ఈమధ్య బండ్ల గణేష్ హీరోగా చేసిన డేగల బాబ్జీ అనే సినిమా వివరాల్ని ప్రతి మీడియా పబ్లిష్ చేసింది… అదొక ప్రయోగం… ఒకే ప్లేసులో, ఒకే వ్యక్తితో సాగే రెండు గంటల సినిమా… గణేషుడు నవరసాలూ పోషిస్తాడట… మిగతా పాత్రలు జస్ట్, మాట్లాడుతుంటాయి… కానీ కనిపించవు… నిజానికి స్థూలంగా చూస్తే ఓ భిన్న ప్రయోగమే… కాకపోతే బండ్ల గణేష్ అనగానే తన కామెడీ ప్రసంగాలు గుర్తొచ్చి వెంటనే నవ్వొస్తుంది… చిరాకేస్తుంది… ఏం నటించాడో చూడాలిక…
అది తమిళంలో తీసిన `ఉత్త సిరుప్పు సైజు 7` అనే సినిమాకు రీమేక్ అట… దాని అసలు అర్థమేమిటో మనకు తెలియదు గానీ… అది 7′ O Clock రేజర్ బ్లేడ్ మాత్రం కాదు… ప్రయోగమంటే గుర్తొచ్చింది… బహుశా ఇక ఇండస్ట్రీలో అలాంటి ప్రయోగం ఇంకెవరూ చేయరేమో… అదే మోహన్‌బాబు చేసిన ‘సన్నాఫ్ ఇండియా’ ప్రయోగం… ప్రయోగాత్మక సినిమా అంటేనే జనం పారిపోయే ప్రయోగం అది… సరే, ఆ ట్రాష్ వదిలేస్తే… సినిమాల్లో రకరకాల ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి…
Ads
కథలు, కథనాలు, స్క్రీన్‌ప్లే, ప్రజెంటేషన్, స్టోరీ యాంగిల్, కేరక్టరైజేషన్ ఎట్సెట్రా బోలెడు ప్రయోగాలు… అప్పట్లో సింగీతం శ్రీనివాసరావు ఓ మూకీ సినిమా తీశాడు, పేరు పుష్పక విమానం… భలే పేలింది, సినిమా బాగుంటుంది కూడా… ఇప్పుడు మరో మౌన సినిమా వస్తోంది… నిశ్శబ్ద సినిమా… అదీ తమిళంలోనే… (మన తెలుగువాళ్లకు బండకొట్టుడు సినిమాలు తప్ప ప్రయోగసోయి చాలా తక్కువ)… అసలు సినిమా అంటేనే మస్తు పంచులు ఉండాలి, హీరోలు, విలన్లు భీకరంగా అరవాలి, సవాళ్లు విసురుకోవాలి, పాటలు మోతెక్కాలి కదా, మరి ఈ కొత్త మూకీ ప్రయోగం ఏల..?
అదే అడిగితే… ‘‘మౌనం మాటలకన్నా ఎక్కువ భావాల్ని వ్యక్తీకరిస్తుంది, అదెలాగో మేం చూపిస్తాం’’ అంటున్నారు నిర్మాతలు… జీస్టూడియోస్ ఆర్థిక సహకారం చేస్తున్న ఆ సినిమా పేరు ‘గాంధీ టాక్స్’…
‘‘ఇది డార్క్ సెటైరికల్ కామెడీ జానర్’’ అంటున్నాడు దర్శకుడు… ఓహ్, ఇదొక జానర్ కూడా ఉందా..? అదీ సైలెంట్ డార్క్ సెటైరికల్ కామెడీ… సై.డా.సె.కా… సొసైటీ మీద, జాతివివక్ష మీద సెటైర్లు ఉంటాయట… సరే, బాగుంది… పురాణాల్లోని సముద్ర మంథన్… అనగా తెలుగులో క్షీరసాగర మథనం కాన్సెప్టు బేస్‌గా తీసుకుంటారట… ఇందులో విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితిరావు హైదరీ ప్రధాన పాత్రధారులు… సైలెంట్ సినిమా అంటే కేవలం మాటలు ఉండవా..? లేక భీకరమైన బీజీఎం మోతల నుంచి కూడా దూరంగా ఉంటుందా..? ఆ క్లారిటీ మాత్రం ప్రస్తుతానికి లేదు…
బీజీఎం కూడా లేకపోతే సినిమాను చూడటం కష్టమేమో… ఏమో, ఐనాసరే, చూసేలా నిర్మిస్తారేమో… ఎంతసేపూ అరవింద్ స్వామిని, అదితిరావు హైదరీని అలా మాటాపలుకు లేకుండా తెర మీద చూస్తూ ఉండలేరు కదా… ఈమధ్య కొంతకాలంగా విజయ్ సేతుపతి బాగా వెనుకబడిపోయాడు… ఎంచుకునే పాత్రలు, బ్యానర్లు తనను బాగా వెనకపడేశాయి… అరవింద్ స్వామి రెగ్యులర్ హీరో కాదు… అఫ్‌కోర్స్, హైదరీ వోకే… మంచి పాత్ర దొరకాలే గానీ కళ్లతో నటించేస్తుంది తను… మాటలు దేనికి..? సో, ఎంతసేపూ ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్‌ల గురించేనా..? గాంధీ టాక్స్ వంటి ప్రయోగాల గురించీ అప్పుడప్పుడూ న్యూస్ టాక్ ఉండాలి కదా…!!
Share this Article