అవును, నిజమే… వైఎస్ఆర్ పార్టీ అధికారికంగా రుషికొండ ప్యాలెస్ నిర్మాణాలన్నీ ప్రభుత్వ భవనాలేననీ, వాటిని ఎలా వినియోగించుకోవాలనేది ప్రభుత్వ నిర్ణయమనీ సింపుల్‌గా ఓ వివరణ ఇచ్చింది… గుడ్, అది బాగుంది… సరిపోతుంది…
కానీ పార్టీ నాయకులు, అభిమానులు రకరకాల వివరణలతో ఇష్యూను ఇంకా గందరగోళం చేస్తూ, జగన్‌ను వాళ్లే ఎక్కువ బదనాం చేస్తున్నారు… ఫర్నీచర్, ఇతర ఖర్చెంతో చెబితే చెల్లిస్తాం అని ఓ నాయకుడి ప్రకటన… అది ప్రభుత్వ భవనమే అయినప్పుడు, ప్రభుత్వ అవసరాల కోసమే ఆ వందల కోట్ల ఖర్చు పెట్టినప్పుడు, మళ్లీ ఫర్నీచర్, ఇతర సామగ్రి ఖరీదును ప్రభుత్వానికి చెల్లించడం దేనికి..?
అవి పర్యాటక రిసార్ట్స్ అని గతంలో రోజా చెప్పినట్టు గుర్తు… అడిగితే ముఖ్యమంత్రి నివాసం కోసం ఇస్తామని కూడా చెప్పినట్టుంది… నిజం అదే, సీఎం ఆఫీసు కమ్ రెసిడెన్స్ కోసం కట్టబడిన ఓ ఫలక్‌నుమా ప్యాలెస్… నిజానికి ఈ ప్యాలెస్ కూడా రుషికొండ ప్యాలెస్ ఎదుట దిగదుడుపే… కాకపోతే ఈనాడు రాసినట్టు ఈ ప్యాలెస్ నిర్మాణానికి సంబంధించిన ప్రతి దశలోనూ కీలక ఐఏఎస్ అధికారులు భవిష్యత్తులో ఇది తమ మెడలకు చుట్టుకోకుండా కేబినెట్ అనుమతులు తీసుకుని ప్రొసీడయ్యారు…
Ads
అది సీఎంవో అని కొందరు సోషల్ మీడియా పోస్టులు, ట్వీట్లలో స్పందించారు… ఇదీ ఓ రకంగా సమర్థనీయమే ఐనా, సీఎంవో అయితే అంత అట్టహాసాలు, ఆడంబరాలు, భారీ ఖర్చులతో ఆ బాత్రూమ్‌లు ఏమిటి..? ఓ ప్యాలెస్ లుక్కేమిటి అనే ప్రశ్న వస్తుంది… అబ్బే, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని వంటి విశిష్ట అతిథులు వస్తే ఉంచడానికి ఓ మంచి భవనం లేదు కదా, అందుకని అలా కడుతున్నారని మరో సమర్థన…
మరలాంటప్పుడు మూడేళ్లుగా ఎవరికీ ప్రవేశం లేకుండా… రహస్యంగా రాజకోట కట్టడం దేనికి..? లోటస్ పాండ్, తాడేపల్లి, బెంగుళూరు భవనాలను అనేకరెట్లు మించిన ఆ ప్యాలెస్ నిర్మాణం దేనికి..? సర్కారు గెస్ట్ హౌజులు లేవా అతిథుల కోసం… అవసరమైతే స్టార్ హోటళ్లు లేవా అనే ప్రశ్న టీడీపీ వర్గాల నుంచి ఎదురుదాడి ఆరంభమైంది… నిన్న మొత్తం రెండు పార్టీల నడుమ సోషల్ మీడియా వార్ నడిచింది…
కేసీయార్ ప్రగతిభవన్ కట్టుకోలేదా అని మరో ప్రశ్న… రుషికొండ ప్యాలెస్ ముందు ప్రగతిభవన్ ఎందుకూ కొరగాదు… పైగా ప్రగతిభవన్ ప్రాథమిక నిర్మాత వైఎస్… దాన్ని తన అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా కేసీయార్ భారీగా విస్తరించాడు… ఒకటి నిజం… సీఎం రెసిడెన్స్ కోసం వందల కోట్లతో గల్ఫ్ చమురు రాజుల భవనాల వంటి నిర్మాణాలు అవసరమా అనేది ప్రశ్న…
రుషికొండ ప్యాలెస్ నిర్మాణం ఇల్లీగల్ కాదు, ఆంధ్రజ్యోతి చెప్పినట్టు 4 ఎకరాలని చెప్పి 10 ఎకరాల్లో కట్టారనేదీ నిజం కాకపోవచ్చు, కావచ్చు… కానీ ప్రతిదీ చట్టబద్ధమే… ప్రతి ఖర్చూ ఖజానా నుంచే… అనుమతులు పొందినవే… కానీ వాటి అవసరం ఎవరికి అనేదే ఇక్కడ ప్రశ్న… సీఎం నివాసం కోసం అన్ని బ్లాకుల అత్యంత భారీ నిర్మాణాలు అవసరమా..? తను ఎల్లకాలమూ సీఎంగా ఉండడు కదా… మరెందుకీ పటాటోపం..?
ఇప్పట్లో తను సీఎం పోస్టు నుంచి కదిలేది లేదు, సుదీర్ఘకాలం నేనే సీఎంను అనే భావనా..? జగన్ దగ్గర డబ్బుకు కొదువ లేదు, ఇదే ప్యాలెస్‌ను తనే కట్టుకుని ఉంటే… (లీగల్‌గా అన్ని జాగ్రత్తలు తీసుకుని… అసాధ్యమేమీ కాదు)… జగన్ అభిరుచిని ఎవరూ తప్పుపట్టేవాళ్లు కాదు, తప్పుపట్టేవాళ్లను ఎవరూ ఆపలేరు… అది ప్రైవేటు ప్రాపర్టీ అయి ఉండేది… స్థిరంగా తన ఆస్తిగా ఉండేది… ఇప్పుడేమైంది..?
ఈనాడు, ఆంధ్రజ్యోతి… యాజమాన్యాలు వేరయినా రెండింటి శృతీ ఒక్కటే… రెండింటి భావజాలం, ఆచరణ తీరూ ఒక్కటే… జగన్ వ్యతిరేకత విషయానికొస్తే ఆ రెండు పత్రికల నడుమ (టీవీలు, సొంత వెబ్‌సైట్లు సహా) ఫుల్లు సమన్వయం ఉంటుంది… ఒకే మాట, ఒకే బాట అన్నట్టుగా… ఇప్పుడు కూడా సేమ్…
గుట్టువీడిన రాజకోట రహస్యం పేరిట ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీలో హాఫ్ కుమ్మేసింది… ఆంధ్రజ్యోతి ఆనాడే చెప్పింది అని క్లెయిమ్… దాదాపు 15 ఫోటోలు… లోపల ఓ ఫుల్ పేజీ… ఈనాడు కూడా సేమ్ సేమ్… అదీ ఫస్ట్ పేజీ భారీగా కుమ్మేసి, లోపల తనూ ఓ ఫుల్ పేజీ వేసేసింది… కాకపోతే ఈనాడు కొన్ని డిఫరెంట్ యాంగిల్స్ తీసుకుంది… బాత్‌టబ్, కమోడ్లు, విశాలమైన నడవాలు, సమావేశమందిరం, ఫర్నీచర్, షాండ్లియర్స్, వాటి ఉజ్జాయింపు ఖర్చు ఈ యెల్లో పత్రికల కవరేజీ అంశాలు…
మెయిన్ గేట్లకు ఎదురుగా సీ వ్యూ… దాదాపు 20 కోట్ల ఖర్చుతో గార్డెన్ అట… 12 పడక గదులు, లక్ష పైచిలుకు ప్లింత్ ఏరియా అట… మొత్తం ఖర్చు 500 కోట్లు అని ఆంధ్రజ్యోతి తేల్చేసింది… అది కాగ్‌కన్నా ఫాస్ట్ కదా… జల్సా ప్యాలెస్ అని ముద్రేసింది… హేమిటో… పేదల ప్రతినిధి కట్టుకున్న పెత్తందారీ భవంతి అని ఈనాడు చురక… కానీ ఏమాటకామాట… ప్యాలెస్ నిర్మాణశైలి, ప్లాన్, అభిరుచి మాత్రం అదుర్స్…
సోషల్ మీడియాలో వీళ్లే కాదు, మరో సెక్షన్ ఉంటుంది కదా… అటూఇటూ లైన్ తీసుకోలేని న్యూట్రల్స్… దీన్ని చంద్రబాబు ఏం చేయాలి అనే విషయంలో డిబేట్లు… హైదరాబాద్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ను ఇచ్చినట్టు ప్రైవేటు వారికి అప్పగిస్తే అసలే అప్పుల్లో నిండా మునిగిన ఖజానాకు కాస్త మేలు అని కొందరి సూచన… అవును, చంద్రబాబు కూటమి చేసిన అలవిమాలిన హామీల అమలుకు చాలా డబ్బు కావాలి కూడా..!!
Share this Article