Bharadwaja Rangavajhala…………. టైటిళ్లలోకి సింహాలొచ్చిన వేళ …
సింహాలకు జూలుండును అన్నాడు శ్రీశ్రీ … కానీ సింహాలకు సినిమాలుండును అని అనాల్సిన పరిస్థితి …
తెలుగు సినిమా టైటిల్స్ లోకి పులులు సింహాలు వచ్చి చేరిన సందర్భం గురించి చిన్న పరిశోధన చేద్దామనిపించింది.
Ads
నిజానికి ఈ టాపిక్కును నాకిచ్చిన వ్యక్తి వేణుగోపాల్.
తెలుగు సినిమా అనే కాదు భారతదేశంలో చాలా భాషల్లో తొలి నాటి చిత్రాలు పౌరాణికాలే.
అలాగే తెలుగులో కూడా తొలి చిత్రాలు అన్నీ పౌరాణికాలే.
భక్త ప్రహ్లాద, సీతాకల్యాణం తదితరాలన్నీ కూడా పౌరాణికాలే.
తెలుగులో తొలి సాంఘిక చిత్రం గృహలక్ష్మి .
1938 మార్చి నెల్లో విడుదలైన ఆ సినిమాతో నాగయ్య తొలిసారి కెమేరా ముందుకు వచ్చారు. రోహిణీ పిక్చర్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాకు హెచ్.ఎమ్ రెడ్డి దర్శకుడు.
ప్రభల సత్యనారాయణ సంగీత దర్శకుడు.
ఈ తొలి సాంఘిక సినిమాలో అన్నీ సోలో పాటలేగానీ ప్రత్యేకంగా డ్యూయట్లు లేవు.
సాంఘిక చిత్రమే అయినా పుష్కలంగా పద్యాలు ఉంటాయి.
కన్నాంబ , నాగయ్యలతో పాటు గౌరీపతి శాస్త్రి కూడా పాత్రధారణతో పాటు పాటలూ పాడారు.
గౌరీపతిశాస్త్రి అంటే … ఆ మధ్య బాగా పాపులర్ అయిన కాటమరాయుడా కదరీ నరసింహుడా పాట తొలిసారి సుమంగళి చిత్రంలో పాడిన నట గాయకుడు.
ఆ చిత్రానికి నాగయ్యగారే సంగీత దర్శకుడు.
సోమరాజు రామానుజరావు రాసిన రంగూన్ రౌడీ నాటకమే ఈ గృహలక్ష్మికి ఆధారం.
రంగూన్ రౌడీ పేరుతో తర్వాత రోజుల్లో కృష్ణంరాజుతో దాసరి ఓ సినిమా తీశారు.
ఈ సినిమా విడుదలైన రోజుల్లో కూడా రామానుజరావుగారి రంగూన్ రౌడీ నాటకాన్ని ఏదో ఒక సమాజం వారు ఆడుతూనే ఉండేవారు.
వేశ్యల వల్లో పడిన మగవారి జీవిత చిత్రణ ఆధారంగా నాటకం సాగుతుంది.
చింతామణి, రక్తకన్నీరు నాటకాలకు దగ్గరగా రంగూన్ రౌడీ నాటకం నడుస్తుందన్నమాట.
ఆ తర్వాత అదే సంవత్సరం అంటే 1938లోనే విడుదలైన మరో సాంఘిక చిత్రం మాలపిల్ల. స్వతంత్ర పోరాట స్ఫూర్తి, దళిత సమస్య నేపధ్యంగా సాగే ఈ చిత్రాన్ని కర్త, కర్మ క్రియ అన్నీ తానే అయి నడిపాడు దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం.
ఆర్ధిక సహకారం మాత్రం సారధీ వారివి.
అనగా చల్లపల్లి జమీందారువి.
ఆ తర్వాత రైతుబిడ్డ, వందేమాతరం ఇలా సాంఘిక చిత్రాల నిర్మాణం నెమ్మదిగా పుంజుకుంది.
అలాగే పద్యాలు కూడా పౌరాణిక చిత్రాలకే పరిమితం కావడం కూడా మొదలయ్యింది.
అడవుల బ్యాక్ డ్రాపులో వచ్చిన తొలి తెలుగు చిత్రంగా వనరాణినే చెప్పుకోవాల్సి ఉంటుంది. జి.వరలక్ష్మి నటించిన వనరాణి సినిమా 1946లో విడుదలయ్యింది.
అత్యం సూర్యం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆదుర్తి సుబ్బారావుగారు రెండు పాటలు రాయడం విశేషం.
డైలాగ్స్ కూడా ఆయనే రాశారట.
ఇక మొదటిసారిగా తెర మీద సింహం టైటిలు కనిపించింది ఎన్టీఆర్ తోనే.
1955 సంవత్సరంలో విడుదలైన ఆ సినిమా పేరు జయసింహ.
యోగానంద్ దర్శకత్వంలో ఎన్ఎటి బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా అద్భుతమైన విజయం సాదించింది.
ఎన్టీఆర్ నిర్మాణ సారధ్యంలో వచ్చిన పిచ్చి పుల్లయ్య, తోడు దొంగలు చిత్రాల పరాజయం తర్వాత వచ్చిన సూపర్ హిట్ సినిమా జయసింహ.
గుమ్మడిగారి మాటల్లో చెప్పాలంటే…
తన బ్యానర్ లో వచ్చిన రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యే సరికి ఇక లాభం లేదని రామారావు కత్తి పట్టుకున్నాడు.
జనం హిట్టు చేసేశారు.
మామూలు హిట్టు కాదు … ఆ ముందు ఫ్లాపైన రెండు సినిమాలకూ రావాల్సిన డబ్బు లాభాలతో సహా వసూలు చేసుకున్న సినిమా జయసింహ అనేవారు.
ఆ తర్వాత వచ్చిన జంతు టైటిల్ సినిమా కూడా అన్నగారిదే.
పేరు టైగర్ రాముడు.
సి.ఎస్.రావు డైరక్ట్ చేసిన ఈ సినిమా 1962 మార్చి నెల్లో విడుదలయ్యింది.
రాజసులోచన కథానాయికగా చేసిన టైగర్ రాముడు ఓ మోస్తరుగానే ఆడింది.
ఆ తర్వాత చాలా కాలానికి 1969లో కొండవీటి సింహం పేరుతో ఓ డబ్బింగు సినిమా వచ్చింది. ఎమ్జీఆర్ జయలలిత నటించిన ఈ చిత్రం తమిళ్ లో అదిమై పెణ్ పేరుతో వచ్చింది.
ఎమ్జీఆర్ సరసన జయలలిత హీరోయిన్ గా చేసిన ఈ కొండవీటి సింహం తెలుగులో పెద్దగా ఆడలేదు. తెలుగులో ఎన్టీఆర్ ఎఎన్నార్ నటించిన పౌరాణిక చిత్రం భూకైలాస్ డైరక్ట్ చేసిన శంకరే ఈ ఎమ్జీఆర్ అదిమై పెణ్ సినిమాను దర్శకత్వం వహించారు.
ఆయనే తర్వాత రోజుల్లో ఎన్టీఆర్ తో శృంగారరాముడు అనే బీభత్సమైన సినిమా తీశారు. మహదేవన్ పాటలు కాస్త పర్వాలేదుగానీ సినిమా చాలా కష్టం.
దీన్ని బట్టి మనకు అర్ధమయ్యే విషయం ఏమిటంటే … మాస్ లో విపరీతమైన ఫాలోయింగు ఉన్న హీరోలకే ఈ క్రూరజంతువుల టైటిల్స్ కలిసొస్తాయన్నమాట.
టైగర్ రాముడు తర్వాత ఎన్టీఆర్ నటించిన అడవీ నేపధ్యంలో వచ్చిన సినిమా అడవి రాముడు.
1977 లో విడుదలైన ఈ సినిమాలో ఎన్టీఆర్ సక్సస్ ఫుల్ గా ఓ సింహంతో పోరాటం చేసి భయపెట్టి పంపించేస్తాడు కూడా.
అడవి రాముడు విడుదలైన తర్వాత సంవత్సరమే అంటే 1978 లో సింహబలుడు, సింహగర్జన అనే రెండు జానపద చిత్రాలు విడుదలయ్యాయి.
వాటిలో సింహగర్జన సినిమా కంపేరిటివ్ గా విజయవంతమైన సినిమాగా చెప్పుకోవాలి.
సింహబలుడుకు హడావిడి ఎక్కువై సినిమాలో విషయం అంతంత మాత్రంగానే ఉండడంతో ఎన్టీఆర్ చిత్రాల స్థాయిలో ఆడలేదు.
1979 లో ఎన్టీఆర్ హీరోగా మరో క్రూరజంతు టైటిల్ సినిమా వచ్చింది.
ఎన్టీఆర్ రజనీకాంత్ కలసి నటించిన ఆ సినిమా పేరు టైగర్.
నవశక్తి బ్యానర్ లో పర్వతనేని గంగాధరరావు నిర్మించారు ఈ చిత్రాన్ని.
81 లో కొండవీటి సింహం, ఆ తర్వాత సంవత్సరమే కమల్ హసన్ నటించిన డబ్బింగు చిత్రం పల్లెటూరి సింహం వచ్చింది.
ఇక పోతే …
ఈ జంతు చిత్రాల్లో కాస్త ప్రత్యేకంగా ప్రస్తావించవలసినది …
బొబ్బిలిపులి గురించి …
ఈ టైటిల్ తో దాసరి సినిమా తీసి సూపరు హిట్టు కొట్టి …
ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రానికి ఒక భూమికను కల్పించానని చెప్పుకున్నారే … ఆ సినిమా గురించి మాత్రమే కాదు …
అసలు బొబ్బిలిపులి అనే పేరు ఎక్కడ నుంచీ వచ్చింది?
బొబ్బిలి యుద్ధం సినిమా చూసే ఉంటారు కదా … అందులో విజయనగరపు రాజు గుండెలపై కూర్చుని తాండ్రపాపారాయుడు పులి వచ్చింది … బొబ్బిలిపులి వచ్చింది అంటాడు.
నిజంగానే ఆ సన్నివేశాల్లో తాండ్రపాపారాయుడుగా ఎస్వీఆర్ పెద్ద పులిలానే ఉంటాడు.
ఈ బొబ్బిలిపులి అనే బిరుదు తాండ్ర పాపారాయుడిదే…
దాన్నే దాసరి తీసుకుని ఇలా ఈ తరహా టైటిళ్లు అచ్చొచ్చిన నందమూరి తారక రాముడికి పెట్టి విజయం సాధించారు.
83 లో అశ్వనీదత్ భారీగా అడవి సింహాలు టైటిల్ తో సినిమా తీశారు.
కృష్ణ , కృష్ణంరాజులు నటించిన ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకుడు.
ఓపెనింగ్స్ బాగానే రాబట్టిందిగానీ రన్ లో సింహాలు నిలబడలేకపోవడం విషాదం.
అదే సంవత్సరం సింహంతో చెలగాటం అనే డబ్బింగు సినిమా వచ్చింది.
ఇక నందమూరి తారక రామారావు , బాలయ్యతో కలసి నటించిన సింహం నవ్వింది కూడా 83లోనే విడుదలయ్యింది.
కృష్ణ , శివాజీ గణేశన్ కలసి నటించిన సినిమాకు బెజవాడ బెబ్బులి అని టైటిల్ పెట్టారు డైరక్టర్ విజయనిర్మల.
చిరంజీవి, కృష్ణంరాజులతో దాసుగారు తీసిన మల్టీ స్టారరుకు పులి బెబ్బులి అని టైటిలు పెట్టారు.
ఒకరు పులి అని రెండోవారు బెబ్బులి అని ఆయన భావం కావచ్చు.
ఇక విక్టరీ మధుసూదనరావుగారు రిటైర్మెంటుకు ముందుగా ఓ సెంటిమెంటల్ కథకి పులిబిడ్డ అని టైటిల్ పెట్టి కృష్ణంరాజు హీరోగా సినిమా తీశారు.
ఆ సినిమా ఓ మోస్తరుగా ఆడింది.
కాశీ విశ్వనాథ అంటూ ఓ హిట్టు పాటుంటుంది ఈ సినిమాలో.
ఆ కథను ప్రభాస్ తో మళ్లీ చేయాలని ఆ మధ్య ఎందుకో రెబలు స్టారుడు వాపోయారు పాపం.
1984 ఆడపులి, సాహస సింహం, పులి జూదం, పల్నాటిపులి, పగబట్టిన పులి. ఇలా లాటాఫ్ జంతు చిత్రాలు వచ్చాయి.
వీటిలో పల్నాటి పులి బాలయ్యది.
తాతినేని ప్రకాశరావుగారి అబ్బాయి తాతినేని ప్రసాదు డైరక్ట్ చేశాడీ సినిమాని … భారీ విజయం సాధించలేదుగానీ పర్లేదనిపించుకుంది.
ఇక 85లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మల్లెమాల తీసిన సినిమా పల్నాటి సింహం విడుదలయ్యింది. మల్లెమాల బ్యానర్లో అది విజయం సాధించిన చిత్రంగా పేరు సాధించింది.
సింహపురి సింహం అని చిరంజీవి కోడి రామకృష్ణ కాంబినేషన్ లో ఓ సిన్మా వచ్చింది.
చిరంజీవి తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన ఆ సిన్మా పెద్దగా ఆడలేదు.
మాదాల తరహాలో వేజెళ్ల సత్యనారాయణ సినిమాల్లో విప్లవ పాత్రలేసిన శివకృష్ణ నటించిన బెబ్బులివేట సినిమా వచ్చింది. వెళ్లింది.
అదే సంవత్సరం చిరంజీవితో యమకింకరుడు తీసిన రాజ్ భరత్ డైరక్షన్ లోనే పులి అనే పేరుతో సినిమా వచ్చింది.
అదీ బాక్సాఫీసు దగ్గర పెద్దగా ప్రభావం చూపించలేదు.
1986లోనే అనుకుంటాను …
కృష్ణగారి పెద్దబ్బాయి … రమేష్ బాబును హీరోగా భానుప్రియను హీరోయిన్ గా పెట్టి దాసరి నారాయణరావు బ్లాక్ టైగర్ సినిమా తీశారు. నిజానికి ఈ కథను నాగార్జునతో చేయాలనుకున్నారు దాసరి.
అనుకోకుండా ఇలా రమేష్ బాబుతో చేయాల్సి వచ్చింది.
1990 లో చిరంజీవి నటించిన తొలి కౌబాయ్ సినిమాకు కొదమసింహం వచ్చింది. మురళీమోహనరావు డైరక్ట్ చేసిన ఈ సినిమాకు నటుడు కైకాల సత్యనారాయణ నిర్మాత.
నిర్మాతకు సంతృప్తిని మిగల్చని సినిమాగానే మిగిలిపోయింది.
ఆ సంవత్సరమే … రజనీకాంత్, శోభనల డబ్బింగు చిత్రం టైగర్ శివ విడుదలయ్యింది.
1991 లో సురేష్, యమున నటించిన ఇంట్లో పిల్లి వీదిలో పులి వచ్చింది. ఈ సినిమా కూడా పెద్దగా ఆడలేదు.
ఖుదాగవా హిందీ సినిమాకి తెలుగులో కొండవీటి సింహం టైటిలు పెట్టేరు.
95 లో సూపరు స్టారు కృష్ణగారు నటించిన భారత సింహం అనే సినిమా వచ్చింది.
అప్పటికే తెలుగు తెర మీద ఆయన ప్రభావం తగ్గిపోయింది.
1997 లో ఉగ్రసింహం పేరుతో ఒక డబ్బింగు చిత్రం విడుదలైంది…
ఫ్లాపుల్లో ఉన్న బాలకృష్ణను మళ్లీ హిట్టు ట్రాకెక్కించిన సినిమా సమరసింహారెడ్డి 1999 లో విడుదలయ్యింది.
ఈ ఊపులోనే నరసింహనాయుడు, సీమ సింహం లాంటి సినిమాలు వచ్చాయి.
ఈ సందర్బంగా…
చిరంజీవి మృగరాజు క్కూడా గుర్తుంచుకోవాలి.
నందమూరి కాంపౌండు నుంచీ వచ్చిన హీరో కనుక జూనియర్ ఎన్టీఆర్ కూ ఈ సింహాల గోల తప్పలేదు. సింహ ఉంది కనుక సింహాద్రి అనే టైటిలు ఖాయం చేసుకున్నారు రాజమౌళిగారు అప్పట్లో.
ఆ తర్వాత బాబాయి సింహ అని నటించారు కదా … నట సింహ అనే బిరుదూ అందుకున్నారు.
నిజానికి మందేసిన మదపుటేనుగునురా క్రష్ ఎవ్విరివన్ అంటాడు కదా … పైసా వసూలులో … అలా కాక …
మందేసిన మద సింహాన్ని రా అంటే సినిమా హిట్టయ్యేదనే వాళ్లూ లేకపోలేదు.
ఇదే ఊపులో జూనియర్ ఎన్టీఆర్ కు యంగ్ టైగర్ బిరుదు సాధించారు. ..
ప్రస్తుతానికి అదీ కథ ..
బాలీవుడ్ లోనూ జంతువుల టైటిల్స్ తో సినిమాలు వచ్చాయి.
అయితే వాటిలో జంతువులే ఉంటాయి.
కానీ ఇక్కడ మనుషులు నటిస్తారు … వాటికి జంతువుల టైటిల్స్ పెడతారు …
అదేంటో …
క్రూర జంతువులంటే ఉన్న భయం చేతనేనేమో వాటి పేర్ల మీద ఒక రకమైన వ్యామోహం మనలో ఉంటుంది.
ఆ పిచ్చలోంచీ వచ్చిన గోలే కావచ్చు కూడా ఇదంతా …
ఇప్పటికే చానా చెప్పాను ఇంక ఈ పూటకి సెలవు …
ఝయ్ పాతాళ భైరవి…
Share this Article