సంగీత ప్రియుల్లో చాలామందికి తెలిసిన కథే కావచ్చు… కానీ మరోసారి మననం చేసుకోవచ్చు… లతా మంగేష్కర్ పెళ్లి చేసుకోలేదు… ఎందుకు..? అదే ఈ కథ… నిజానికి ఓ నవలగానో, ఓ సినిమాగానో రాదగిన ప్రేమకథ… కానీ విషాదాంతం… భారతరత్నకు నిజమైన అర్హురాలు, కొన్ని వేల భారతీయ భాషల పాటల్ని పల్లవించిన గొంతులోని ఈ విషాద వీచికను తలుచుకుంటే తప్పేమీ లేదు… ఓ రాజావారి అహానికి బలైన ప్రేమకథ… అలాగని ఆ ప్రేమికుడు ఈమె ప్రేమ తాలూకు జ్ఞాపకాలనీ వదిలేసి మరో పెళ్లి చేసుకుని, మనసు మార్చుకోలేదు కూడా…
మాజీ క్రికెటర్, బీసీసీఐని కొన్నేళ్లు ఏలిన రాజ్‌సింగ్ దుంగార్పూర్ గురించి ఇప్పటి జనరేషన్‌కు తెలియకపోవచ్చుగాక… ఆయన లా చదవడానికి ముంబై వచ్చినప్పుడు లత బ్రదర్ ద్వారా ఆ రాజ్‌సింగ్ లతకు పరిచయమయ్యాడు… మనసులు కలిశాయి… ప్రేమ చిగురించింది… ఆమె గొంతులో ప్రేమరాగాలు మరింత అందంగా ప్రాణాలు పోసుకున్నయ్… ఆమె కెరీర్ క్రమేపీ ఎదుగుతూ… బాలీవుడ్ పాట అంటేనే లత అనుకునే రోజులవి… ఆమె పాడితేనే సినిమా హిట్ అని నిర్మాతలందరూ బలంగా ఫిక్సయిపోయిన కాలం అది…
ఆ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు… రాజ్‌సింగ్ తన తల్లిదండ్రులకు చెప్పాడు… తండ్రి మహర్‌వాల్ లక్ష్మణ్ సింగ్… రాజస్థాన్‌లో ఓ సంస్థానానికి రాజావారు… ఆ రాజరికం తాలూకు అహం ఒకటి ఉంటుంది కదా… ఆఫ్టరాల్ సినిమాల్లో పాటలు పాడుకునే ఓ గాయని ఈ రాజకుటుంబానికి కోడలు కావడం ఏమిటి అనుకున్నాడు… ఠాట్, వీల్లేదు అన్నాడు… బహుపరాక్ అని కొడుకును హెచ్చరించాడు… సదరు రాజ్‌సింగ్ పేరొందిన క్రికెటర్ కావచ్చుగాక, తండ్రిని ఎదిరించి నిర్ణయం తీసుకోలేకపోయాడు…
Ads
లతా మంగేష్కర్‌కు ఈ విషయాన్నే చెప్పాడు… తల్లిదండ్రులకు కూడా చెప్పాడు… లత దక్కని జీవితంలో ఇక పెళ్లే చేసుకోను అన్నాడు… భీష్మ ప్రతిజ్ఞ…ఇది విన్న లత కన్నీరు మున్నీరైంది… నువ్వే దక్కనప్పుడు నాకు పెళ్లి దేనికి రాజ్, నేనూ జీవితాంతం పెళ్లి చేసుకోను అని చెప్పింది… ఆమె గొంతులో విషాదం, వైరాగ్యం మరింతగా ప్రాణం పోసుకున్నయ్… నిజం… ఇద్దరూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండానే గడిపారు… ఎప్పుడూ ‘‘మంచి స్నేహితులు’’గానే కాలం వెళ్లదీశారు… ఆయన అల్జీమర్స్‌తో బాధపడుతూ 2009లో కన్నుమూశాడు… ఆమెలోని ప్రేమ భావనలు పూర్తిగా ఎండిపోయాయి…
కొన్ని వేల పాటలు, అనేక భాషలు… భారతీయ సినిమా పాట అంటేనే లత… ఎందరెందరో వస్తుంటారు, పోతుంటారు… కానీ లత అజరామరం… ఇది బయటికి కనిపించేదే, కానీ ఆమె గుండె లోతుల్లో నిత్యం విషాద కంపనాలు రేకెత్తించే ఆమె ప్రేమకథ ఎవరికీ అక్కర్లేదు… పాడుతూ పాడుతూ అన్నీ మరిచిపోతూ… సినిమా పాటల ప్రపంచాన్ని మహారాణిలా ఏలిందామె… ఇప్పుడు ఆ గొంతు కూడా మూగబోయింది… ఓ అమృతగళం వెళ్లిపోయింది… 90 ఏళ్ల వయస్సులో కూడా జవాన్ల కోసం వీసమెత్తు వృద్ధఛాయలు లేకుండా, అదే మాధుర్యంతో, చివరి పాటపాడిన ఆ గొంతు ఇప్పుడు సంగీతప్రియుల్ని విషాదంలో ముంచెత్తుతూ లోకాన్ని వీడిపోయింది…!!
Share this Article