.
ఓ మిత్రుడన్నాడు… ‘‘తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో కస్సుమన్నాడు కదా పవన్ కల్యాణుడు… తరువాత టికెట్ల రద్దీ తొక్కిసలాటలో టీటీడీ తప్పుల వల్లే పలువురు ప్రాణాలు కోల్పోయారు… తనే ముందుగా సారీ చెప్పాడు, మీరెందుకు చెప్పరంటూ టీటీడీ పెద్దలపై కస్సుమన్నాడు… ఏదో గుడి మెట్లు కడిగాడు… కట్ చేస్తే…
గుడ్, ఉపముఖ్యమంత్రిగా ప్రభుత్వ వైఫల్యం పట్ల బాధ్యత వహించి సారీ అన్నాడు సరే, మరిప్పుడు సింహాచలం గోడ కూలిపోయి భక్తులు మరణించారు… సారీ చెప్పాడా..? కనీసం జరిగింది తప్పే అన్నాడా..?’’
Ads
ఇదీ తన ప్రశ్న… ఏమో, అన్నాడో లేదో చదివినట్టు గుర్తులేదు, బహుశా అదేదే వీరమల్లు షూటింగులో బిజీగా ఉన్నాడేమో అన్నాను అన్యమనస్కంగా… నో, నో, అదెలా కుదురుద్ది… అసలు కాంక్రీట్ పిల్లర్లు లేకుండా గోడ కట్టడం ఏమిటి..? ప్రభుత్వానిదే బాధ్యత కాదా ఈ దారుణానికి అని ఆగ్రహించాడు మిత్రుడు…
అసలు యాష్ బ్రిక్స్‌ను వరుసగా ఒకదాని మీద ఒకటి పేర్చేసినట్టున్నారు… ఎంత దారుణం..? ఎవడో కంట్రాక్టర్… వాడిపై ఆలయాధికారుల పెత్తనం, ఒత్తిడి… కమీషన్లు, కక్కుర్తి యవ్వారాలు వేరు, వాడు సబ్ కంట్రాక్టుకు ఇచ్చాడట… వందకు వెయ్యి శాతం బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం, భక్తుల ప్రాణాల పట్ల తేలికతనం…
మన గుళ్లు వందల ఏళ్లయినా చెక్కుచెదరవు… అది మన పురాతన వాస్తుజ్ఙానం… మరి ఇప్పుడు సింహాచలం గోడ మన ధూర్తత్వానికి నిలువెత్తు ప్రతీకలు… ఎంత దౌర్భాగ్యం మనది… కనీసం గుళ్ల విషయంలో కూడా ధర్మాధర్మ విచక్షణ లేదు, పాపభీతి లేదు… అసలు దేవుడంటేనే భయం లేదు…
జగన్ సరే, వెళ్లాడు, తిట్టాడు, పోయాడు… అది రాజకీయం, సరే… ఒక్క మంత్రయినా, ఒక్క బాధ్యుడైనా… ఎస్, ఇది తప్పే… లేదా పొరపాటే… అని అంగీకరించాడా..? ఆలయ అనువంశిక ధర్మకర్త కనిపించాడా..? జగన్‌ను తిట్టిపోయడం సరే… ఈ ప్రాణనష్టాలకు కారకులను ఎవరినీ వదలేది లేదు అని చెప్పారా ఒక్కరైనా..?
ముందు కేసు నమోదు చేయాలి కదా… చేశారా..? ఆలయ బాధ్యుడెవడో తక్షణం ఉద్యోగం పీకాలి కదా… ఏదీ లేదు, ఉండదు… ఇదే కాదు, లడ్డూ నెయ్యి, రద్దీ ప్రాణనష్టాలు… అన్నీ అంతే… పుష్కర మృతుల్లో ఎవరిని ఫిక్స్ చేశారు, ఏం చర్యలు తీసుకున్నారు..? నో, నిల్, నెవ్వర్…
ఇదీ అంతే… నాలుగు రోజుల పేపర్లలో వార్తలు… రాజకీయ నాయకుల్లో వాడు వీడిని తిడతాడు, వీడు వాడిని తిడతాడు… బస్, చచ్చినవాడు మళ్లీ రాడు, ఎవడూ కోర్టుకు లాగడు… అదేమంటే భారీ వర్షాలు, ప్రకృతి విపత్తు అంటారు… ఆమాత్రం వానలకు తట్టుకోలేక గోడ కూలిందని సమర్థించడంకన్నా దరిద్రం మరేముంటుంది..?
నో, నో, వీళ్లు ఎలా ఉన్నా… ఆ దేవుడు శిక్షిస్తాడు అంటారా..? నెవ్వర్, దేవుడు పాపులందరినీ క్షమిస్తాడు… క్షమ దైవలక్షణం… ఇదే మన ఖర్మ సిద్దాంతం అనబడును… అశుభం భూయాత్..!!
Share this Article