వివాహాల్లో చాలారకాలుంటయ్… బ్రాహ్మణ వివాహం, దైవ వివాహం, గాంధర్వ వివాహం, రాక్షస వివాహం, పిశాచ వివాహం, ఆర్ష వివాహం, ప్రజాపత్య వివాహం, అసుర వివాహం… వీటి వివరాల జోలికి పోవడం లేదు.. మతాంతరం, కులాంతరం, ఖండాంతర వివాహాలు వేరు… రిజిష్టర్డ్ పెళ్లి, స్టేజీ పెళ్లి, సంప్రదాయిక పెళ్లి వేర్వేరు… దేవుడితో పెళ్లి వేరు, జాతకదోష నివారణకు ముందుగా గాడిదతోనో, కుక్కతోనో, చెట్టుతోనే చేసే ఉత్తుత్తి పెళ్లి వేరు… బాల్యవివాహాలు వేరు… ఆడ-మగ పెళ్లితోపాటు ఇప్పుడు మగ-మగ, ఆడ-ఆడ పెళ్లిళ్లు కూడా సాగుతున్నయ్…
తరచి చూస్తే ఇంకా భిన్న వివాహాలు ఏమైనా తడతాయేమో… కానీ ఇప్పుడు చెప్పుకునే పెళ్లి డిఫరెంట్… చదవగానే జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అనిపించేలా… ఆమెను ఆమే పెళ్లి చేసుకుంటుంది… అంటే తనను తానే చేసుకోవడం… వరుడు ఉండడు… బరాత్ ఉండదు… ఫెరాస్, సింధూర్, మెహందీ, వధువు అలంకరణ… ఇలా మిగతా పెళ్లి తంతు అంతా ఉంటుంది… దీన్ని సోలోగమీ అంటారట…
వడోదరకు చెందిన క్షమ బిందు వయస్సు 24 ఏళ్లు… ఆమె తనను తాను వచ్చే పదకొండో తారీఖున పెళ్లిచేసుకోబోతోంది… తన స్నేహితులు, కొలీగ్స్ 15 మంది వరకూ ఆహ్వానాలు పంపించింది… ‘‘నాకు చిన్నప్పటి నుంచీ ఓ కోరిక… పెళ్లి చేసుకోకూడదు అని… ఆ సంప్రదాయం నాకు ఇష్టం లేదు… కానీ వధువును కావాలని ఉంది… ఆ ముచ్చట నెరవేర్చుకోవాలని ఉంది… అందుకే ఇలా పెళ్లి చేసుకుంటున్నాను’’ అంటున్నది ఆమె… అర్థం కాలేదా..? అర్థమయ్యేట్టుగా ఆ పెళ్లి ఉంటే వార్త ఎలా అయ్యేది మరి…
Ads
ఈ నిర్ణయం తీసుకున్నాక… తల్లిదండ్రులకు చెప్పింది… తను చెప్పినా వినదు అని వాళ్లకు తెలుసు… నువ్వు ఏ నిర్ణయమైనా తీసుకో, నీ ఇష్టం అని ఓ పేద్ద దండం పెట్టేశారు… వాళ్లు వోకే చెప్పకపోయినా ఆమె ఆగదు కదా… చదువు లేనిదేమీ కాదు… ఆమె ఎంఎస్ యూనివర్శిటీలో సోషియాలజీ గ్రాడ్యుయేట్… ఓ మ్యాన్‌పవర్ ఔట్‌సోర్సింగ్ కంపెనీలో పనిచేస్తోంది…
ఐనా చదువుకూ ఈ ధోరణులకూ లింకేమీ లేదులే… ఆమధ్య ఏదో వెబ్ సీరీస్ చూసిందట… అందులో ఓ నటి ‘‘ప్రతి మహిళ ఈలోకంలో వధువు కావాలని కోరుకుంటుంది, కానీ భార్య కావాలని కాదు’’ అని ఓ డైలాగ్ చెబుతుందట… అదుగో అక్కడ ఈమె పుర్రలో ఈ ఆలోచన మెదిలిందట… కాదు బలపడిందట… ఆన్‌లైన్‌లోకి వెళ్లి బాగా వెతికింది… తనవంటి బుర్రతిరుగుడు కేరక్టర్ ఇంకెవరైనా ఉన్నారా అని… ఎవరూ తగల్లేదు… సో, నేను ఫస్ట్ అనుకుని సంబరపడిపోతోంది… ‘‘పెళ్లిని ఓ పవిత్రబంధంలో పరిగణించే ఈ దేశంలో తొలి స్వీయపరిణయ ఘటన, ఘనత నాదే నాదే’’ అని ఆనందపడుతోంది…
‘‘స్వీయ పరిణయం మన పట్ల మన నిబద్ధతకు తార్కాణం… బేషరతు ప్రేమకు నిదర్శనం… పెద్దరికంలోకి అడుగుపెట్టే ముహూర్తం… చాలామంది వింతగా చెప్పుకుంటారని నాకూ తెలుసు… కానీ ఇదీ మహిళాసమస్యే…’’ అంటున్నది ఆమె… మీకేమైనా అర్థమైందా..? లేదు కదా…! గుడ్… గోత్రిలోని ఓ గుడిలో జరిగే ఈ స్వయం వివాహానికి సంబంధించి అయిదు పెళ్లి ప్రమాణాలు రాసింది ఆమె… 9 తేదీన మెహందీ… 11న పెళ్లి… తరువాత రెండు వారాలపాటు గోవాకు హనీమూన్ ట్రిప్… అదేమిటి..? ఒంటరిగా హనీమూన్ ఏమిటని మరీ అంతగా హాశ్చర్యపోకండి… వరుడు లేకుండా పెళ్లి జరగడం లేదా ఏం..?! ఈ పెళ్లితంతులాగే శోభనానికి కూడా గది అలంకరణ, తెల్లచీరె, స్వీట్లు, మల్లెపూలు వంటివన్నీ ఉంటయ్… జస్ట్, మొగుడు అనబడే మగాడు ఉండడు… అంతే… ముందే చెప్పుకున్నాం కదా… పుర్రెకో బుద్ధి పుడమిలో సుమతీ అని…!!!
Share this Article