సీతారామం…! స్థూలంగా… ఈ సినిమాకు సంబంధించిన వివరాలు చదువుతుంటే… అబ్బో, ఈ సినిమా ఏదో చూడబుల్‌గానే ఉండేట్టుంది అనిపిస్తుంది… ఎన్నెన్నో పెద్ద విజయాల్ని అందుకున్న వైజయంతి మూవీస్ వాళ్ల సినిమా… అశ్వినీదత్ బిడ్డ స్వప్నాదత్ బాగా కష్టపడింది… ప్రిరిలీజ్ ఫంక్షన్‌లోనూ హీరో ప్రభాస్ ఆమెను ప్రత్యేకంగా అభినందించాడు… అప్పట్లో మహానటి, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాల్ని ఆమె తన సోదరి ప్రియాంకదత్‌తో నిర్మించింది…
ఆ రెండు సినిమాలకు బంపర్ వసూళ్లేమీ రాలేదు… కానీ సక్సెస్, మంచి పేరొచ్చింది… ఒక్క ముక్కలో చెప్పాలంటే టేస్టున్న అక్కాచెల్లెళ్లు… తెలుగు సినిమాలకు అలవాటైన వెగటుతనం జోలికి వెళ్లరు… మహానటి నిర్మాణ సమయం నుంచీ దుల్కర్‌తో మంచి రిలేషన్ కొనసాగుతూ ఉన్నట్టుంది… ఈ సీతారామం సినిమాకు ఒప్పించారు… కాస్త పద్ధతిగానే సినిమాను డీల్ చేయగలడు అనుకున్న హను రాఘవపూడిని దర్శకుడిగా ఎన్నుకుని ఈ భిన్నమైన కథను అప్పగించారు…
వైజయంతి మూవీస్ అడిగితే ఎవరు కాదంటారు..? దుల్కర్‌తోపాటు హిందీ నటి మృణాల్ ఠాగూర్, ప్రస్తుతం తెలుగులో పాపులర్ హీరోయిన్ రష్మిక మంథన, ఓ సైడ్ కేరక్టర్‌కు ఒకప్పటి హీరో సుమంత్, ఓ చిన్న పాత్రకు ఒకప్పటి హీరోయిన్ భూమిక, మరో సాదాసీదా పాత్రకు దర్శకుడు తరుణ్ భాస్కర్, గౌతమ్ మేనన్… చివరకు ప్రకాష్ రాజ్ సహా ఇలా చాలామంది కనిపిస్తారు… యుద్ధం రాసిన ప్రేమకథ అన్నారు… సో, యాక్షన్, సాహసాలు, ప్రేమ, ఓ లేఖ చుట్టూ అల్లిన పొయెటిక్ స్టోరీ… ఇంకేం కావాలి..? ఎలాగూ ఈ దర్శకనిర్మాతలు అశ్లీలం జోలికి వెళ్లరు… అరవైలు, ఎనభైల నాటి ఓ పిరియాడికల్ స్టోరీ… ఇలా సినిమా మీద ఓ సదభిప్రాయం ఏర్పడుతుంది… అయితే..?
Ads
సినిమాటోగ్రఫీ సూపర్… రామ్ పాత్రకు దుల్కర్ ఎంపిక కరెక్ట్… తను స్వతహాగానే మంచి నటుడు… మంచినీళ్లు తాగినంత ఈజీగా చేసేశాడు… ఎటొచ్చీ సీత పాత్రకు మృణాల్ అంతగా సూట్ కానట్టనిపిస్తుంది… ప్చ్… ఆ పాటల తీరు రాధేశ్యామ్ పాటల తరహాలో… అర్థం కాని బరువైన పదాల భావకవిత్వాల్లా సాగిన వైనాన్ని మనం గతంలో కూడా చెప్పుకున్నాం… ఇలాంటి కథల్లో కామెడీ పేలడానికి పెద్దగా స్కోప్ ఉండదు… అదే జరిగింది… సోసో… ప్రేమకథలు చిన్న చిన్న ట్విస్టులతో, సరదాగా సాగితే రక్తికడతాయి… కానీ..?
ఆమధ్య విరాటపర్వం పేరిట దర్శకుడు వేణు ఏం చేశాడు..? రానా, సాయిపల్లవి నడుమ ఏ బీభత్సమైన, అర్థరహిత ప్రేమకథను పెట్టి విప్లవాన్ని బ్యాక్‌డ్రాప్‌గా వాడుకున్నాడు… విప్లవాన్ని కూడా యాక్షన్ ఆఫ్ లవ్ అన్నాడు… బేసిక్‌గా ఆ ఫిలాసఫీయే తప్పు… జనం జుత్తుపీక్కున్నారు… సినిమా కొట్టేసింది… సీతారామం సినిమాలో యుద్ధం రాసిన ప్రేమకథ అనే లైన్ తీసుకున్నారు… అది కన్విన్సింగ్‌గా, బలంగా చెప్పగలిగితే తప్ప జనానికి ఎక్కదు… అదే జరగలేదు… ఒక లేఖ చుట్టూ రెండు దేశాల శతృత్వం, మిలిటరీ ఆపరేషన్స్, యుద్ధం, అల్లర్లు, మతాల గొడవలు గట్రా అనేకానేకాంశాలతో కథ అల్లారు… దాంతో సంక్లిష్టంగా మారిపోయింది కథ…
అదయినా సరైన గ్రిప్పింగ్ కథనంతో ఆకట్టుకునేలా సాగుతుందా అంటే అదీ లేదు… పర్లేదు, కథనం బాగా లేదని కాదు… కానీ థియేరట్లకు జనాన్ని రప్పించే స్థాయిలో లేదు… మరీ ఇప్పుడు థియేటర్లకు రావడానికి జనం గడగడా వణికిపోతున్న దుర్దినాల్లో ఈ క్వాలిటీ సరిపోదు… రష్మిక మంథన దర్శకుడు చెప్పిన కథ విని, హబ్బ, భలే పాత్ర అనుకుని, ఈ సైడ్ హీరోయినో కాదో కూడా తెలియని ఈ పాత్రకు అంగీకరించింది… నటన కూడా పర్లేదు… కానీ ఆ పాత్రకు మరీ అంత గొప్పగా చెప్పుకునేంత సీన్ ఏమీ లేదు… సుమంత్ గురించయితే చెప్పుకునే పనిలేదు… తన కెరీర్ ఇక ఆగిపోయినట్టే…
నిజానికి కథను ఇంకాస్త సరళంగా రాసుకుని ఉంటే బాగుండేది… ఓ లేఖ తాలూకు ఓనర్ల వెతుకులాట, వారికోసం అన్వేషణ, లేఖ మిస్టరీ… బేసిక్‌గా స్టోరీ లైన్ బాగుంది… ఎటొచ్చీ దాన్ని ఆసక్తికరంగా ప్రజెంట్ చేయడంలో దర్శకుడు ఒకింత తడబడ్డాడు… ఇంతమంది పేరున్న నటీనటులు ఉండీ వేస్ట్ అయిపోయిన ఫీల్ కలుగుతుంది… నిజానికి తెలుగు సినిమా అంటేనే స్టార్ హీరోల చెత్తా బిల్డప్పులు తప్ప ఇంకేమీ లేదనే ముద్రల నడుమ… ఇలాంటి ప్లెయిన్, ఫెయిర్, డిఫరెంట్ సినిమాలకు ప్రోత్సాహం లభించాలి… కానీ దర్శకుడు దానికి పెద్దగా చాన్సివ్వలేదు…!!
‘‘ఇంట్లో పూజగది ఉందని, గుడికి వెళ్లడం మానేస్తామా..? మాకు థియేటర్ అంటే గుడి… రండి… చూడండి…’’ అన్నాడు ప్రభాస్ ఈ సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్‌లో… సారీ, ప్రభాస్… నీకు థియేటర్ల నిలువు దోపిడీ, సగటు ప్రేక్షకుడి ఆర్థికస్థితి తెలిసినట్టు లేవు… పైగా ఈ సినిమా పూజ గదిలో చూస్తే చాలు…! మరీ గుడి దాకా రానవసరం లేదు…!!
Share this Article