హమ్మయ్య, ఇంకా మొదలుపెట్టలేదేమిటా అనుకుంటూనే ఉన్నాను… బొడ్రాయి పండుగను, బతుకమ్మ పండుగను కూడా బీజేపీయే పుట్టించి, అగ్రవర్ణ మనువాద మతవాద వ్యాప్తికి, రాజకీయ లబ్దికి ప్రయత్నిస్తోంది అనే డొల్ల బుర్రల్ని చూస్తున్నాం కదా… కశ్మీరీ ఫైల్స్‌లాగే కాంతార సినిమా కూడా ఇదే మనువాద ఎజెండాలో భాగంగా నిర్మింపజేసిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ అంధవిశ్వాసాల్ని వ్యాప్తి చేస్తోందని ఇంకా రచ్చ మొదలుపెట్టలేదేం అనకండి..? పెట్టేశారు… అటువైపే తీసుకెళ్తున్నారు… కర్ణాటక ఎన్నికల్లో లబ్ది దాకా వెళ్ళిపోయారు అప్పుడే…
గాడ్ ఫాదర్లు, ఘోస్టులు, జిన్నాలు, సన్నాఫ్ ఇండియాల్ని ఇష్టపడి, పల్లెత్తుమాట అనలేని దరిద్రం… ఇద్దరు తెలుగు చరిత్రపురుషుల బతుకుల్ని భ్రష్టుపట్టించిన ఆర్ఆర్ఆర్, ఇతర చెత్తల గురించి కిమ్మనని దరిద్రం… కాంతార అంధవిశ్వాసాల్ని పెంచే కమర్షియల్ సినిమా అట… హబ్బ, ఏం కనిపెట్టారు..? సినిమా అనేదే దందా… కేజీఎఫ్ సీరీస్ తీసి, వందల కోట్లు కుమ్మిన హొంబళె ప్రొడక్షన్స్ వాళ్లకు కాంతార దర్శకుడు చిన్నప్పటి నుంచీ తను కంటున్న ఓ కల గురించి చెప్పాడు, ఓ కథ గురించి చెప్పాడు…
ఏదైనా మాంచి కమర్షియల్ ప్రాజెక్టు చెప్పవోయ్, అడిగినంత బడ్జెట్ ఇస్తాం అన్నారు వాళ్లు… కన్నడనాట కూడా అల్లు అరవింద్‌లు, దిల్‌రాజులు, దగ్గుబాటి సురేష్‌లు ఉంటారు కదా… ఈ సినిమా నా డ్రీమ్, ఇదైపోయాక మీరడిగినట్టు మరో సినిమా తీస్తాను, చాన్స్ ఇవ్వండి అన్నాడు రిషబ్… సర్లే, కిిరిక్ పార్టీ బాగానే తీశాడు కదా, చూద్దాం అనుకున్న హొంబళె ఫిలిమ్స్ 15 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకుంది, సేఫ్, రిస్క్ లెస్… ఆదివాసీల ఓ ఆదిమ విశ్వాసం, అందులో నుంచి పుట్టిన ఓ నర్తనార్చన రీతి తదితరాల్ని చిన్నప్పటి నుంచీ చూసిన రిషబ్ దానికే ఆనందపడ్డాడు… షూటింగ్ మొదలుపెట్టాడు…
Ads
హొంబళె ఫిలిమ్స్ కాదంటే క్రౌడ్ ఫండింగ్‌తో తీయడానికి కూడా రెడీ అయ్యాడు… గతంలో అలా నిర్మాత అయ్యాడు కూడా… తమ ప్రాంతానికే చెందిన జానపద విశ్వాసం, ఆధ్యాత్మికం, ఆర్ట్, సంస్కృతి, జాతరను బయటి ప్రపంచానికి బలంగా చెప్పాలనేదే లక్ష్యం… ఆదివాసీలు తిరగబడితే నమ్మిన ఆ దైవమే అండగా కదిలి వస్తుందనేది తన బేసిక్ లైన్… దానిచుట్టూ కథ రాసుకుంటూ పోయాడు… సినిమాటోగ్రఫీలో, సంగీతంలో, దర్శకత్వంలో తమ ప్రతిభతో ప్రయోగాల్ని మండించారు, తపించారు…
250 నుంచి 300 కోట్ల దాకా బిజినెస్ జరగబోతోందని తాజా అంచనా… తాజాగా మలయాళం, తమిళంలోనూ రిలీజ్ చేశారు… తెలుగు, హిందీల్లో ఆల్‌రెడీ కుమ్మేస్తోంది… కన్నడం సరేసరి… అబ్బే, ఏముందోయ్ ఇందులో ఆ క్లైమాక్స్ తప్ప మిగతాదంతా ఉత్త సోది అంటాడొకడు… ఇదే ప్రశ్నను ఓ విలేఖరి రిషబ్ ముందు పెట్టాడు… ఆ సోది అలా ఉంటేనే క్లైమాక్స్ అంత బలంగా పేలుతుంది, తెలియక కాదు, ఆలోచన లేక కాదు స్క్రీన్ ప్లే రాసుకుంది… ప్రతి దానికీ ఓ లెక్క ఉంటుంది, అలాగే హీరో ఆ పాత నర్తన ఆరాధనపద్దతికి దూరదూరంగా పారిపోతుంటాడు… వాడిని డెస్టినీ పట్టుకుని, తీసుకొచ్చి, కర్తవ్య నిర్వహణ చేయించడమే స్టోరీ అసలు లైన్… అన్నాడు నవ్వుతూ…
ఆంధవిశ్వాసాన్ని ప్రేరేపించే తిరోగామివి నువ్వు అనేది మరో ప్రశ్న… “మీరు కేవలం ఓ ఆధ్యాత్మిక అంశాన్ని, పాతకాలం నాటి ఓ విశ్వాసాన్ని చూస్తున్నారు… నేను దాని చుట్టూ అల్లుకున్న అరుదైన ఆర్ట్ ఫామ్స్ చూస్తున్నాను… ఐనా నేను ఆస్తికుడిని… అది నా ఇష్టం… అని బదులిచ్చాడు రిషబ్… ఇవన్నీ సరే, ఇంతగా తపించావు కదా, మరి దేవుడు ఏదేని మరపురాని వరమో, అనుభూతినో ప్రసాదించాడా..?
‘‘15 కోట్ల బడ్జెట్ అయిపోతోంది… మరో 10 కోట్లు ఇవ్వలేని నిర్మాతలు కారు, కానీ అడగను… అడిగితే నా ప్లానింగ్ వైఫల్యం అన్నట్టే కదా మరి… చివరి షెడ్యూల్… ఆ అయిదు రాత్రిళ్లు కేవలం కొబ్బరి నీళ్లతోనే నా ఆకలిదప్పులు… అంతకుముందు యాక్షన్ సీన్లతో గాయాలు, ఒళ్లు పులిసిపోయింది… నేనే దర్శకుడిని, నేనే కథకుడిని, నేనే హీరోను… శక్తి మొత్తం హరించుకుపోయింది… సమయానికి రాజ్ వచ్చాడు… కీలకమైన చివరి భాగాల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు… నేను ఒకే టైంలో తండ్రి పాత్రను, వర్తమానంలోని కొడుకు పాత్రను పోషించాలి… రెండు వేర్వేరు కాలాల్లోని పాత్రలు… ప్రసవించే తల్లికి తెలుస్తుంది ఎముకలు విరిగే నొప్పి ఏమిటో… షూటింగ్ అంతా అయిపోయాక… ఓ మంచి స్పిరిట్యువల్ ఎక్స్‌పీరియన్స్, నేను ఊహించనిది నిజంగానే దక్కింది’… ఏమిటది..? ‘చెప్పను, అది నాలోనే ఉండిపోతుంది, ఆ సినిమాకు నాకు విలువైన పారితోషికం ముట్టింది…’
Share this Article