ఇది ఓ సినిమా కాదు… ఆ లక్షణాలేమీ లేవు… పోనీ, రాజకీయ చిత్రమా..? అస్సలు కాదు, ప్రత్యర్థుల్ని వెకిలిగా, నీచంగా జోకర్లుగా చిత్రించడం రాజకీయ చిత్రం లక్షణమే కాదు… పోనీ, ఎన్నికల ప్రచార చిత్రమా..? అదీ కాదు… ఎందుకంటే, ఈ సినిమా తీస్తే వోట్లు వేసేవాళ్లు కూడా వేయరు… అనగా కౌంటర్ ప్రొడక్ట్… మరి దీని కేటగిరీ ఏమిటి..? ఏమో… ఇప్పటివరకూ ప్రపంచంలో ఎవరూ తీయలేని ఓ చిత్రమైన జానర్, కేటగిరీలో సినిమా పేరిట వీడియోల సంకలనం ఇది… ఈ ఘనత రాంగోపాలవర్మకే దక్కింది… సినిమా పేరు శపథం…
జగన్‌కు ఎన్నికల్లో మంచి ఫాయిదా రాబట్టాలని రెండు భాగాల సీరీస్ తీశాడు కదా… అందులో వ్యూహం చిత్రాన్ని జనం ఛీత్కరించారు… (కథానాయకుడు, మహానాయకుడు సినిమాల డిజాస్టర్‌తో బాధపడిన ఎన్టీఆర్ అభిమానులకు ఈ వర్మ సినిమాల తీరు చూసి పెద్ద ఆత్మానందం, అనగా రిలీఫ్…) వ్యూహం ఎందుకంత ఘోరంగా ఉందనే భావనతో కనీసం రెండో పార్టునైనా కాస్త దిద్దుబాటు దిశగా తీసుకెళ్లాలి కదా… నో, నెవ్వర్, అలా చేస్తే తను వర్మ ఎందుకవుతాడు..?
మరింత కంపు చేశాడు… థియేటర్లలో రిలీజ్ చేస్తే కాస్త సెన్సార్ పరిశీలన మన్నూమశానం ఉంటాయి కదా… ఇక ఓటీటీ అయితే ఏ కత్తెర్లూ లేవు, ఏదైనా జనం మీదకు వదలొచ్చు కదా… లోకేష్, పవన్ కల్యాణ్‌ల మీద మరింత ద్వేషాన్ని కక్కాడు వర్మ… అదైనా కాస్త క్రియేటివ్‌గా ఉందా అంటే అదీ లేదు… పరమ మోటు సెటైర్లు… మరోవైపు జగన్‌ను ఎలివేట్ చేయడానికి ఉద్దేశించిన సీన్లు, డైలాగులు కూడా పరమ నాసిరకం… పదీపదిహేనేళ్ల ఏపీ రాజకీయాల మీద అవగాహన ఉన్నవాడు జాలిగా నవ్వుకునే సినిమా తీశాడు వర్మ…
Ads
వ్యూహాన్ని థియేటర్లలో రిలీజ్ చేసి చేతులు మూతులు కాల్చుకున్నాడు కదా… ఇక శపథాన్ని అలా రిలీజ్ చేసే సాహసం చేయలేకపోయాడు… థియేటర్లు నీకోదండంరా బాబూ అనేశాయి… వేరే ఓటీటీలూ సాహసించలేదు… అందుకని ప్రభుత్వ ఆధీనంలోని ఓటీటీలో పెట్టేశాడు… వ్యూహం జగన్ కుర్చీ ఎక్కడం వరకూ తీసిన కథ… ఇదేమో జగన్ పాలన మీద, ప్రత్యర్థుల మీద…
ఈ లెవల్ పల్లకీమోత బహుశా ఇంకెవరికీ చేతకాదేమో… చంద్రబాబు అరెస్ట్ వెనుక జగన్ మనసులో కక్ష సాధింపు ఉద్దేశం ఏమీ లేదుట… సంక్షేమ కార్యక్రమాల్లో దోచుకోవడానికి కుదరదని కొత్త స్కీములకు తెర తీసి చంద్రబాబు స్కామ్స్ చేశాడట… పవన్ ఓటమికి చంద్రబాబు మరోసారి వ్యూహం పన్నుతూ… జనసేన గుర్తుపై నెగ్గిన ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాక్కోవాలని భావిస్తున్నాడట… జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విజయమ్మ రాజకీయంగా తెరమరుగు కావడం అనేది ఆమె తీసుకున్న స్వీయ నిర్ణయం తప్ప జగన్ చెప్పింది, చేసిందీ ఏమీ లేదుట..
తెలంగాణాలో చెల్లెలు షర్మిల పార్టీ పెట్టినప్పుడు ప్రశ్నించవద్దని కుటుంబ సభ్యులకు చెప్పిన జగన్, షర్మిలకు తోడుగా ఉంటానని విజయమ్మ కోరితే అడ్డు చెప్పలేదట… చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు నరేంద్ర మోడీ, అమిత్ షాలకు నారా లోకేష్ ఫోనులు చేస్తే వాళ్లిద్దరూ లిఫ్ట్ చేయలేదట… మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు సలహాలను పవన్ పక్కనపెట్టి జనసేనలో తాను చెప్పినదానికి జై కొట్టే నాదెండ్ల మనోహర్ కు పవన్ కళ్యాణ్ ఇంపార్టెన్స్ ఇస్తాడట… చంద్రబాబుకు షర్మిల భర్త అనిల్ దగ్గరయ్యారు, రాజకీయాలకు దూరంగా ఉండాలని విజయమ్మ నిర్ణయం తీసుకున్నప్పడు షర్మిల గాభరా పడిందట…
నువ్వు నాకు దేవుడిచ్చిన వరం అని జగన్ తన భార్యతో అంటాడు… జగన్ పాలనలో ఆమె సలహాలు, భాగస్వామ్యమే ఎక్కువట… చివరగా తను స్వయంగా పాడాడు ఓ పాట… ఆ వెయ్యి తప్పుల సాంగ్ ఈ వంటకం దుర్వాసనకు పరాకాష్ట… మిమ్మల్నెవడు చూడమన్నాడు సినిమాను అంటారా..? అదీ నిజమే… కోరి కొరివితో తలగోక్కోవడం అంటే ఇదే..!
Share this Article