Subramanyam Dogiparthi …….. శాస్త్రీయ నృత్యం అయినా సమకాలీన నృత్యాలయినా స్టెప్పులయినా అతనికి అతనే సాటి . అతడే చిరంజీవి . సినీరంగంలో చిరంజీవిలాగా శాస్త్రీయ , ఆధునిక నృత్యాలు అన్నింటినీ చేయకలిగిన నటులు లేరేమో !
తమిళంలో కమల్ హసన్ ఒక్కడే సాటి . కొందరు హీరోలు స్టెప్పులు వేయకలిగినా శాస్త్రీయ నృత్యంలో చిరంజీవి , కమలహాసన్ లాగా నృత్యించలేరు . కొందరు హీరోలు శివుని పాత్రలో తాండవం అద్భుతంగా చేసినా చిరంజీవి లాగా ఆధునిక స్టెప్పుల డాన్సులు చేయలేకపోయారు . మొత్తం మీద నృత్యాల్లో , స్వయంకృషిలో , క్రమశిక్షణలో అతనికి అతనే సాటి .
Ads
ముఖ్యంగా కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ శుభలేఖ సినిమాలో ఆల్విన్ వ్యాపార ప్రకటనలో వివిధ ప్రాంతాల నృత్యాలలో చిరంజీవి నృత్య కౌశల్యం అద్భుతం . కూచిపూడి , భరతనాట్యం , కథాకళి , కధక్ నృత్యాలలో చిరంజీవిని విశ్వనాథ్ చాలా అందంగా చూపారు . నృత్య దర్శకుడు శేషుని తప్పక అభినందించాలి .
నెగటివ్ , పాజిటివ్ రోల్సుల్లో కాసేపు అటు కాసేపు ఇటు చక్కర్లు కొడుతున్న చిరంజీవికి శాశ్వత పాజిటివ్ హీరో స్థానాన్ని ఈ సినిమా ద్వారా విశ్వనాథ్ సుస్థిరం చేసారని చెప్పవచ్చు . విశ్వనాథ్- చిరంజీవిల కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా శుభలేఖ . వీరిద్దరి జోడీలో వచ్చిన తరువాయి స్వయంకృషి , ఆపద్బాంధవుడు చిరంజీవికి ఎంత పేరు తెచ్చిపెట్టాయో మనందరికీ తెలిసిందే .
ఈరోజుకీ సమాజాన్ని పట్టిపీడిస్తున్న పీడ వరకట్నం . కాకపోతే ఇప్పుడు పీక్కుతింటాలు లేవు . ఆనాటి సమాజంలో సంతలో గొడ్డుని బేరం చేసినట్లు వరుడి తల్లిదండ్రులు బేరం చేసేవారు . ఆ బేరసారాల్ని సత్యనారాయణ పాత్ర ద్వారా విశ్వనాథ్ చాలా బాగా చూపారు .
ఈ సినిమాలో విశ్వనాథ్ పరిచయం చేసిన మరో గొప్ప కాన్సెప్ట్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ . ఎంతోమంది యువతీయువకులు ఈ డిగ్నిటీ ఆఫ్ లేబర్ కాన్సెప్టుని అర్థం చేసుకోలేక తప్పుడు పనులు చేయటం లేదా ఆత్మహత్యలు చేసుకోవటం చూస్తూ ఉంటాం . ఈ సినిమాలో హీరో పాత్ర ద్వారా డిగ్నిటీ ఆఫ్ లేబర్ కాన్సెప్టుని ప్రేక్షకులకు వివరించారు విశ్వనాధ్ .
ఈ రెండు అంశాలనే కాదు ; మహిళల దృఢ వ్యక్తిత్వాన్ని కూడా బాగా చూపారు . హీరోయిన్ సుమలత పాత్ర . పెళ్ళిచూపుల్లో సంతలో గొడ్డుని అమ్ముకుంటున్నట్లు బేరానికి పెట్టిన ఆదిశేషయ్యని ఎడాపెడా కడిగేసే అమ్మాయి పాత్రను బాగా చూపారు .
మరో అమ్మాయి పాత్ర తులసిది . ఆదిశేషయ్య రెండో కొడుకుని తెలివిగా పెళ్ళిచేసుకుని మామని ముప్పుతిప్పలు పెట్టే పాత్ర . కొనుక్కున్న సరుకును హేండోవర్ చేయాలని మామతో వ్యాజ్యానికి దిగే పాత్ర . మొగుడిని స్వాధీనం చేయమని అడిగే ఆలోచన విశ్వనాధుకి భలే వచ్చింది .
ఈ సినిమా విజయంలో సంగీత దర్శకుడు కె వి మహదేవన్ పాత్ర తక్కువేమీ కాదు . కె వి మహదేవన్ సంగీత నైపుణ్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలో విశ్వనాధుకి బాగా తెలుసు . సినిమా టైటిల్సుతోనే విన్నపాలు వినవలె అన్నమయ్య పాటతో వినిపించారు .
ఆ తర్వాత కాలేజీలో చిరంజీవి పాత్ర చేత అన్నమయ్యదే మరో పాట నెయ్యములల్లో నేరెళ్ళో గొప్పగా వినిపిస్తారు . నాకు తెలిసినంతవరకు ఈ పాట అన్నమయ్య మిగిలిన పాటల్లాగా పామరుల్లో అంత పాపులర్ కాదు . అలాంటి చక్కని పాటను జనబాహుళ్యానికి వినిపించారు . త్యాగరాజ కృతి మరుగేలరా కూడా వినిపించారు .
వేటూరి వారు మరో సూపర్ హిట్ పాటను ఇచ్చారు . రాగాల పల్లకిలో కోయిలమ్మ . మిగిలిన పాటలు అయితే అదే నిజమైతే , నీ జడ కుప్పెలు పాపులర్ కాలేదు . విశ్వనాథ్ ఎలాగోలా శాస్త్రీయ ఆలాపనలను దూరుస్తారు . హోటల్ కిచిన్లో చిరంజీవి పాత్ర చేత చేయించే ఆలాపన , నటన హైలైట్ .
సాధారణ నటీనటులతో అసాధారణ సినిమాలు తీయటమే విశ్వనాధ్ , జంధ్యాల , దాసరి వంటి దర్శకుల సృజనాత్మక శక్తి . సుమలత ఈ సినిమా టైంకు అంత పేరున్న నటి ఏమీ కాదు . చాలా మీక్ వాయిస్ కూడా . ఆమెతో సినిమాను నడిపించాడు విశ్వనాధ్ .
అప్పుడప్పుడే బేబీ స్థాయి నుండి కుమారి స్థాయికి ఎదిగిన తులసి . సుధాకర్ కు మొదటి సినిమా . అప్పటికే ఇంకో సుధాకర్ ఉండటంతో శుభలేఖ సుధాకర్ గా నిలిచిపోయాడు అల్లరి నరేష్ లాగా .
ఈ సినిమాలో కీలక పాత్ర సత్యనారాయణది . పీనాసి , ఆశబోతు , మరీ అంత చెడ్డవాడు కాదు , ఊళ్ళో పెద్దమనిషి , వెరశి ఆదిశేషయ్య పాత్ర . బ్రహ్మాండంగా నటించాడు సత్యనారాయణ . ఇతర పాత్రల్లో రమణమూర్తి , రాళ్ళపల్లి , సాక్షి రంగారావు , సప్తపది గిరీష్ , అరుణ్ , వంకాయల , హేమసుందర్ , అనుపమ , నిర్మలమ్మ , పుష్పకుమారి , అల్లు రామలింగయ్య ప్రభృతులు నటించారు .
గొల్లపూడి మారుతీరావు డైలాగులు పదునుగానే ఉంటాయి . బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , యస్ జానకి , శైలజ పాటల్ని శ్రావ్యంగా పాడారు . సినిమా అంతా విశ్వనాధ్ , చిరంజీవిలే కనిపిస్తారు . చిరంజీవికి ఉత్తమ నటుడిగా మొదటి ఫిలింఫేర్ అవార్డుని తెచ్చిపెట్టింది ఈ సినిమా . విశ్వనాధుకి ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డు , ఉత్తమ కధా రచయితగా నంది అవార్డులు కూడా వచ్చాయి .
అల్లు అరవింద్ , వి వి శాస్త్రి కలిసి తీసారు ఈ సినిమాను . అయితే హిందీలో రీమేక్ అయినప్పుడు అల్లు అరవింద్ లేడు . శాస్త్రి గారొక్కరే నిర్మాత . శుభ కామనా అనే టైటిలుతో రాకేష్ రోషన్ , రతి అగ్నిహోత్రి , సుధాకర్ , వినోద్ మెహ్రాలు నటించారు . విశ్వనాధే డైరెక్ట్ చేసారు . ఎలా ఆడిందో తెలియదు .
శుభలేఖ సినిమాలో చిరంజీవిది హోటల్లో సర్వర్ పాత్ర . అప్పుడే నిర్మించబడిన డాల్ఫిన్ హోటల్లో షూట్ చేయబడటం విశేషం . ఈ చక్కటి అందమైన సినిమా యూట్యూబులో ఉంది . చూడనివారు తప్పక చూడండి . వాచ్ లిస్టులో పడేయండి . శ్రావ్యమైన సంగీతం , పాటలు అలరిస్తాయి . An unmissable , feel good , message- delivering , musical movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు
Share this Article