బ్రహ్మాస్త్ర… దేశం మొత్తమ్మీద ఈ సినిమాపై జోరుగా చర్చ సాగుతోంది… ఒకవేళ ఈ సినిమా గనుక బ్లాక్ బస్టర్ అయితే బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంటుంది… గ్రహపాటున తన్నేస్తే మాత్రం బాలీవుడ్ ఇప్పట్లో కోలుకోదు అని అర్థం… నాలుగేళ్లుగా నిర్మాణం, భారీ తారాగణం, వేల సంఖ్యలో గ్రాఫిక్ షాట్స్… దాదాపు 400 కోట్ల బడ్జెట్… పాన్ ఇండియా మూవీ… వెరీ రిస్కీ ప్రాజెక్టు… మిగతా దేశం సంగతేమిటో గానీ… సౌతిండియాలో ఈ సినిమాను సమర్పిస్తున్న రాజమౌళికి మాత్రం పల్స్ రేటు విపరీతంగా పెరిగిపోతోంది… సినిమాకు శకునాలు కూడా బాగాలేవు…
రాజమౌళి దర్శకుడు… ఆయన కుటుంబం మొత్తం ఓ ప్యాకేజీగా రెమ్యునరేషన్ తీసుకుంటారు… తన సినిమాలకు సంబంధించి వ్యాపారంలో తను వేలుపెట్టడం కొత్తేమీ కాదు… కానీ ఇప్పుడు బ్రహ్మాస్త్ర సినిమాతో పక్కా వ్యాపారిగా మారిపోయాడు… నిజానికి ఒక సినిమా నాణ్యతను పట్టుకోవడంలో తను దిట్ట… సో, బ్రహ్మాస్త్ర సినిమా బాగానే వచ్చిందనేది ఒక అభిప్రాయం… పాపం శమించుగాక… తనకు చేతులు కాలతాయా..? లేక మరోసారి రివ్వున విజయఢంకా మోగిస్తూ పైకి ఎగురుతాడా చూడాలి…
https://www.youtube.com/watch?v=kDL5mAjVs1Y
Ads
నిజానికి మొన్నమొన్నటివరకూ తన అదృష్టం బాగానే ఉంది… ఆర్ఆర్ఆర్ నాటికి టికెట్ల రేట్లు పెరగడం, బాహుబలితో పోలిస్తే ఈ సినిమా కాస్త తీసికట్టుగానే ఉన్నా సమయానికి వేరే పెద్ద సినిమాలు లేకుండా జాగ్రత్తపడటంతో గట్టెక్కాడు… హిందీ సినిమాలు వరుసగా తన్నేస్తూ, హిందీలోకి డబ్ చేసిన సౌత్ సినిమాలు మాత్రమే బాగా ఆడుతున్న ప్రజెంట్ ట్రెండ్ కూడా ఆర్ఆర్ఆర్‌కు కలిసొచ్చింది బాగా… కానీ బ్రహ్మాస్త్రకు ఆ సానుకూల సూచనలు లేవు…
మొన్న హైదరాబాద్‌లో జూనియర్ ఎన్టీయార్ ముఖ్యఅతిథిగా భారీగా ప్రిరిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేశారు, కోటిన్నర ఖర్చు… తీరా సమయానికి పోలీసులు అనుమతి రద్దు చేశారు… కారణాలు ఏవైనా సరే ఇది అతిపెద్ద అపశకునం… మింగలేక, కక్కలేక అన్నట్టుగా మారింది రాజమౌళి స్థితి… చిన్న ప్రెస్‌మీట్‌తో ముగించారు… బాహుబలి, ఆర్ఆర్ఆర్‌లతో పోలిస్తే అసలు వేరే పబ్లిసిటీ లేదు… హైప్ క్రియేషన్ లేదు… ఏదో చిన్నాచితకా టీవీ షోలలో పాల్గొనడం తప్ప… చివరకు సుమ నిర్వహించే క్యాష్ ప్రోగ్రాంలో రణబీర్, రాజమౌళి, ఆలియాభట్ పాల్గొన్నారు… అదీ సినిమా ప్రమోషన్ దురవస్థ… చిన్న చిన్న తెలుగు సినిమాల ప్రమోషన్ కాస్త బెటర్…
కొన్ని నెలల ట్రెండ్ చూస్తే… హిందీ సినిమాల వసూళ్లు చూస్తే… బ్లాక్ బస్టర్ అయిన ది కాశ్మీరీ ఫైల్స్ వసూళ్లు 340 కోట్లు… అదీ వరల్డ్ వైడ్… మరో హిట్ సినిమా భూల్ భులయ్యా-2 వసూళ్లు 265 కోట్లు… గంగూభాయ్ కథియావాడి వసూళ్లు 211 కోట్లు… సౌత్ నుంచి హిందీకి డబ్ అయిన సినిమాలు మాత్రం కుమ్మేశాయి… కేజీఎఫ్-2 అనూహ్యమైన బ్లాక్ బస్టర్… 1200 కోట్లు… ఆర్ఆర్ఆర్ 1110 కోట్లు… విక్రమ్ కొంత బెటరే… మరి 400 కోట్లు పెట్టిన బ్రహ్మాస్త్ర బ్రేక్ ఈవెన్ అయ్యేది ఎలా..? ఎంత కష్టం..? ఒరిజినల్ ప్లాన్ ప్రకారం ఈ సినిమా మూడు భాగాలు… ఒకవేళ వసూళ్ల కథ రివర్స్ కొడితే సెకండ్, థర్డ్ సంగతి ప్రశ్నార్థకమే…
జాగ్రత్తగా గమనిస్తే మరికొన్ని అంశాలు… హిందీ నుంచి సౌత్ భాషల్లోకి డబ్ అయి, పాన్ ఇండియా ముద్ర వేసుకున్న సినిమాలు పెద్దగా క్లిక్ కాలేదు, కావడం లేదు… హిందీ నుంచి ద్రవిడ భాషలకు అనువదిస్తే అది అత్యంత కృతకంగా ఉంటున్నయ్… పైగా హిందీ సినిమాల్ని, ఆ నటుల్ని తమిళనాడులో బాగా ద్వేషిస్తారు… మలయాళం మార్కెట్ చాలా చిన్నది… బ్రహ్మాస్త్రలో తమిళ, మలయాళ నటులెవ్వరూ లేరు… నాగార్జున ఉన్నాడు గానీ తను తెలుగుకే పరిమితం…
తెలంగాణ మార్కెట్‌లో హిందీ సినిమాలు నడుస్తయ్, కానీ స్ట్రెయిట్ హిందీ సినిమాల్నే చూస్తారు… తెలుగులోకి డబ్ చేస్తే ఇష్టపడరు… ఏపీ, కర్నాటక మార్కెట్లు కూడా అంతంతమాత్రమే… ప్రస్తుతం అడ్వాన్సు బుకింగుల తీరు చూస్తే కర్నాటక, తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో పెద్ద హైప్ కనిపించడం లేదు… ఈ సినిమాలో ఉన్న ఏకైక సౌత్ ఇండియా నటుడు తెలుగు నాగార్జున మాత్రమే… సో, తమిళనాడు, కేరళ, కర్నాటకలు పెద్దగా కనెక్ట్ కావడం లేదు…
ఇక హీరో రణబీర్‌సింగ్… ఆమధ్య రిలీజైన షంషేరా డిజాస్టర్… దర్శకుడు అయాన్ ముఖర్జీ ‘యే జవానీ హై దివానీ’ సినిమా 2013 సరుకు.., అంతకుముందు ఒక్క సినిమా 2009లో వచ్చిన వేకప్ సిద్… మరోవైపు హిందీ సినిమాల తీరు చూస్తేనేమో అక్షయకుమార్ సినిమాలు వరుసగా నాలుగు ఫ్లాప్స్… చివరకు కట్‌పుత్లి అనే తాజా సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయకుండా ఓటీటీకి అమ్ముకుని బయటపడ్డారు… తనవి 13 సినిమాలు ప్లానింగులో ఉన్నాయి, వాటి గతేమిటో… ధాకడ్ వసూళ్లను అందరూ వెక్కిరించారు, కానీ దాన్ని మించి డొబారా డిజాస్టర్… లాల్‌సింగ్‌చద్దా సంగతి చెప్పనక్కర్లేదు…
చిరంజీవి వ్యాఖ్యాతగా ఉంటే..? మొహన్‌బాబు సన్నాఫ్ ఇండియా సంగతి చూశాం కదా… బ్రహ్మాస్త్రకు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చాడు… అమితాబ్ బచ్చన్ బ్రహ్మాస్త్ర సినిమాలో గురు పాత్ర… తను సైరా సినిమాలో కూడా సేమ్… రిజల్ట్ చూశాం… సో, చిన్నచిన్న అంశాలు సహా ఏరకంగా చూసినా శకునాలు మాత్రం బాగాలేవు… 400 కోట్ల బడ్జెట్ అనేది అన్నింట్లోకన్నా అతి పెద్ద రిస్కీ ఫ్యాక్టర్… కానీ ఒక్కటి మాత్రం సత్యం… హిందీ యాక్టర్స్‌ను ద్రవిడ భాషల్లో చూడటానికి దక్షిణాది ప్రజలు ఇష్టపడరు… సౌత్ నుంచి హిందీలోకి డబ్ అయితే అది పాన్ ఇండియా… హిందీ నుంచి సౌత్ భాషల్లోకి వస్తే అవి ఉత్త ‘పాన్’ ఇండియా తరహా… దీన్ని బ్రహ్మాస్త్ర బ్రేక్ చేసి, కొత్త రికార్డులకు తెరతీస్తుందేమో చూడాలిక… ఆశిద్దాం…!!
Share this Article