ఆమె జైలుకు వెళ్లినప్పుడు ఏడు నెలల గర్భిణి… అక్కడే కాన్పు జరిగింది… కొడుకు పుట్టాడు… పేరు తాజ్… ఆరేళ్లు వచ్చేవరకూ అక్కడే ఉన్నాడు… తల్లి చేసిన నేరానికి, ఆ తల్లి కడుపులో పడిన పాపానికి ఆ అబ్బాయి అనుభవించిన తొలి కారాగార శిక్ష అది… తరువాత ఓ కేర్‌టేకర్‌కు అప్పగించారు… బాధ్యత తీసుకోవడానికి కూడా ఎవరూ లేరు… ఉన్నవాళ్లందరినీ ఆ తల్లే నరికి చంపేసింది… సో, కేర్ టేకర్… తన పర్యవేక్షణలో ఆ పిల్లాడు ఇప్పుడు చదువుకుంటున్నాడు, అప్పుడప్పుడూ తల్లిని జైలులో కలుస్తాడు, ఇప్పుడు ఆమెను ఉరితీయబోతున్నారు… అవును, స్వాతంత్య్రం వచ్చాక ఒక మహిళను మనదేశంలో తొలిసారిగా ఉరితీయబోతున్నారు… తరువాత ఆ పన్నెండేళ్ల కొడుకు పరిస్థితేమిటి..? తల్లి చేసిన నేరానికి ఆమె శిక్ష అనుభవిస్తుంది సరే, తప్పేం లేదు, ఆమె ఘాతుకానికి ఉరి చిన్న శిక్షే… కానీ ఆ పిల్లాడు..? ఏముంది..? విధి ఏది నిర్ణయిస్తే అటు కొట్టుకుపోవడమే… అసలు శిక్షను అనుభవిస్తూనే పుట్టినవాడు కదా… పుట్టుకతోనే ఆ జాతకాన్ని రాయించుకుని వచ్చినవాడు..? ఎవరేం చేయగలరు..? ఇలా అనుకోవాల్సిందేనా..?!
ఓసారి అసలు కథలోకి వెళ్దాం… ఉత్తరప్రదేశ్‌లోని ఆమ్రోహ… 2018… షబ్నం ఆమె పేరు… రెండు సబ్జెక్టుల్లో ఎంఏ చేసింది… ఇంటి పక్కన ఓ రంపపుకోత మిల్లులో పనిచేసే సలీం అనే వాడి వలలో పడింది… వాడు ఐదో తరగతి డ్రాపవుట్… అయితేనేం..? ప్రేమకు, కామానికి కళ్లుండవ్ కదా… అఫ్ కోర్స్, బుర్ర కూడా ఉండదు… ఆ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు… కుటుంబసభ్యులు సహజంగానే అంగీకరించలేదు… ఓ రాత్రి వాళ్లు తాగే పాలల్లో మత్తు మందు కలిపింది… వాళ్లు మత్తులో ఉండగానే ఏడుగురు కుటుంబసభ్యుల్ని ఆ ప్రేమికుల జంటను కిరాతకంగా నరికి చంపేసింది… అవ్వ, అయ్య, తోబుట్టువులను అలా ఎలా చంపగలిగింది అనే అమాయక ప్రశ్న వేయకండి… ప్రేమకు పైశాచిక బలం ఉంటుంది… అది ఎన్ని ప్రాణాలైనా తీయగలదు… ఏ విపత్తునైనా ఆహ్వానించగలదు… స్థానిక కోర్టు ఉరిశిక్షను విధించింది…
Ads
అక్కడి నుంచి వాళ్లకు ఎన్నిరకాల చట్టబద్ధమైన అవకాశాలున్నాయో అన్నీ వాడుకున్నారు… హైకోర్టు, సుప్రీంకోర్టు… అందరూ ఉరే సరి అన్నారు… అంతకన్నా పెద్ద శిక్ష లేదు కదా మరి… చివరి ప్రయత్నం ఉంది కదా… రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్… దాన్ని ఆయన తిరస్కరించాడు… సో, ఉరి తప్పదు… మధుర జైలులో ఆ ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి… నిర్భయ కేసులో తలారిగా వ్యవహరించిన పవన్ వీరినీ ఉరితీయనున్నాడు… ఈ షబ్నమ్‌కు ముందు మహారాష్ట్రలోని సీమా, రేణు అనే అక్కాచెల్లెళ్లకు ఉరిశిక్ష పడింది… అయిదుగురు చిన్నారులను హతమార్చిన కేసు… వీరి క్షమాభిక్ష పిటిషన్ కూడా 2014లోనే రాష్ట్రపతి తిరస్కరించాడు… యరవాడ జైలులో ఉన్న వీళ్లకు ఇంకా ఉరిశిక్ష అమలు పరచలేదు… వీరికన్నా ముందే షబ్నమ్‌ను గనుక ఉరితీస్తే, మన స్వరాజ్య సాధన తరువాత ఈ శిక్షకు గురైన తొలి మహిళ అవుతుంది… మరి కొడుకు..? కాలమే చెప్పాలి…!!
Share this Article