అది అసలే ముంబై… ఫ్యాషన్ ప్రపంచానికి అడ్డా… రకరకాల వార్తలు హఠాత్తుగా ప్రచారంలోకి వస్తుంటాయి… కొన్ని నిజం కావచ్చు, కొన్ని ఫేక్ కావచ్చు… కానీ నిరంతరం ఏదో ఓ వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది… మరి ముంబై కేంద్రంగా సాగే మహారాష్ట్ర రాజకీయాల్లోనూ ఈ ప్రచారాలకు అతీతం ఏమీకాదు… పైగా మాఫియాలు, పొలిటిషియన్లు, బ్యూరోక్రాట్లు, సినీ సెలబ్రిటీలు గట్రా రాసుకుని పూసుకుని తిరిగే అదో ప్రపంచం కదా…
ఇప్పుడు ఓ ప్రచారం… ఏమనీ అంటే..? శరద్ పవార్ మనవరాలు రేవతీ సూలేకూ బాల్ ఠాక్రే మనమడు ఆదిత్య ఠాక్రేకూ నడుమ పెళ్లికి గండిపడినట్టే…! అర్థం కాలేదా..? మరింత వివరంగా… ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ బిడ్డ సుప్రియా సూలే… ఆమె బిడ్డ పేరు రేవతీ సూలే… బాల్ ఠాక్రే కొడుకు ఉద్దవ్ ఠాక్రే, ఆయన కొడుకు ఆదిత్య ఠాక్రే… మొన్నటిదాకా మంత్రి… వీళ్లిద్దరి నడుమ ఏదో బంధం సాగుతోందని అప్పట్లో ఏదో ప్రచారం…
కాదు, కాదు… శివసేనతో బంధాన్ని సుస్థిరం చేసుకునేందుకు శరద్ పవారే రేవతికి ఆదిత్యతో పెళ్లి ప్రతిపాదనల పట్ల ఆసక్తి చూపించాడనీ, ఉద్దవ్ ఠాక్రేతో టాక్స్ కూడా జరిగాయని అంటారు… శివసేన బలం సుస్థిరంగా ఉండాలంటే హిందుత్వ నుంచి, మతరాజకీయాల నుంచి బయటికి వచ్చి, సెక్యులర్ పంథాలో, బీజేపీకి దూరంగా ఎదగాలని పవారే ఠాక్రేకు ఎక్కించాడట… ఇది ఠాక్రే, ఆయన భార్య రష్మిల బుర్రల్లో బలంగా తిష్టవేయడానికి శరద్ పవార్ కోవర్ట్ సంజయ్ రౌత్ ఉండనే ఉన్నాడు…
Ads
.… (ఆదిత్య ఠాక్రేను ముద్దుచేస్తున్న సుప్రియా సూలే)…
అసలు బీజేపీకి, శివసేనకు నడుమ చెడిందే ఈ అదిత్య ఠాక్రే గురించి… తనను ముఖ్యమంత్రిని చేయాలని రష్మి పట్టుబట్టింది… ఎహె, ముప్ఫయ్యేళ్ల పిల్లగాడికి మహారాష్ట్ర కిరీటం పెట్టడం ఏమిటి అంటూ బీజేపీ అడ్డంగా తిరస్కరించింది… తరువాత శరద్ పవారే సంజయ్ రౌత్ ద్వారా రాయబేరాలు, సంప్రదింపులు జరిపి, ఠాక్రేను మెల్లిగా ఎన్సీపీ, కాంగ్రెస్ వైపు లాగి, ప్రభుత్వం ఏర్పడేలా కృతకృత్యుడయ్యాడు…
శరద్ పవార్ చెప్పినట్టే ప్రభుత్వం నడిచేది… మౌనంగా గమనిస్తున్న అమిత్ షా సమయం కోసం వేచాడు… ఎలాగూ షిండే, ఫడ్నవీస్ దోస్తులు… రెండేళ్లుగా టచ్‌లో ఉన్నారు… తన పార్టీకే చెందిన హోం మంత్రి మీద ఆరోపణలు, పారిపోయిన పోలీస్ కమిషనర్, మనీలాండరింగ్‌లో తమ ఎమ్మెల్యే దొరికిపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో శరద్ పవార్‌కు చికాకులు పెరిగాయి… తెర వెనుక షిండే ఏం చేస్తున్నాడో కూడా పసిగట్టలేకపోయాడు… ఫలితంగా బాగా దెబ్బతిన్నాడు…
ఇది తన పొలిటికల్ కెరీర్‌కు ఇక తుది అంకం… అంతేకాదు, ఐటీని ఆల్‌రెడీ ఉసిగొల్పిన బీజేపీ పాల్ ఘర్ సాధువుల హత్యను తిరగదోడబోతోంది… మాజీ హోం మంత్రి, పోలీస్ కమిషనర్ల యవ్వారాన్ని కూడా తవ్వబోతోంది… మహారాష్ట్ర తాజా రాజకీయాల్లో అందరికన్నా ఎక్కువగా బకరా అయ్యింది శరద్ పవారే… ఇక ఏ సెక్యులర్ కూటమీ తలెత్తకుండా బీజేపీ, షిండేవర్గం కలిసి నట్లు బిగించబోతున్నాయి…
మరోవైపు సుశాంత్ రాజ్‌పుత్ కేసులో పునఃదర్యాప్తు స్టార్ట్ చేసి, ఆదిత్యకు ఝలక్ ఇవ్వాలని ప్లాన్… ఆల్‌రెడీ తనపై అనర్హత వేటు వేయడానికి స్కెచ్ రెడీగా ఉంది… ఇక శివసేనను పూర్తిగా షిండేకు ధారాదత్తమయ్యేలా చేయాలనేదీ ప్లానే… ఇదంతా బీజేపీ మహారాష్ట్ర రాజకీయాల్ని తన గుప్పిట్లోకి తెచ్చుకునే కార్యాచరణ… సో, ఈ చికాకుల నడుమ రేవతి, ఆదిత్య పెళ్లి పొసగకపోవచ్చునని తాజా ప్రచారాల సారాంశం…
…(రేవతి సూలె)…
అబ్బే, ఆలు లేదు, చూలు లేదు అన్నట్టుగా… అసలు రేవతికీ ఆదిత్యకూ నడుమ ప్రేమ లేదు, ఆ పెళ్లి ప్రతిపాదనలే లేవు… అంతా ఫేక్ ప్రచారం అని కొట్టిపారేసేవాళ్లు కూడా ఉన్నారు… కానీ రెండు బలమైన రాజకీయ కుటుంబాల నడుమ ఇలాంటి వివాహబంధాలు అసాధారణం ఏమీ కాదు… అంత తీసిపారేసే విషయాలు కూడా కాదు… ఇప్పుడు ఠాక్రే కుటుంబం ఉన్న బలహీన, సంక్షోభ స్థితిలో శరద్ పవార్ రేవతి-ఆదిత్య పెళ్లి మీద పెద్దగా ఇంట్రస్ట్ చూపించకపోవచ్చు అనే ప్రచారంలో హేతువు లేకపోలేదు… అఫ్ కోర్స్, ఆల్రెడీ ప్రతిపాదనలు గనుక ఉండి ఉంటేనే సుమా…!!
Share this Article