాస్త ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి కదా… మరి సురేష్ బాబు అదేమీ ఆలోచించినట్లు లేడు… బాగా లిమిటెడ్ బడ్జెట్ ఇచ్చినట్టున్నాడు… అందుకే ఉన్నంతలో సర్దుకున్నాడు దర్శకుడు… రొటీన్ కథే… మరేముంది ఈ సినిమా కోసం థియేటర్ల దాకా రప్పించేది..? ఏమీ లేదు..! సినిమాలో లీడ్ రోల్స్ పేర్లు షాలిని, దామిని… మరి శాకిని ఢాకిని అనే నెగెటివ్ సెన్స్ వచ్చే పేరు ఎందుకు పెట్టుకున్నట్టు సినిమాకు..? ఆ పాత్రలు తమ అసలు పేర్ల గోప్యతకు ఈ దెయ్యాల పేర్లే ఎందుకు పెట్టుకున్నట్టు..? ఈ లేడీస్ మస్తు రఫ్ అండ్ టెరిఫిక్ కేరక్టర్లు అని చెప్పటానికా..? టైటిల్‌లో రెండు కొమ్ములేమిటో అర్థం కాదు, ఈ ఇద్దరు హీరోయిన్లు రెండు కొమ్ములా..? పైగా జేమ్స్ బాండ్ సినిమాల టైటిల్‌లో ఉన్నట్టు ఇద్దరు లేడీ జేమ్స్ బాండ్స్ కనిపిస్తుంటారు… ఫాఫం… దర్శకుడి క్రియేటివిటీ… దీంతోనే అర్థమవుతోంది కదా, సినిమా ఎలా ఉందో…!!
Share this Article