జనవరి … కోవిషీల్డ్ టీకా రెండు డోసుల నడుమ నాలుగు వారాల గ్యాప్ అవసరం, ఉత్పత్తి కంపెనీ సీరం ప్రకటన
ఫిబ్రవరి … రెండు టీకా డోసుల నడుమ నాలుగు నుంచి ఆరు వారాల గ్యాప్ బెటర్ అని ఓ అనామక స్టడీ విడుదల
మార్చి … రెండు టీకా డోసుల నడుమ ఆరు నుంచి ఎనిమిది వారాల గ్యాప్ బెటర్ అని మరో అనామక స్టడీ విడుదల
Ads
మే … రెండు టీకా డోసుల నడుమ 12 నుంచి 16 వారాల గ్యాప్ తప్పనిసరి అంటారేమోనని తాజా డౌటనుమానాలు
జూలై … ఫస్ట్ డోస్ తీసుకుంటే చాలు, అబ్బే, రెండో డోస్ అక్కర్లేదు, తాజా స్టడీ అదే చెబుతోంది తెలుసా అంటారేమో
సెప్టెంబరు …. హేమిటి, ఫస్ట్ డోస్ తీసుకోలేదా ఇంకా..? ఓహ్, నీకు వేక్సినే వేస్ట్, ప్లీజ్, ప్లాస్మా దానం చేయి అంటారేమో
ఇది సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్న ఓ పోస్టు… వేక్సిన్లు లేక ఇలా డోసుల నడుమ గ్యాప్ పెంచేస్తున్నారని మామూలు మనుషులు కూడా చెప్పేస్తున్నారు… అసలు ఇదే కాదు, ఇలాంటి బోలెడు మీమ్స్, పోస్టులు, చెణుకులు, వెక్కిరింతలు, కార్టూన్లు… నవ్వాలో, బాధపడాలో తెలియని దురవస్థ… మరీ వీరభక్తగణం తప్ప దాదాపు నెటిజనం యావత్తూ మోడీ ప్రభుత్వ వేక్సిన్ విధాన వైఫల్యంపై ఆగ్రహంగా ఉంది… అదే సోషల్ మీడియా పోస్టుల్లో కూడా వ్యక్తమవుతోంది… ఈరోజుకూ అది తన వేక్సిన్ విధానాన్ని సమర్థించుకోవడం గానీ, సరిదిద్దుకోవడం గానీ చేయడం లేదు… దీనిపై కూడా పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నయ్…
ఇన్ని రోజులైంది కదా… కోవాగ్జిన్ ఉత్పత్తిని పెంచే ప్రణాళిక లేదు… మన ప్రజల రీసెర్చ్ సంస్థలు డెవలప్ చేయాలట, ఆ టెక్నాలజీ ఇంకెవరికీ ఇవ్వరట, ఒక్క ఆ కంపెనీయే చేతనైనంత ఉత్పత్తి చేసి కోట్లకుకోట్లు దండుకుంటుందట… కోవిషీల్డ్ కోసం శక్తిమంతులు నన్ను బెదిరిస్తున్నారు అంటూ సీరం అదర్ పూనావాలా కాస్తా ఈమధ్య లండన్ వెళ్లిపోయి బ్రిటన్వాలా అయిపోయాడు… దీనిపై సర్కారు వైపు నుంచి మాట్లాడేవాళ్లు లేరు… ఈ రెండు కంపెనీల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి కనీసం మన 50 శాతం జనాభాను వేక్సినేట్ చేయాలంటే ఎన్నేళ్లు పడుతుంది..? మరి వేరే ప్లేయర్లను ఎందుకు రానివ్వలేదు..? కనీసం ఇదయినా ఆలోచించే సోయి లేదా ఢిల్లీకి..? దేశం నలుమూలల నుంచీ మోడీ మీద విపరీతమైన విమర్శలు పెరిగేసరికి ఇప్పుడు కాస్త తగ్గారు… స్పుత్నిక్ వచ్చింది… రేటు 945… ప్లస్ జీఎస్టీ… ఈ అధికరేట్ల దరిద్రం ఎలాగూ తప్పదు… వందల శవాలు, లక్షల కేసుల మధ్య కూడా మందుల మీద పన్నుల వసూలు మాత్రం ఆగదు… ఆహా… ఏమి ధర్మనిరతి..? ఎంతటి ఉదారపాలన..? ప్రజల పట్ల ఎంత ప్రేమ..?
ఈలోపు జాగ్రత్తగా కొన్ని వార్తల్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు… ఇదుగో ఫలానా ఫలానా కంపెనీలు ఇండియాలో వేక్సిన్ ఉత్పత్తి చేయబోతున్నయ్, వచ్చే డిసెంబరుకు 200 కోట్ల టీకాలు రెడీ అంటూ…! అసలు రెండో వేవ్ దాటమెలా దేవుడా అని జనం మొత్తుకుంటుంటే… మూడో వేవ్ వచ్చే ప్రమాదం సెప్టెంబరు, అక్టోబరుల్లోనే ఉందని నిపుణులు హెచ్చరిస్తుంటే… ఇప్పుడు సెకండ్ డోస్‌కే దిక్కులేక జనం ఏడుస్తుంటే… డిసెంబరు సంగతి చెబుతున్నారు ఇప్పుడు… విపత్తు నిర్వహణ అంటేనే ఓ యుద్ధం… దూకుడు, వ్యూహం, ప్రణాళిక అన్నీ కావాలి… ఈ వేక్సిన్ మాత్రమే కాదు… చాలా ఇష్యూలున్నయ్… దాదాపు అన్నింట్లోనూ ఇదే పోకడ… చికిత్స ప్రోటోకాల్ మీద కూడా సరైన దిశ లేదు… విపరీతంగా స్టెరాయిడ్లు ఇస్తుంటే, అది కొత్తగా బ్లాక్ ఫంగస్‌ను మోసుకొస్తోంది… రెమ్డెసివర్ల వాడకం, ప్లాస్మా థెరపీల మీద సరైన పరిశీలన లేదు, సమీక్ష లేదు…
అన్ని రాష్ట్రాలకూ ఓ పెద్దన్నలా, గైడ్‌లా ఉండాల్సిన హస్తినలో అసలు ప్రభుత్వం ఉందా అన్నట్టుగా మారిపోగా… రాష్ట్రాలూ అలాగే తయారయ్యాయి… కరోనా మీద పోరులో చేయాల్సినంత చేయలేని తెలంగాణ ఏపీ నుంచి వచ్చే అంబులెన్సులను ఆపేసి, అమానవీయతతో అసలు సమస్యను పక్కదోవ పట్టించేసింది సక్సెస్ ఫుల్‌గా… అదేమంటే కేంద్రం నుంచి డ్రగ్స్ కేటాయింపుల్ని సాకుగా చూపిస్తున్నారు… అసలు కేంద్రం ఇచ్చే డ్రగ్స్ ఏమిటి..? ఎన్ని ఇస్తున్నారు..? ఏ పద్ధతిలో ఇస్తున్నారు..? ఒక్కసారి ఆ వివరాలు జనానికి చెప్పండి సార్… ఒక్కొక్కరూ ప్రాణాల్ని అరచేతిలో పట్టుకుని, ప్లీజ్ ఒక్క బెడ్ సార్ అంటూ హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతుంటే, మనుషుల ప్రాణాలు పిట్టల్లా కూలిపోతుంటే… ఇన్నాళ్లూ నిద్రపోయి, నిద్రనటించి… ఇప్పుడు తెర మీదకు మళ్లీ ఆంధ్రోళ్ల పంచాయితీని తీసుకొచ్చారు… విజ్ఞత, పరిపక్వత, మానవీయత ఎటో కొట్టుకుపోయాయ్…
కరోనాపై అపర సంజీవని అంటున్న 2డీజీ శాంపిల్ పొట్లాలు రిలీజ్ అయ్యాయి… కానీ రేటు, డోస్ మీద ఇప్పటికీ ఎవరికీ స్పష్టత లేదు… ప్రొడక్షన్ మీద క్లారిటీ లేదు… ఆక్సిజన్ అవసరాన్ని తగ్గిస్తుంది అన్నప్పుడు ఇప్పుడున్న స్థితిలో కచ్చితంగా అది సంజీవనే… మరి మన అవసరాలకు తగినంత ఉత్పత్తి డాక్టర్ రెడ్డీస్ చేయగలదా..? అదీ ఓ కార్పొరేట్ కంపెనీయే… స్పుత్నిక్ టీకా తీసుకొచ్చి, ఏకంగా 1000 రూపాయల ధర పెట్టేసిన ఈ కంపెనీ 2డీజీ ధరను కూడా అదే ఖరారు చేసుకుంటుందా..? భారత్ బయోటెక్ వేక్సిన్ గానీ, ఈ 2డీజీ ఔషధం కానీ… ప్రజాపరిశోధన సంస్థల పుణ్యం… మన పాలసీ ఫెయిల్యూర్ల వల్ల అదంతా సొమ్ము చేసుకునేది డ్రగ్ మాఫియా… మన ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తున్నట్టు..? రాజకీయ కోణం నుంచి కాదు, ఈ దేశ సగటు మనిషి అనే కోణం నుంచి ఆలోచించాల్సిన విషయం కాదా ఇది..!!
రాబోయే రోజుల్లో కాక్ టెయిల్ యాంటీ బాడీస్ రంగంలోకి రాబోతోంది… కొత్త వేక్సిన్లు వస్తయ్… వాటి ధరలు, అనుమతుల మీద కూడా ఎవరికీ ఏమీ తెలుస్తున్నట్టు లేదు… ఒక్కసారిగా కేంద్రం కరోనా రోగిలా నిస్సత్తువగా మారింది… నిష్ఠురంగా ఉన్నా నిజం ఇదే… మోడీయే కాదు, ఆ కుర్చీలో ఎవరున్నా సరే, సొంత ప్రజల ప్రాణాలు పోవాలని ఏమీ కోరుకోరు… ప్రజలు, రాజ్యం బాగుండాలనే కోరుకుంటారు… కానీ చేయాల్సినంత పని క్షేత్రంలో కనిపించకపోవడం, చేసే పనిలో అపసవ్యత ఇప్పుడు అసలు సమస్యలు..,
‘‘మన ఇండియాలోనే నయం, వేరే దేశాల్లో మరణాల రేటెక్కువ’’ అంటూ భక్తగణం కొత్త కౌంటర్లు స్టార్ట్ చేసినా, వాళ్లకూ తెలుసు… కుప్పలుగా పీనుగులు కనిపిస్తున్న రోజుల్లో… కరోనా సోకిన లక్షల కుటుంబాల కన్నీటి వరదలో… ప్రభుత్వాన్ని సమర్థించడం ఆ గణానికే సాధ్యం కావడం లేదు, జనం ఎవరూ నమ్మడానికి సిద్ధంగా లేరు… పైగా ఆ ప్రచారాలు కౌంటర్ ప్రొడక్ట్ అయిపోయి మరింత నెగెటివ్ అవుతున్నయ్… రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు మరింత ఘోరంగా ఉంది… అది వేరే కథ… చివరగా :: ఓ ప్రధానికో, ఓ ముఖ్యమంత్రికో సాంకేతిక పరిజ్ఞానం ఉండాలనేమీ లేదు… కానీ సరైన టీం ఎంపిక చేసుకోకపోతే అది తన వైఫల్యమే… ఆర్థిక, రాజకీయ, సాంకేతిక అంశాల్లో దూరదృష్టితో సూచనలు ఇవ్వగల నిపుణుల మాటల్ని ఆమోదించి, అమలు చేస్తే చాలు… అదే లోపించినట్టుంది…!
Share this Article