Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బీజేపీ ఆపరేషన్ ఫలిస్తుందా..? ఈమె ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తుందా..?

January 1, 2024 by M S R

బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే కొన్ని ఇంట్రస్టింగు వ్యాఖ్యలు చేశాడు ఈరోజు… జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా చేస్తాడనీ, తన భార్యకు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగిస్తాడనీ వాటి సారాంశం… సర్పరాజ్ అహ్మద్ అనే జేఎంఎం ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేయగానే స్పీకర్ ఆమోదించాడు… ఈ సందర్భంగా నిశికాంత్ మాట్లాడుతూ ‘‘హేమంత్ సోరెన్ రాజీనామా కూడా తథ్యం’’ అన్నాడు… అసలు ఏమిటీ కథ..? ఆయన భార్య ఎవరు..? ఆమె జార్ఖండ్ రబ్రీదేవి కాబోతున్నదా..?

నిజానికి 2022 జూన్‌లోనే మనం ఓ వార్త రాసుకున్నాం… అదేమిటంటే..? మహారాష్ట్రలో బీజేపీ ఆపరేషన్ పూర్తయింది కదా, ఇక జార్ఖండ్ మీద బీజేపీ కన్నుపడ్డట్టే అని… ఈడీ కేసులతో ఆపరేషన్ ప్రారంభమైంది కూడా… కానీ ఏడాదిన్నర దాటినా కథ తెలుగు టీవీ సీరియల్‌లా సా-గు-తూ-నే ఉంది… కథ మాత్రం కొలిక్కి రాలేదు… ఈ ఏడాది చివరలో జార్ఖండ్ అసెంబ్లీ పదవీకాలం అయిపోతుంది… ఈ ఏడాది కాలానికి బీజేపీ చేతులు కాల్చుకునే రిస్క్ తీసుకుంటుందా..? అదీ ప్రశ్న…

ఏడాదిన్నర క్రితం ఆపరేషన్ జార్ఖండ్ స్టార్టయిన వెంటనే సీఎం హేమంత్ సోరెన్‌కు కథ అర్థమైంది… వెళ్లి అమిత్ షాతో భేటీ అయ్యాడు… కానీ ఫలించలేదు… మా సంతాల్ ఆడబిడ్డ అంటూ తమ యూపీయే నిర్ణయాన్ని కాదని రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించాడు… అప్పటికే స్టేట్ బీజేపీ గవర్నర్ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది… ఎన్నికల సంఘం చీఫ్ సెక్రెటరీని రిపోర్ట్ అడిగింది… హేమంత్ ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా సిఫారసు చేసింది… తరువాత సోరెన్ సుప్రీంకోర్టు దాకా వెళ్లినా అక్కడా రిలీఫ్ లభించలేదు… తాజాగా ఈడీ మళ్లీ నోటీసులు జారీ చేసి, వారంలో జవాబు రాకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించింది… బహుశా అరెస్టు ఆలోచనలో ఉన్నట్టుంది… ఇదీ బీజేపీ ఎంపీ ఊహాగానాలకు నేపథ్యం…

Ads

ఒకసారి ఈ పరిణామానికి దారితీసిన విషయం ఏమిటో సంక్షిప్తంగా చెప్పుకుందాం… హేమంత్ సోరెన్ తనకు తానే ఆమధ్య ఓ మైనింగ్ లీజు ఇచ్చుకున్నాడు… మైనింగ్ శాఖ కూడా తన దగ్గరే ఉంది… మైనింగుకు పర్యావరణ, అటవీ క్లియరెన్సులు ఇచ్చుకున్నాడు… ఆ శాఖ కూడా తన దగ్గరే ఉంది… సీఎం తన భార్య కల్పనకు కూడా ఓ ఇండస్ట్రియల్ కారిడార్‌లో 11 ఎకరాల ప్లాట్ కేటాయించాడు… సీఎం రాజకీయ ప్రతినిధి పంకజ్ మిశ్రా, ప్రెస్ అడ్వయిజర్ అభిషేక్ ప్రసాద్ కూడా మైనింగ్ లీజులు పొందారని బీజేపీ ఆరోపణ… హైకోర్టులో కేసు పడింది… అడ్వొకేట్ జనరలే స్వయంగా ‘మిస్టేక్ జరిగింది’ అని అంగీకరించాడు…

jmm

బీజేపీ గవర్నర్ ద్వారా ఆట మొదలెట్టింది అప్పట్లో… శాసనసభ్యుడిగా హేమంత్‌పై అనర్హత వేటు వేయాలని కోరింది… గవర్నర్ కార్యాలయం రకరకాల ఆర్టికల్స్ 191, 192, పదో షెడ్యూల్, పార్లమెంటరీ ప్రాక్టీసెస్ తదితరాలన్నీ వడబోసి… ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని కోరింది… అది జార్ఖండ్ చీఫ్ సెక్రెటరీ లేఖ రాసి, మొత్తం వివరాల్ని పంపించాలని అడిగింది… అనర్హత వేటు వేయడమే కరెక్టు అని అది సూచించింది… ఇదీ నేపథ్యం…

Kalpana soren

ఎన్నికలకు ముందే పొత్తు కుదుర్చుకుని పోటీచేశాయి కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ… కూటమి మొత్తం 81 సీట్లకు గాను 47 గెలుపొందింది… ఇందులో జేఎంఎం వాటా 30 సీట్లు… కాగా కేవలం 25 సీట్లతో బీజేపీ చేతులెత్తేసింది… (మహారాష్ట్రలోలాగా ఎన్నికల అనంతరం కుదిరిన పొత్తు కాదు)… కూటమి సాలిడ్‌గానే ఉంది కాబట్టి… ప్రస్తుతానికి బీజేపీకి ఏకనాథ్ షిండే దొరకలేదు అంటున్నారు కాబట్టి… బహుశా హేమంత్ సోరెన్ సీఎం కుర్చీ ఖాళీ చేసి, తండ్రిని గానీ, భార్యను గానీ కుర్చీ మీద కూర్చోబెడతాడు అని ఓ ప్రాథమిక అంచనా…

తండ్రి 78 ఏళ్లు… తన బదులు భార్యే బెటర్ అని గనుక హేమంత్ అనుకుంటే కల్పన జార్ఖండ్ రబ్రీదేవి అవుతుంది… ఇంతకీ ఎవరామె..? నెట్‌లో బాగా సెర్చింగ్ మొదలైపోయింది అప్పటి నుంచే… 1976లో జార్ఖండ్, రాంచీలో పుట్టింది… కాకపోతే ఆమె ఒడిశా, మయూర్‌భంజ్ ఏరియాకు చెందిన కుటుంబం నుంచి వచ్చింది… ఇప్పటికీ తన బంధుగణం అక్కడే ఉంటారు ఎక్కువగా… 2006లో హేమంత్ సోరెన్‌తో పెళ్లి… అరేంజ్డ్ మ్యారేజీ…

కల్పన

రాంచీలో ఓ ప్లే స్కూల్ నడిపేది… ఇద్దరు పిల్లలు… పార్టీ కార్యక్రమాల్లో గానీ, మరే ఇతర రాజకీయ వ్యవహారాల్లో గానీ ఆమె కనిపించదు… వోటు వేసినప్పుడు, భర్తతో కలిసి కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు మాత్రమే కనిపిస్తుంది… ఏ మీటింగుల్లో కూడా ఆమె ఫోటోలు కనిపించవు… తను, తన భర్త, తన పిల్లలు… అదే తన ప్రపంచం… సీఎం కుర్చీ ఎక్కినా సరే, నామ్‌కేవాస్తే… (ఆర్జేడీ, జేఎంఎం, కాంగ్రెస్ కూటమి నిర్ణయమే అంతిమం…) చాలా రోజులుగా JMM లో ఈ డిస్కషన్స్ సాగుతూనే ఉన్నాయి…

కల్పన

జార్ఖండ్‌లో శాసనమండలి లేదు, కాబట్టి ఆమెను ఎమ్మెల్సీని చేస్తే సరిపోతుందనే ధీమా లేదు… ఏదో ఒక సీటు ఖాళీ చేసి మరీ ఎన్నిక చేయించాలి… అలా కాదంటే ఇంకొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి… శిబూసోరెన్ కొడుకు దుర్గా సోరెన్ భార్య సీతా సోరెన్ ఉంది… ఆమె ప్రస్తుతం ఎమ్మెల్యే… ఒకవేళ ఆ కుటుంబాన్ని కాదని, బయటి నుంచి ఎవరినైనా సీఎం కుర్చీ ఎక్కించాలంటే హేమంతే ఒప్పుకోకపోవచ్చు… పార్టీని చీల్చాలనే బీజేపీ కల ఫలించవచ్చు… ఆట ఇప్పుడే రసకందాయంలో పడింది… తరువాత ఏమిటీ అంటారా..? ఇది అయిపోనివ్వండి… ఢిల్లీ పిలుస్తోంది…!!

soren(ఈ ఫోటోలో ఉన్నది హేమంత్ సోరెన్, ఆయన భార్య కల్పన.., ప్రస్తుత రాష్ట్రపతి, జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము….)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions