ఓ చిన్న కథ… ఒకసారి ఇంద్రుడికి రైతుల మీద బాగా కోపం వచ్చింది… వర్షాలు కాస్త ఆలస్యమైనా, తక్కువైనా సరే, వరుణదేవుడిని వదిలేసి తనను తిడుతున్నారనేది ఆ కోపానికి కారణం…
దాంతో ఓ భీకర ప్రకటన జారీ చేశాడు… ‘మీకు నా విలువ అర్థం కావాలి, అందుకని పన్నెండేళ్లపాటు అసలు ఒక్క చుక్క కూడా కురిపించను’ అనేది ఆ ప్రకటన సారాంశం…
‘అయ్యో, అయ్యో, సచ్చిపోతాం, దయచూపించు తండ్రీ’ అని రైతులు మొరపెట్టుకున్నారు… దాంతో తెలివిగా ‘అందరి దేవుడూ శివుడు కదా, తను ఢమరుకం మోగించినప్పుడు వర్షాలు కురిపిస్తాను’ అని చెప్పాడు…
Ads
వాళ్లు శివుడికి మొరపెట్టుకునేలోపు, ఇంద్రుడే వేగంగా వెళ్లి శివుడి దగ్గర మోకరిల్లి, ఇలా నేనొక ప్రకటన చేశాను, పన్నెండేళ్లపాటు ఢమరుకం మోగించకుండా నా పరువు పోకుండా కాపాడు స్వామీ’ అన్నాడు…
శివుడు అలాగే అన్నాడు… పన్నెండేళ్లపాటు ఢమరుకం చేతపట్టను అని హామీ ఇచ్చాడు…
ఇంకేముంది..? దిక్కుతోచని రైతులు ఇక నిరాశగా పన్నెండేళ్లపాటు నిరీక్షించడానికే నిర్ణయించుకున్నారు…
కానీ ఒక్క రైతు మాత్రం ఎప్పటిలాగే తన పొలం పనులు చేస్తూనే ఉన్నాడు… దున్నుతున్నాడు, విత్తనాలు వేస్తున్నాడు… ఎరువులు వేస్తున్నాడు…
ఎహె, ఏమిటోయ్ ఇది..? తమాషాగా ఉందా, పిచ్చా..? మూడేళ్లుగా చూస్తున్నాం, ప్రయోజనం లేదని తెలిసీ ఈ ప్రయాస ఏమిటి, కాలం వృథా, శక్తి వృథా కదా అనడిగారు, కొందరు ఎద్దేవా చేశారు, మరికొందరు వ్యంగ్య వ్యాఖ్యలూ విసిరారు…
ఆ రైతు నవ్వి ‘నాకు తెలుసు, ఇప్పుడు చేసే పనితో వచ్చేదేమీ లేదని మీ అందరిలాగే నాకూ తెలుసు… కానీ పన్నెండేళ్లు పని మానేస్తే అసలు పొలం పని ఎలా చేయాలో మరిచిపోతానేమో… అందుకే ఇలా చేస్తున్నాను’ అని బదులిచ్చాడు… పనిలో మునిగిపోయాడు…
ఇదంతా వింటున్న పార్వతికి జాలి కలిగింది… ఇంద్రుడి భీషణ ప్రకటనలో న్యాయం లేదని తోచింది… కానీ శివుడు ఇంద్రుడికి మాట ఇచ్చాడాయె… కానీ శివుడి ద్వారానే రైతుల్ని ఆదుకోవాలి, భక్తసులభుడు, భోళాశంకరుడు కదా తరువాత తనే అర్థం చేసుకుంటాడు అనుకుంది…
రైతు ఏమన్నాడో చెప్పింది శివుడికి… ‘నాకూ సందేహమొస్తోంది… పన్నెండేళ్ల తరువాత అసలు ఢమరుకం ఎలా మోగించాలో కూడా మరిచిపోతావేమో… ఏమో, ఇప్పటికే మరిచిపోయి ఉంటావు’ అంది చిలిపిగా…
‘ఎంత మాట..? ఎంత మాట..? ఇదుగో చూడు, అని ఢమరుకం తీసుకుని మోగించాడు… దాంతో వెంటనే మేఘాలు అప్రమత్తమై ‘శివుడాజ్ఞ అయ్యింది కదా’ అనుకుని భోరున వర్షించాయి…
ఇప్పటిదాకా తన పని తాను చేసుకుంటూ పోతున్న ఆ రైతు వెంటనే వర్షానంతర పొలం పనుల్లో బిజీ అయిపోయాడు… నాలుగు రోజులకే పంట ఏపుగా పెరిగింది… అప్పుడు హడావుడిగా కళ్లుతెరిచిన ఇతర రైతులు పొలాల వైపు పరుగులు తీశారు…
(మిత్రుడి వాల్ మీద కనిపించిన ఓ ఇంగ్లిష్ పోస్టుకు నా తెలుగు అనువాదం… ఈ కథలో నీతి ఏమిటో ఎవరికి వారు తెలుసుకోవచ్చు… శుభం…)
Share this Article