Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

భార్యా చైతన్యవతీ శత్రు..! నిజమేనా..? స్త్రీలు అంత ప్రమాదకారులా..?!

June 21, 2025 by M S R

.

Aranya Krishna …….. స్త్రీలు అంత ప్రమాదకారులా?

మేఘాలయకి హానీమూన్ కోసం వచ్చిన కొత్త జంటలో భర్త రాజా రఘువంశీ భార్య సోనం కుట్రలో భాగంగా హత్యకి గురవ్వడం సంచలనం రేపింది.

Ads

ఆ హత్యని కేవలం అమానుష మనస్తత్వం వున్నవారే సమర్ధించగలరు కానీ ఇదే సందు అని ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకున్న స్త్రీలందరూ ఏదో విలన్లైనట్లు, వారి నుండి భర్తల ప్రాణాలకు ముప్పు వున్నట్లు, పెళ్లి కాని యువకులు ఈ విషయంలో అప్రమత్తంగా వుండాలన్నట్లు కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. వీడియోలు చేస్తున్నారు.

కేసు ఓ కొలిక్కి వచ్చిన 20 రోజుల తరువాత కూడా స్త్రీల పట్ల అవమానకరంగా రీల్స్, మీంస్, యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు. మొత్తంగా స్త్రీలంటే ప్రమాదకర శక్తులైనట్లు ఆ రాతలు, రీల్స్, మీమ్స్ అఘోరించాయి.

మేఘాలయ హానీమూన్ మర్డర్ కేసుగా ప్రాచుర్యం పొందిన కేసులో సోనం, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహ్ మాత్రమే నేరస్తులు కాదు నా దృష్టిలో. తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పినప్పటికీ పట్టించుకోని ఆమె తల్లిదండ్రులు కూడా నేరస్తులే.

ఇష్టం లేని పెళ్లి చేస్తే ‘నేనేం చేస్తానో చూడండి. అందుకు మీరే బాద్యులు” అని సోనం తన పేరెంట్స్ ని హెచ్చరించిందట. ఐనా ఆమె పేరెంట్స్ పట్టించుకోలేదు. ఆమె పెళ్లికి ముందే మర్డర్ ప్లాన్ కి ఫిక్స్ అయిపోయినట్లుంది.

అందుకే తన మీద అనుమానం రాకూడదని పెళ్లికి సంబంధించిన సంబరాల్లో హుషారుగా కనిపించింది. ఆ హుషారు నిజమైనదైతే ఆమె మర్డర్ ప్లాన్ ఎందుకు చేస్తుంది?

రఘువంశీ పట్ల ఆమె సోనం వ్యవహరించిన మోసపూరిత ప్రేమ, కుట్ర పన్నిన తీరు, చంపిన విధానం అమానుషమైంది. అమాయకుడైన భర్తని ఆమె కడతేర్చడం ఎవరమూ అంగీకరించలేం. ఐతే సోనం స్త్రీ జాతి ప్రతినిధిగా భావించడం, ఆమె వంటి వారు చేసే దారుణమైన పనుల వల్ల మొత్తం పురుష జాతి ప్రమాదకర పరిస్థితుల్లో పడిందన్నట్లు కృత్రిమ ఆందోళనలు వ్యక్తం చేయడం సోనం వంటి వారు చేసే పాప కార్యాల్ని మించిన పాప కార్యం!

ఈ రకమైన సూడో ఆందోళనలు వ్యక్తం చేసే వారిలో స్త్రీలు కూడా వున్నారు. వీరందరూ మర్చిపోయిన విషయం ఏమంటే వేళ్ల మీద లెక్క పెట్టగల సంఘటనల్ని భూతద్దంలో బ్లో అప్ చేసి చూపించినా అవి దేశవ్యాప్తంగా స్త్రీల మీద, ఆడపిల్లల మీద జరిగిన, జరుగుతున్న అత్యాచారాల ముందు పిపీలికాలే.

పితృస్వామ్యం సంస్కృతి పేరుతో తన బలి పశువుల చేతనే ఎక్కువగా పొగిడించుకుంటుంది. పీడక శక్తుల కోసం పీడిత వర్గాలే కన్నీరు కార్చేలా చేస్తుంది. ఇదో రకమైన వ్యూహం.

సోనం- రఘువంశీ- రాజ్ కుష్వాహ్ ల మొత్తం ఎపిసోడ్ గమనిస్తే ప్రేమ గుడ్డిదని కొంతమందికి అనిపించొచ్చు. ప్రేమ గుడ్డిదో, కుంటిదో కాదు. ప్రేమ మనిషి భావోద్వేగాల్లో భాగం. కొంతమంది తమ భావోద్వేగాల మీద నియంత్రణని కోల్పోతుంటారు. ఆ ఉరవడిలో పడి కొట్టుకుపోతుంటారు.

ప్రేమకి సంబంధించిన భావోద్వేగం ఇందుకు అతీతం కాదు. ఎలాంటి నియంత్రణ లేకుండా, వాస్తవిక దృష్టి లోపించి ప్రేమే సర్వస్వం అనుకుంటే, అలాంటి ప్రేమ ఉచ్ఛస్థాయిలో మనిషి స్వార్ధపూరిత భావోద్వేగాల్లో భాగమైనప్పుడు ఇలాంటి దారుణాలు జరిగే అవకాశం వుంటుంది. ఇందుకు స్త్రీలు మినహాయింపు కాదు.

ప్రియుడితో కలిసి జీవించడానికి అడ్డుగా వున్నారని పిల్లల్ని చంపుకునే తల్లులు కూడా ఇదే కేటగిరీ కిందకే వస్తారు. ఇందుకు ఆ స్త్రీలు ఎదుర్కొంటున్న జీవితం పట్ల అసంతృప్తి, ప్రేమరాహిత్యం నియంత్రణ లేని ఆవేశాలకు దారి తీయడం కారణం. ఐతే ఇలాంటి కొందరు స్త్రీలు చేసే దారుణాలు మొత్తం స్త్రీల మనస్తత్వానికి, ప్రవర్తనకి అంటగట్టడం మాత్రం మూర్ఖత్వం.

గత మూడు దశాబ్దాలుగా స్త్రీలు బాగా చదువుకుంటున్నారు. బాగా చదువుకోవడం వల్ల సమాన ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. పెరిగిన ఉద్యోగావకాశాల వల్ల స్త్రీలకి ఆర్ధిక స్వావలంబన చేకూరింది. స్త్రీ ఆర్ధిక స్వావలంబన కుటుంబ అభివృద్ధికి దోహదం చేస్తుంది. మొత్తంగా స్త్రీకి ప్రాముఖ్యత పెరిగి, ఆమె ఆత్మవిశ్వాసం ఇనుమడించే వాస్తవికత పెరుగుతున్నది.

ఎన్ని సాధించినా, సంపాదించినా చివరికి పురుషుడికి దాసోహమనే సంస్కృతిని నేటి యువతి అంగీకరించడం లేదు. అందుకే నేటి యువతి సమాజానికి ఓ సాంస్కృతిక దిగ్భ్రాంతి (కల్చరల్ షాక్)గా కనిపిస్తున్నది.

ఇక్కడే మొత్తం సమాజం స్త్రీల పట్ల తనకి వున్న దృక్పథాన్ని పరిశీలించుకోవాలి, పునరాలోచించుకోవాలి, పునర్మూల్యాంకనం చేసుకోవాలి. ఆమె ప్రాముఖ్యతని గుర్తించాలి. తొక్కిపెట్టినంత కాలం తొక్కిపెట్టాం, ఇంక సాధ్యం కాదని గుర్తించాలి.

నేటి స్త్రీ శక్తివంతంగా తయారవుతున్నది. మేథోపరంగా, ఉత్పత్తిపరంగా, పరిపాలనాపరంగా, రాజకీయంగా ఆమె సమాజానికి ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తున్నది. ఆమెని ఇంకా సంతాన పునరుత్పత్తి వనరుగా, వంటింటి కుందేలుగా చూస్తున్నంత కాలమూ వైరుధ్యం పెరిగి, హింస పెచ్చరిల్లుతుంది. అంతిమంగా సామాజిక అశాంతి పెరుగుతుంది.

కుళ్లు జోకులు, కృత్రిమ భయపు రాతలు, వెకిలి రీల్స్, అతి తెలివి యూట్యూబ్ వీడియోస్ మానేసి ఆమె స్వప్నాల్ని, ఆశల్ని, ఆకాంక్షల్ని గౌరవించి, నిజమైన అర్ధంలో సమానత్వం సాధించడంలో దోహదపడగలిగితే స్త్రీ పురుష సంబంధాలకు సంబంధించినంత వరకు మొత్తం సమాజం ప్రశాంతంగా వుంటుంది….. అరణ్యకృష్ణ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ పదేళ్ల స్వరాష్ట్ర పరిపాలనకు మరో వికృతకోణం ఇది…
  • GenZ … నెట్ వీథుల్లో విప్లవరచన… అసలు ఏమిటీ తరం..? చదవండి..!
  • Air Bag to Air Bus …. ప్రయోగాలు ఫలిస్తే విమానప్రాణాలకు శ్రీరామరక్ష…
  • భద్రం బీకేర్‌ఫుల్ బ్రదరూ… బీమా భరోసాలే కాదు, ఈ జాగ్రత్తలూ ముఖ్యమే…
  • వంశీ మార్క్ జమజచ్చ సినిమా.., అప్పట్లో జహిజట్… నవ్వుల్ డబ్బుల్…
  • ‘‘నేనెందుకు బాధపడాలి… బాధపడితే శోభన్‌బాబు పడాలి గానీ…’’
  • గుడిమల్లం..! ఉల్కశిల నుంచి చెక్కిన తొలి శివలింగ మూర్తి..?!
  • తాజా ఏబీసీ ఫిగర్స్… ఈనాడు- సాక్షి- ఆంధ్రజ్యోతి… ఏది ఎక్కడ..!!
  • ఒక మీడియా హౌజ్… ఆఫీస్ క్లోజ్… అందరూ కలం పోరాటయోధులే మరి..!!
  • Mirai..! భిన్నమైన ఓ కథకు రక్తికట్టించే ప్రజెంటేషన్… గుడ్ ఔట్‌పుట్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions