Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సినిమాల్లో హీరోయిన్ కథకు ఏమాత్రం తీసిపోని రియల్ లైఫ్ హీరోయిన్ ఈమె..!

May 17, 2022 by M S R

ఒక నిజమైన కథ… స్నేహం మీద, ప్రేమ మీద, పెళ్లి మీద ఏవగింపు కలిగించే ఓ కథ… చాన్నాళ్లుగా అది సోషల్ మీడియాలో, మీడియాలో కనిపిస్తూనే ఉంది… కొత్తదేమీ కాదు… తాజాగా తెలుగులో వాట్సప్ గ్రూపుల్లో, ఫేస్‌బుక్‌లో మళ్లీ బాగా కనిపిస్తోంది… పిచ్చి ఫ్యాన్స్ ఆరాధించే క్రికెటర్ల చీకటి జీవితాలు, నీచతత్వాలను, డొల్ల స్నేహాలను చెప్పే కథ… అంతేకాదు… నిజమైన ప్రేమమూర్తుల్ని కూడా పరిచయం చేసే కథ… ఈ కథలో బాగా నచ్చేది ఒక పాత్ర… ఆ పాత్ర పేరు… దీపిక పల్లికల్..!

ఒక మలయాళీ క్రిస్టియన్ ఫ్యామిలీలో, కేరళలోని కొట్టాయంలో పుట్టింది ఆమె… స్క్వాష్ ప్లేయర్… ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ ర్యాంకింగ్స్‌లో టాప్ టెన్‌లోకి చేరిన తొలి భారతీయురాలు ఆమె… అర్జున అవార్డు గ్రహీత… ఆమె తల్లి సుశాన్ ఇండియన్ వుమెన్ క్రికెట్‌ టీంలో ఆడింది… ఆమెను వివాహబంధం వైపు తీసుకెళ్లిన అసలు కథ చదువుదాం…

2004… భారత క్రికెట్ జట్టులో దినేష్ కార్తీక్ అనే యువ వికెట్ కీపర్ చేరాడు… తను తమిళనాడులో పుట్టాడు, కానీ తెలుగు కుటుంబం… క్రికెట్‌లో వేగంగానే ఎదిగాడు… 2007… తన చిన్ననాటి స్నేహితురాలు నికిత వంజారాతో పెళ్లయింది… జీవితం సాఫీగా నడిచిపోతోంది… రంజీలో తమిళనాడుకు దినేషే కెప్టెన్… తన జీవితంలోకి హఠాత్తుగా ఓ రాహువు ప్రవేశించాడు… దాని పేరు మురళి విజయ్… తనదీ తమిళనాడే… క్రికెటర్…

Ads

తోటి ఆటగాళ్ల కుటుంబాలు కలవకుండా ఎలా ఉంటాయి..? మురళి విజయ్‌ను స్నేహితుడిగా, తోటి క్రికెటర్‌గా బలంగా నమ్మేవాడు దినేష్… కానీ మురళి విజయ్ ఏకంగా దినేష్ భార్య నికితకే గురిపెట్టాడు… మెల్లిమెల్లిగా ఆమె మురళి మాటల్లో పడిపోయింది… సాన్నిహిత్యం పెరుగుతోంది… దినేష్ అదేమీ గుర్తించలేదు… సందేహించలేదు… కానీ ఎప్పుడైతే మురళి, నికిత తరచూ బయట కలవడం మొదలుపెట్టారో, ఆ బంధం బలంగా అల్లుకుపోతోందో బాగా ప్రచారాలు ప్రారంభమయ్యాయి…

2012… నికితకు గర్భం… ఆ సంతానం మురళిదే అని దినేష్ వాదన… గొడవ పడ్డాడు… నీతో సంసారం అక్కర్లేదు అన్నాడు… ఆమె కూడా హాయిగా అంగీకరించింది… తరువాత ఆ ఇద్దరికీ విడాకులు… విశేషం ఏమిటంటే… విడాకులు మంజూరైన మరుసటిరోజే ఆమె మురళిని పెళ్లిచేసుకుంది… తరువాత 3 నెలలకే ఆమెకు ఓ బిడ్డ పుట్టింది…

deepika

నికిత, మురళిల బంధం… తనకు జరిగిన అవమానం… సంసారబంధానికి తగిలిన దెబ్బతో దినేష్ పిచ్చోడైపోయాడు… మురళిని మోసగాడిగా జమకట్టాడు… మానసికంగా అస్వస్థుడయ్యాడు… తెల్లారిలేస్తే చాలు, మందులో మునిగిపోయేవాడు… ఆట గాడి తప్పింది… జట్ట నుంచి తప్పించారు… రంజీ లేదు, ఇండియన్ టీం లేదు, చివరకు ఐపీఎల్ కూడా లేదు… జిమ్‌కు వెళ్లడం లేదు, ప్రాక్టీస్ లేదు… తాగడం, ఒళ్లు మరిచి పడిపోవడం… సూసైడ్ గురించీ ఆలోచించసాగాడు… సీన్ కట్ చేస్తే…

జిమ్‌కు రావడం లేదేమిటి అని తన ట్రైనర్ నేరుగా ఇంటికి వచ్చాడు… దినేష్ దారుణమైన స్థితిని గమనించాడు… నిర్బంధంగా జిమ్‌కు పట్టుకొచ్చాడు… అదుగో అక్కడ దీపిక తనకు పరిచయం… ఆమె అదే జిమ్‌కు వచ్చేది… ట్రైనర్ దినేష్‌కు కౌన్సిలింగ్ ఇస్తూ, మళ్లీ బతుకుబాటలోకి ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నాడు… దీపిక కూడా సాయపడేది… (నిజానికి ఆమెకు క్రికెటర్లంటే ఇష్టముండేది కాదు…)

మెరుగుపడుతున్నాడు… మనుషుల్లో పడుతున్నాడు… నాణేనికి మరోకోణంలో… మురళి విజయ్ ఆట గాడితప్పింది… జట్టు నుంచి తప్పించారు… చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టీం కూడా తనను ఇంటికి పంపించింది… ఇటు దినేష్ పట్ల దీపిక ఆకర్షితురాలు అవుతోంది… నెట్ ప్రాక్టీస్ దాకా తీసుకొచ్చింది తనను… దేశవాళీ క్రికెట్‌లో స్కోర్లు సాధిస్తున్నాడు… త్వరలోనే కోల్‌కత్తా నైట్ రైడర్స్ టీంలోకి ఎంపికయ్యాడు… నన్ను పెళ్లి చేసుకుంటావా దీపికా అనడిగాడు… ఆమె వెంటనే సరేనంది… ఇద్దరికీ పెళ్లయింది… హిందూ, క్రిస్టియన్ మతాల పద్ధతుల్లో రెండుసార్లు…

deepika

దినేష్ వయస్సు మీద పడుతోంది… మరోవైపు దీపిక ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది… స్క్వాష్ ఆగిపోయింది… చెన్నైలోనే ఓ ఖరీదైన ప్రాంతంలో రాజభవనం వంటి ఇల్లు చూశాడు, కొనాలని కోరిక… కానీ ఇద్దరూ ఖాళీగా ఉన్నారు, డబ్బేది..? ఆ సమయంలో ధోని తనను చెన్నై ఐపీఎల్ టీంలోకి వికెట్ కీపర్‌గా రమ్మన్నాడు… కానీ వేలంలో రాయల్ చాలెంజర్ బెంగుళూరు జట్టు తనను కొనుగోలు చేసింది… మరోవైపు దీపిక మళ్లీ స్క్వాష్ స్టార్ట్ చేసింది… కవలలు పుట్టిన ఆరు నెలలకే ప్రపంచ చాంపియన్ షిప్ డబుల్స్ టైటిల్ కొట్టింది…

2022… దినేష్ ఆటతీరు, ఫామ్ అద్భుతంగా సాగుతోంది… ఓరోజు మ్యాచులో 8 బంతుల్లో మూడు సిక్సులు కొట్టి, 30 పరుగులు చేస్తే… అంతటి కోహ్లీ సైతం డ్రెస్సింగ్ రూంలో దినేష్‌ను హత్తుకుని, ఎత్తుకుని అభినందనల్లో ముంచెత్తాడు… అంతకుముందు 2018లో ఇదే దినేష్, మురళి ఇద్దరూ ఇండియన్ జట్టులో ఉన్నారు… ఇద్దరికీ కంపరమే… ఒక్కసారి కూడా మాటల్లో గానీ, సైగల్లో గానీ కమ్యూనికేట్ చేసుకున్నట్టు ఎవరూ గమనించలేదు…

ఎందుకు ఈ కథలో దీపిక హీరోయిన్… ఆమెకు స్వతహాగా గొప్ప ప్రొఫెషనల్ కెరీర్ ఉంది… క్రికెటర్లంటే ఇష్టం లేదు… దినేష్ పాత కథ మొత్తం తెలుసు… ద్వేషించలేదు… అలాగని సానుభూతిలో దగ్గరకాలేదు… తనను ఎంతో దారుణమైన స్థితిలో చూసింది… మతం కూడా వేరు… కానీ తనను ఒకరకంగా చేరదీసింది ఆమె… కౌన్సిలింగ్ ఇప్పించింది… మెల్లిగా ప్రేమలో పడింది… తనతో కలిసి తిరిగింది… తనను మళ్లీ నిలబెట్టింది… జీవితాన్ని పంచుకుంది… దినేష్ మళ్లీ ఇండియన్ టీమ్ లోకి వస్తున్నాడు… ఆమె తన కెరీర్‌నూ నిలబెట్టుకుంది… ఏ నవలకు తక్కువ ఇది… ఏ సినిమాకు తక్కువ ఇది…!! అవునూ… మరి మురళీ విజయ్ కథేమిటి..? ముగ్గురు పిల్లలు… ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు… అలా అనామకంగా మిగిలిపోయాడు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions