Vijayakumar Koduri ……….. నారాయణ రెడ్డి గారూ – రాములమ్మ…….. ‘రాములో – రాములా – నా పాణం తీసిందిరో’ అన్న పాట వినగానే ఇప్పటి యువతరానికి అల్లు అర్జున్, థమన్ గుర్తుకొస్తారు. బహుశా, ‘పాట లో ఆ మాటలను కాయిన్ చేసిన వాడు కదా ముఖ్యం’ అని ఏ కొందరైనా భావిస్తే, ఆ పాట రాసిన మా వరంగల్ కాసర్ల శ్యామ్ గుర్తుకొస్తాడు.
కానీ, తెలుగు వెండి తెరకు ‘రాములు/రాములమ్మ’ ని పరిచయం చేసింది డా సి నారాయణ రెడ్డి గారే అనుకుంటా ! ఈ మాట చెప్పగానే, నలభైలు, యాభైలలో వున్న మిత్రులకు ఒసేయ్ రాములమ్మ సినిమాలో సినారె రాసిన ‘ఓ ముత్యాల రెమ్మ- ఓ మురిపాల కొమ్మ – ఓ పున్నమి బొమ్మ – ఓ పుత్తడి గుమ్మ – ఓ రాములమ్మా’ పాటే గుర్తుకొస్తుంది.
Ads
బహుశా, ఈ పాట రాయడానికి నారాయణ రెడ్డి గారికి స్ఫూర్తిని యిచ్చింది గురజాడ రాసిన ‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’ అయి ఉంటుందని అప్పట్లో అనుకునేవాడిని. ఈ పాట అనే కాదు – సినారెకు ఈ రాములమ్మ పేరు పట్ల ఒక యిష్టం వంటిది వుండేదనుకుంటా ! కోడి రామకృష్ణ రెండో సినిమా ‘తరంగిణి’ లో కూడా పతాక సన్నివేశంలో వొచ్చే బుర్రకథ పాటలో ఈ రాములమ్మ వినిపిస్తుంది – ముఖ్యంగా, ‘అగ్నిగుండమని తెలిసి ఆహుతి కానున్నావా / సుడిగుండమని తెలిసి పడిపోతున్నావా /కసాయి వాడి కత్తికి నీ కంఠమివ్వబోతున్నావా/ ఆ కత్తినే ఎదిరిస్తావా / రావులమ్మో రావులమ్మో రవ్వల బొమ్మా రావులమ్మా’ అన్న పంక్తులు ఎమోషనల్ గా సాగుతాయి.
ఈ పాటలో ‘రాములమ్మ’ అని కాకుండా ‘రావులమ్మ’ అని వినిపించినా, సినిమా విడుదలైనప్పుడు, వరంగల్ లో మా ఇంటి దగ్గర వుండే సినిమా పిచ్చోళ్ళు అందరూ ‘రాములమ్మ’ నే స్వీకరించారు. ఇప్పుడు రాసిన సినారె, రాయించుకున్న కోడి రామకృష్ణ లేరు కాబట్టి, నిజం ఏమిటో చెప్పేవాళ్ళు లేరు.
పాట రాసేటప్పుడు సినారె మనసులో వున్నది ‘రాములమ్మ’ నే అయి ఉంటుందని నా చిన్న నమ్మకం/సందేహం! ఒసేయ్ రాములమ్మ సినిమా లోని టైటిల్ గీతం సంగతేమో గానీ, తరంగిణిలోని ఈ బుర్రకథ పాటకు స్ఫూర్తిని యిచ్చింది మాత్రం ఖచ్చితంగా గురజాడ రాసిన ‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’ అయి ఉంటుందని అర్థమై పోతుంది.
మనసును తాకే బ్లాక్ & వైట్ సినిమాల కాలం నాటి ఇటువంటి బుర్రకథ / హరికథ పాట సన్నివేశం దాసరి నారాయణ రావు తీసిన ‘సర్దార్ పాపారాయుడు’ లో కూడా ఉంటుంది. అల్లూరి సీతారామరాజు మీద శ్రీశ్రీ రాసిన ఆ బుర్రకథ పాటకు స్ఫూర్తి ‘తెలుగు ఆధునిక బుర్రకథా పితామహుడు షేక్ నాజర్’ ప్రదర్శించిన బుర్రకథ అంటారు.
దాసరి, కోడి రామకృష్ణ వంటి వారు నాటక రంగం నుండి మొదలై, కవులు కళాకారులతో సాంగత్యం వున్న వాళ్ళు గనుక, వాళ్ళ సినిమాలలో ఎక్కడో ఒకదగ్గర కాస్తయినా బుర్రకథ వంటి కళారూపాలకు చోటు దక్కేది. ఆ తరువాత్తరువాత ప్రధాన స్రవంతి వాణిజ్య చిత్రాలలో ఈ అంటు పూర్తిగా ఆవిరై పోయింది.
అన్నట్టు, ఇదంతా ‘రాములమ్మ’ దగ్గర మొదలైంది కదా ! నా చిన్నప్పుడు ఊళ్ళల్లో ‘రాములు’ చాలా పాపులర్ పేరు. మా దగ్గరి బంధువులలోనే ముగ్గురి పేరు ‘రాములు’… ఎప్పుడైనా ‘రాములు’ అన్న ప్రస్తావన వొస్తే ‘ఏ రాములు ?’ అని అడిగేవాళ్ళు. బహుశా, ఇటువంటి పేర్లు ఇప్పుడు ఎవరూ పెడుతున్నట్టు లేదు- ఊళ్ళల్లో కూడా !
ముక్తాయింపు : తెలంగాణ కథగా తీయబడిన ‘ఒసేయ్ రాములమ్మ’ విడుదలైనప్పుడు, మా మిత్రుల నడుమ జరిగిన చర్చ – ‘తెలంగాణ లో ఒసేయ్ అంటరా ?’
Share this Article