.
నిజంగా శంబాల దర్శకుడు యుగంధర్ ముని ప్రయత్నాన్ని మెచ్చుకోవచ్చు… ప్రజెంట్ సినిమా ట్రెండ్ ఏమిటి..? దైవ శక్తులు, క్షుద్ర శక్తులు, మైథాలజీ,, మూడ నమ్మకాలు, ప్రజల భయబీభత్సాలు ప్లస్ హీరో ఎలివేషన్లు… అంతే కదా… ఈ జానర్‌కు సైన్స్ వర్సెస్ శాస్త్రం అనే ఆలోచన రేకెత్తే అంశాల్ని ముడిపెట్టి, రొటీన్ రొమాంటిక్ మసాలాలు లేకుండా ఓ అత్యంత సంక్లిష్ట కథతో సినిమా కథనాన్ని రక్తి కట్టించాడు…
చాలా భిన్నమైన జానర్ ఇది… మిస్టిక్ థ్రిల్లర్… ప్రేక్షకుల ఊహకందని సీన్లను రచించుకుని, ఎప్పటికప్పుడు కొత్తదనం ఫీలయ్యేలా సినిమా తీయడం కష్టమే… అందులోనూ ఫ్లాపుల హీరో ఆది సాయికుమార్, పెద్దగా పరిచయం లేని హీరోయిన్… ఐనాసరే, చాలావరకూ మెప్పించాడు దర్శకుడు…
Ads
ఆది సాయికుమార్ ఒత్తిడి కావచ్చు, కొన్ని మాస్ ఎలివేషన్లు, అనవసర యాక్షన్ లేకుండా ఉంటే ఇంకా బాగుండేది… గొప్ప సినిమా అనకపోయినా సరే, తీసిపారేయదగిన సినిమా మాత్రం కాదు… సౌండ్, విజువల్స్, నిర్మాణ విలువల పరంగా థియేటర్‌లో చూసినా పైసా వసూల్…
1980 కథాకాలం స్టోరీ లైన్ బాగుంది… ఏళ్ల చరిత్ర ఉన్న శంబాల ఊరు… ఓ ఉల్క పడుతుంది… ఆరోజు నుంచీ ఊరిలో ఉత్పాతాలు… ఆవు పొదుగు నుంచి పాలకు బదులు రక్తం… చిత్రవిచిత్రంగా జాంబీ తరహాలో ప్రవర్తించే జనం… హత్యలు, ఆత్మహత్యలు, ఆగని మరణాలు… కల్లోలం ఊళ్లో… చంపే ముందు లేదా చచ్చే ముందు మెడలో వాలే ఓ పురుగులాంటి శక్తేమిటి..?
హీరో ఓ జియో సైంటిస్టు… ఆ ఉల్క ప్రభావమేమిటో తేల్చడానికి ఒంటరిగా ప్రభుత్వం తరఫున అడుగుపెడతాడు… లాజిక్ వర్సెస్ మార్మిక శక్తులు… దైవిక శక్తి వర్సెస్ క్షుద్ర శక్తి… సైన్స్ వర్సెస్ శాస్త్రం… మూడ నమ్మకాలు వర్సెస్ దైవిక శక్తులు… భౌతిక శక్తులు వర్సెస్ అతీంద్రియ శక్తులు… తోడుగా అరిషడ్వర్గాలు… ఇలా అనేకం కలగాపులగం అయినా, శ్రద్ధగా ప్రతి ముడినీ విప్పుతాడు దర్శకుడు చివరి వరకు…
ఏదో ఓ పురాణ కథ… దానికి డివైన్ ఎలిమెంట్… మూఢనమ్మకాలు, హారర్ ఎలిమెంట్స్… ఈ నేపథ్యంలో సైన్స్ వర్సెస్ శాస్త్రం ఆలోచనల్ని రేకెత్తించుకుంటూ పోతుంది కథనం… ‘మనం గెలవాల్సింది లోన ఉన్న మనల్ని… భూతాల్ని కాదు’ అని చెబుతాడు అంతిమంగా దర్శకుడు రకరకాల పాత్రల్ని క్రియేట్ చేసి, ఆడించి… చివరకు అర్చన అయ్యర్ పాత్ర సస్పెన్స్ చివరి వరకు బాగా మెయింటెయిన్ చేశాడు, ఆమె కూడా బాగానే చేసింది…
ఆ బాలనటి ఎవరో గానీ ఇంకా బాగా చేసింది… నటీనటులందరూ బాగా పర్‌ఫామ్ చేశారు… నిజానికి ఆది సాయికుమారే అదుపులో లేడు… క్లైమాక్స్ హడావుడిగా ముగించినట్టు అనిపించినా… సీక్వెల్ ఉంటుంది అన్నట్టుగా ప్రతి సినిమాలో చూపిస్తున్న పైత్యమే ఇందులోనూ ఉంది… వీఎఫ్ఎక్స్ అవసరమున్న మేరకు ఓవర్ అనిపించకుండా జాగ్రత్తగా వాడుకున్నారు… మొత్తానికి ఈ సినిమా పర్లేదు..!!
Share this Article