రేపు ఉగాది… పైసలున్న మారాజులు మూడార్లు సినిమాకు పోతారు… మరి మధ్యతరగతి..? ఇంకేముంది..? టీవీలే దిక్కు… దిక్కుమాలిన తెలుగు చానెళ్లే దిక్కు… ఏ వినోదమూ లేకపోతే దిక్కుతోచదు కదా… చానెళ్లు ఏవో పండుగ ప్రత్యేక షోలను ప్రసారం చేస్తాయి కదా… సరిపోదా ఏం..? పెద్ద సినిమాలు తమ రిలీజు డేట్ల నడుమ గ్యాప్ ప్లాన్ చేసుకుని, ఒకరికొకరు పోటీ రాకుండా డబ్బు దండుకుంటారుగా… జనానికి వేరే దిక్కులేకుండా..! సేమ్, టీవీ చానెళ్లు కూడా అంతే…
మనలోమనం పోటీ పడి టీఆర్పీలు దెబ్బతీసుకోవడం దేనికి..? సరిగ్గా పోటీ లేకుండా స్లాట్ షేరింగ్ ప్లాన్ చేసుకుని, అందరమూ టీఆర్పీలు కుమ్మేద్దామని కూడబలుక్కున్నారు… మూడు చానెళ్లు పండుగ పూట మూడు వేళల్లో ఈ ప్రత్యేక షోలను ప్రసారాలు చేస్తాయి… బస్, అందరూ ఖుష్… నిజానికి ప్రతిసారీ ఈ పండుగ స్పెషల్స్ షోలలో జీటీవీ పోటీలో ఉండేది… కానీ ఈసారి కనిపించడం లేదు… నాన్-ఫిక్షన్ కేటగిరీలో, రియాలిటీ విభాగంలో ఇలాంటి షోలు రీచ్‌కు, రేటింగులకు పనికొస్తాయి…
సరే, మాటీవీ విషయానికొద్దాం… ఈసారి పండుగ స్పెషల్ షో పేరు… ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా… ట్రెడిషన్‌కు ట్రెండ్‌కూ నడుమ పోటీ అనేది కాన్సెప్టు… అనసూయ హోస్టు.., చాన్నాళ్ల తరువాత సింగర్ కల్పన కనిపించింది… కొన్నాళ్లుగా పర్సనల్ సమస్యలతో తెర మీదకు రావడం లేదు ఆమె… సహజంగానే మాటీవీ సీరియళ్ల ఆస్థాన ఆర్టిస్టులు, బిగ్ బాస్ కంటెస్టెంట్లతో చానెల్ ఈ షో కథ నడిపించేసింది… ఇది ఉగాది రోజున మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం… స్నానాలూ, పూజలు అయిపోయి, అందరూ ఇక పండుగ భోజనాలకు కూర్చునే వేళ… మంచి టైమింగు…
Ads
విచిత్రంగా ఈసారి జెమిని టీవీ ఈ పండుగ స్పెషల్స్ పోటీలోకి వచ్చింది… అప్పుడప్పుడు చుక్కతెగి రాలిపడ్డట్టు ఏదో ఒక పండుగకు ఇలా ఆశ్చర్యాన్ని నింపుతూ ఓ స్పెషల్ వదులుతుంది అది… దానికేమో రెగ్యులర్ ఆర్టిస్టులు, కమెడియన్లు లేరు… ఏం చేయాలి..? ఈటీవీ, మాటీవీ కమెడియన్లను, ఆర్టిస్టులను పిలిచి, నాగబాబుకు అప్పగించింది… శ్రీముఖిని పిలిచి నువ్వే హోస్టువమ్మా అని చెప్పింది… సహజంగానే పాత నాగబాబు బ్యాచంతా చేరింది… నాగబాబు నేతృత్వం అంటే మరి మెగా భజన డీజే టిల్లు రేంజులో మోగిపోవాలి కదా… ఇదీ అంతే… శ్రీముఖి సహజంగానే నోరు చించుకుంటుంది కదా… ఇక చమ్మక్ చంద్ర చాన్నాళ్లకు కనిపించాడు… ఫుల్లు కిక్కు ఈ షో పేరు… శనివారం సాయంత్రం అయిదు గంటలకు… ఇందులో సోహెల్‌కు సీమంతం అనేది హైలైట్ ఉన్నట్టుంది…
ఈటీవీ విషయానికి వద్దాం… ఇలాంటి పండుగల స్పెషల్ షోలకు అది పెట్టింది… తమ జబర్దస్త్ కమెడియన్ల సాయంతో అలవోకగా రెండుమూడు గంటల షోలను చకచకా లాగించేయగలదు… ఈసారి ‘అంగరంగ వైభవంగా’ అంటూ వస్తోంది… యాంకర్ రష్మి డాన్స్ అదిరిపోయింది… నిజంగా తను మంచి డాన్సర్… షోలో జీవిత, రోజాల స్కిట్ హైలైట్… బండ, బండి అంటూ దెప్పుకున్నారు… (బతుకు జట్కా బండి, రచ్చబండ పేర్లతో ఆ ఇద్దరూ ఫ్యామిలీ పంచాయితీల్ని ఆడరాయుళ్లలాగా నిర్వహిస్తుంటారు కదా…) శ్రీముఖి, ప్రదీప్ ఏ టీవీలోనైనా కనిపించగలరు కదా… ఇందులోనూ ఉన్నారు… సుమ ఆస్థాన కళాకారిణే కదా… ఉంది… ఇప్పటికే నాలుగు ప్రోమోలు వదిలారు… పండుగ రోజు ఉదయం 9 గంటలకు దీని ప్రసారం…
జీ తెలుగు చానెల్ మొన్న హోలీకి ‘రంగరంగ వైభవంగా’ అని ఓ స్పెషల్ షో చేసింది కదా… దమ్మొచ్చినట్టుంది… ఉగాదిని వదిలేసినట్టున్నారు… నిజానికి ఈ చానెల్ కూడా ఏదో ప్లాన్ చేసి, పోటీలోకి వస్తుందిలే అనుకుని 3 గంటల నుంచి 5 గంటల స్లాట్ ఖాళీ ఉంచేశారు… ఈసారి కూడా సీరియల్ నటుల్ని పెట్టి ఎప్పటిలాగే ఏ ప్రదీప్‌నో లేక ఏ శ్రీముఖినో పిలిచి షో చేస్తే పోయేది… వాళ్లకు ఎలాగూ టీవీ భేదాలేమీ ఉండవ్… ఎల్లల్లేవు… చెప్పనేలేదు కదూ… ఈ పండుగ పూట కూడా ఎందులోనూ సుడిగాలి సుధీర్ లేడు… మొన్న హోలీ రోజున మాటీవీ స్పెషల్ షోలో రష్మితో కలిసి సందడి చేశాడు కదా… ఈ ఉగాదికి అదీ ఆవిరైపోయింది…!!
Share this Article