.
BIG ALERT: పూర్తిగా చదవండి. మీకు ఆసక్తికరంగా ఉంటుంది… సైబర్ మోసగాళ్లకు మోసగాడు
… మొన్నొక రోజు వాట్సాప్‌కి మెసేజ్.. ‘మీరు పార్ట్ టైం జాబ్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారా?’ అని. ఇలాంటి మెసేజ్లు నాకు అలవాటే కాబట్టి ‘అవును’ అని రిప్లై ఇచ్చాను. వెంటనే అటునుంచి ఓ సందేశం. అందులో ఏముంటుందో నాకు తెలుసు. ‘మా కంపెనీ మీకు కొన్ని టాస్క్‌లు ఇస్తుంది. వాటిని పూర్తి చేస్తే వెంటనే మీకు డబ్బు పంపిస్తుంది’ అని చెప్పారు. సరే అన్నాను. ఇది గతంలో నాలుగైదు సార్లు జరిగిన వ్యవహారమే కాబట్టి అంతా తెలిసిందే.
Ads
ఆ తర్వాత నేనే ‘నాకు టెలిగ్రామ్ అకౌంట్ ఉంది. మీ రిసెప్షనిస్ట్ ఐడీ ఇవ్వండి’ అన్నాను. వాళ్లు ఇలా వాట్సప్, వెబ్‌సైట్‌లలో టాస్క్‌లు చేయించరు. అన్నీ టెలిగ్రామ్ యాప్‌లోనే అంటారు. వాళ్లు చెప్పేకంటే ముందే నేనే ఉత్సాహం చూపించి అడిగాను. వాళ్లు వెంటనే రిసెప్షనిస్ట్ ఐడీ పంపారు. దాంతోపాటు నాకొక ఎంప్లాయ్ కోడ్ ఇచ్చారు. ఇదంతా గతంలో నాలుగైదు సార్లు రకరకాల నెంబర్ల నుంచి జరిగింది కాబట్టి నాకేమీ కంగారు లేదు.
సరే. . టెలిగ్రామ్‌లో ఆమెకు మెసేజ్ చేశాను. వెంటనే రియాక్ట్ అయి నా వివరాలు అడిగింది. మనం మన వివరాలు ఎందుకు చెప్తాం? పాలకొల్లు పాపారావ్ సన్నాఫ్ పూలపాడు పున్నారావ్ అని ఏవో నకిలీ వివరాలు చెప్పాను. ‘టాస్క్ ఇస్తాను పూర్తి చేయండి’ అంది. టాస్క్ అంటే ఏమీ లేదు, ఫ్లిప్‌కార్ట్‌లో వాళ్లు చెప్పిన వస్తువులను స్క్రీన్‌షాట్ తీసి పంపడం. అదే టాస్క్. అలా మూడు స్క్రీన్‌షాట్స్ తీసి పంపగానే, ‘మీరు విజయవంతంగా టాస్క్‌లు పూర్తి చేశారు. మీ అకౌంట్‌లోకి డబ్బు పంపుతాం. వివరాలు ఇవ్వండి’ అని మెసేజ్ వచ్చింది.
ఇది కూడా నాకు అనుభవమే కాబట్టి, నాకున్న మూడు అకౌంట్లలో నేను అసలు వాడని, ఏమాత్రం బ్యాలెన్స్ లేని అకౌంట్ వివరాలు పెట్టాను. సరిగ్గా నిమిషంలో రూ.200 వేశారు. ఆ తర్వాత అదే టాస్క్‌లు మరో మూడు చేయించారు. మరో రూ.200 వేశారు. ఆ తర్వాత ఇంకో రెండు టాస్క్‌లు. మరో రూ.160. హమ్మా! మొత్తానికి రూ.560 లాభం అనుకున్నాను. కానీ వీళ్లింకా అసలు మ్యాటర్ చెప్పడం లేదేంటీ అనుకుంటూ ఉన్నాను.
చివరకు అసలు విషయానికి వచ్చారు. ఇప్పటిదాకా చేసిన టాస్క్‌లు ఉచిత టాస్క్‌లనీ, ఇకపై చేసేవాటి కోసం గ్రూప్‌లో చేరాలని, చేరాలంటే రూ.2000, రూ.5000, రూ.10,000.. ఇలా లక్ష దాకా ఉన్న పట్టిక పంపించారు. ఎంత ఎక్కువ డబ్బు కడితే, అంత ఎక్కువ రిటర్న్స్ వస్తాయని అన్నారు. అబ్బా! చివరకు అసలు విషయానికి వచ్చార్రా బాబూ అనిపించింది.
వాళ్లకు డబ్బు కడుతున్నట్లే చేసి, ఫెయిల్ అయిన స్క్రీన్ షాట్స్ పంపాను. వాళ్లు రకరకాల యూపీఐ ఐడీలు పంపారు. అన్నీ అలా ఫెయిల్ చేసి వాళ్లకు విసుగు తెప్పించాను. ‘నా సమస్య ఏమీలేదు. నా బ్యాంకు అకౌంట్ లాక్ అయ్యింది. మీరో వెయ్యి రూపాయలు వేస్తే ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఒకేసారి మీ డబ్బు కూడా కలిపి రూ.10 వేలు వేస్తా’ అని రిప్లై ఇచ్చాను. అప్పటిదాకా ఇంగ్లీషులో సాగిన సంభాషణ కాస్తా అయిపోయి, ఇక ‘క్యా..’, ‘నహీ..’కి వచ్చేశారు. ఇక నేను రెండు వేయించిన తిట్లు తిట్టాను. కట్.. మళ్లీ రిప్లై లేదు.
నాకు వచ్చిన ఆ రూ.560 పెట్టి మొన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పుస్తకాలు కొనేశాను. వాళ్లెవరో మళ్లీ మెసేజ్ చేసి ఇంకో రూ.500 ఇస్తే బాగుండు. ఇలా వీళ్లని బురిడీ కొట్టించి, ఇప్పటికి రూ.2 వేల దాకా లాగిన అనుభవం నాకుంది. ఇలాంటివి మీరు ప్రయత్నం చేయొచ్చు. ఎటొచ్చీ మీ అసలు వివరాలు, మీరు తరచూ వాడే లేదా ఎక్కువ డబ్బు ఉంటే బ్యాంక్ అకౌంట్ వివరాలు మాత్రం చచ్చినా చెప్పొద్దు. ఇతర వివరాలు మాత్రమే చెప్పి, వాడిచ్చిన డబ్బును జేబులో వేసుకోండి. వాళ్లకు మాత్రం ఒక్క రూపాయి కూడా పంపకండి… – విశీ (వి.సాయివంశీ)
Share this Article