Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మళ్లీ బీజేపీ నెత్తిన టీడీపీ..? అమిత్‌షా అడుగులన్నీ చెప్పే ముచ్చట ఇదేనా..?!

June 13, 2023 by M S R

ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళిని, ఆంధ్రజ్యోతి ఓనర్ రాధాకృష్ణను కేంద్ర హోం మంత్రి, బీజేపీ హైకమాండ్ సారథి అమిత్ షా మహాజన సంపర్క్ కార్యక్రమంలో భాగంగా కలవబోతున్నాడు… పైకి చూస్తే అందులో పెద్ద విశేషం అనిపించదు … కానీ బీజేపీ కేంద్ర ముఖ్యుడు ఎటు కదిలినా, ఏ అడుగు వేసినా దాని వెనుక ఏదో మర్మం ఉంటుంది… అది రాజకీయ సంబంధమే అయి ఉంటుంది…

సరే, రాజమౌళి తండ్రి ఆల్‌రెడీ బీజేపీతోనే ఉన్నాడు, రాజ్యసభ కూడా కొట్టాడు… సో, రాజమౌళిని కలవడంలో పెద్ద రహస్య ప్రణాళికలు ఏమీ ఉండవు… కానీ రాధాకృష్ణను కలవడమే ఒకింత చర్చనీయాంశం… మళ్లీ చదవండి, రామోజీరావును కాదు, అమిత్ షా రాధాకృష్ణను కలుస్తున్నాడు… రాధాకృష్ణను కలిస్తే చంద్రబాబును కలిసినట్టే… ఇందులో దాపరికం ఏమీ లేదు… అంతెందుకు..? మొన్నీమధ్య అమిత్ షా చంద్రబాబుతోనే భేటీ వేశాడు కదా… రైలు ప్రమాదం జరగకుండా ఉంటే మోడీ కూడా కలిసేవాడు కదా… అంటే ఏమిటి అర్థం..? ఏమిటి ప్రయోజనం..? ఇదీ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం…

బీజేపీ మెల్లిమెల్లిగా టీడీపీ వైపు జరుగుతోందా..? మొన్న జగన్ అవినీతి మీద అమిత్ షా విమర్శలు అదే సూచిస్తున్నాయా..? మరయితే అవినాష్ రెడ్డిని ఎందుకు ఇంకా కాపాడుతున్నట్టు..? మళ్లీ అదొక డౌట్… సరే, జగన్‌తో పోరాడాలంటే జగన్ వ్యతిరేక వోటు చీలవద్దని చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా ఆశిస్తున్నారు… అంతేకాదు, జగన్‌కూ బీజేపీకి నడుమ అగాధం క్రియేటయితేనే ఎన్నికల వేళ జగన్ వోటర్లకు ఏమీ పంచకుండా అడ్డుకోవచ్చుననీ, అధికార దుర్వినియోగం చేయకుండా అడ్డుపడవచ్చుననీ భావిస్తున్నారు… రాజకీయంగా సరైన ఆలోచనే…

Ads

cbn

కానీ ఏపీలో బీజేపీ బలం ఏముందని ఈ సయోధ్య కోసం వెంపర్లాట..? ఏపీలో కాంగ్రెస్ జీరో, లెఫ్ట్ ఇంకాస్త తక్కువే… మిగిలింది జనసేన, టీడీపీ… వోట్ల కోసం గాకుండా జగన్‌ను చక్రబంధంలో పెట్టడానికి మాత్రం బీజేపీ కలిసొస్తుందని మాత్రమే టీడీపీ, జనసేన భావిస్తున్నాయా..? కాకపోవచ్చు, ఇంకాస్త విస్తృత ఆలోచనల్లోనే ఉన్నట్టున్నారు… వోటుకునోటు కేసు దెబ్బకు కేసీయార్‌తో రాజీ కుదుర్చుకుని ఏపీకి పారిపోయిన చంద్రబాబు ఇన్నేళ్లూ తెలంగాణ తన రణక్షేత్రాన్ని షట్ డౌన్ చేసిపెట్టాడు…

ఇప్పుడిక బీజేపీని ముందుపెట్టి బీఆర్ఎస్‌తో పోరాడతాడేమో… అది మళ్లీ కేసీయార్‌కు ఓ బలంగా మారుతుంది… తెలంగాణ బీజేపీకి మళ్లీ ఉరి బిగిస్తుంది… అసలే వర్గకలహాలతో తెలంగాణ బీజేపీ సోలిపోతోంది… టీడీపీకి మళ్లీ కొన్ని సీట్లు వస్తే, ఎలాగూ కాంగ్రెస్‌లో రేవంతుడు మనవాడే… బీఆర్ఎస్ సీట్లు తగ్గిపోతే ఓ గేమ్ ప్లే చేయవచ్చునని చంద్రబాబు ఆశ, లెక్క… వ్యతిరేకించలేని స్థితిలో కేసీయార్, జగన్ సరెండర్ అవుతున్నారు తప్ప మళ్లీ జాతీయ స్థాయి చక్రాలకు చంద్రబాబే బెటర్ అనే ఆలోచన బీజేపీలో ఉన్నట్టుంది… (ఇది తప్పో రైటో కాలం చెబుతుంది…)

సో, జగన్ మీద కేసుల్ని అలాగే వేలాడదీసి, అదుపాజ్ఞల్లో ఉంచుకుంటూ, ఇటు చంద్రబాబుతో బాగానే ఉంటూ, రేప్పొద్దున కేంద్రంలో ఏ అవసరమొస్తుందో, ఎవరు కలిసొస్తారో వేచిచూడటం అన్నమాట… అంతేనా..? ఎలాగూ కేసీయార్ కవిత లిక్కర్ కేసు పుణ్యమాని మోడీకి సరెండర్ అయిపోయాడని వినిపిస్తోంది… కేసీయార్‌ను ఎలాగూ కాంగ్రెస్, అనుబంధ విపక్షాలు దగ్గరకు రానివ్వడం లేదు, సో, రేప్పొద్దున అవసరాలను బట్టి జగన్, చంద్రబాబు, కేసీయార్ అనే పావుల్ని తమకు అనుకూలంగా రెడీగా ఉంచుకుంటారన్నమాట.,.

అయితే మోడీ అన్నీ మరిచిపోయాడా..? నల్ల బెలూన్ల స్వాగతాలు, అమిత్ షా కారుపై రాళ్ల దాడులు, మోడీ భార్య ప్రస్తావనతో చిల్లర విమర్శలు, ప్రత్యేక హోదాపై యూటర్న్‌లు, చంద్రబాబు ఓవైపు, కేసీయార్ మరోవైపు కాంగ్రెస్, దాని అనుబంధ విపక్షాలకు గత ఎన్నికల్లో డబ్బు సాయాలు, జాతీయ వేదికల మీద మోడీ టార్గెట్‌గా పలు మెట్లు దిగి మరీ కేసీయార్, చంద్రబాబుల ఘాటు విమర్శలు, యాంటీ మోడీ జాతీయ వేదికల నిర్మాణానికి ప్రయాసలు, ప్రయత్నాలు…. ఇవన్నీ మరిచిపోయాడా మోడీ… బారా ఖూన్ మాఫీ అన్నట్టేనా..? అంతేలే… రాజకీయాలు అంటే అదే కదా మరి…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!
  • నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో… ఇదో వింత కథ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions