కొందరు ఉంటారు… తండ్రి గ్రీన్‌సిగ్నల్ ఎప్పుడిస్తాడా..? ఎప్పుడు వెండితెర మీదకు దూకి, ప్రేక్షకులపై స్వారీ చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు… వాడికేమో నటనలో బేసిక్స్ తెలియవు… సింపుల్, బ్యాక్ గ్రౌండ్ ఉంది, డాడీ దగ్గర డబ్బుంది… తీరా చూస్తే తొలి సినిమాతోనే ఫట్… మళ్లీ కనిపించడు… పెట్టిన డబ్బు హుష్ కాకి… అలా సన్‌స్ట్రోక్ తగిలి, మళ్లీ కోలుకోని తండ్రులు బోలెడు మంది… కానీ ఈ కేరక్టర్ కాస్త డిఫరెంట్…
అక్షయ్ కుమార్ కొడుకు ఆరవ్… ఇంట్లో మొత్తం సినిమా వాతావరణమే… వారసత్వమూ అదే… డాడీ అక్షయ్ ఏటా నాలుగైదు సినిమాలు అలవోకగా తీసేస్తుంటాడు… తల్లి ట్వింకిల్ ఖన్నా ఒకప్పుడు హీరోయిన్… తాత రాజేష్ ఖన్నా బాలీవుడ్ తొలి సూపర్ స్టార్… మామ్మ డింపుల్ కపాడియా ఒకప్పుడు హిందీ తెరను చించేసిన నటి… అంతేనా..? రింకీ ఖన్నా, సింపుల్ కపాడియా ఇంట్లో అందరూ స్టార్లు… కానీ ఆరవ్‌కు మాత్రం అవేమీ ఎక్కలేదు…
కాస్త సినిమాలు చూస్తుండు అని అక్షయ్ చెప్పినా సరే, ఎహెఫో అని దాటేస్తాడు… వీడిని ఎలా వారసుడిని చేయాలిరా బాబో అని అక్షయ్ బాధ… తనకు ఇంకా బోలెడంత స్కోప్ ఉంది బాలీవుడ్‌లో… తను ఇంకా 55 మాత్రమే… ఇప్పటికీ ఏటా నాలుగైదు సినిమాల్ని చేసేయగలడు… ఎనర్జిటిక్ హీరో… కరోనా కాలంలో పెద్ద పెద్ద స్టార్లు స్పందనారాహిత్యంలో బతుకుతుంటే… అక్షయ్ మాత్రమే అత్యంత ఔదార్యం చూపించిన నటుడు… ఒక దశలో ఆస్తులన్నీ హారతికర్పూరం చేస్తావా ఏంటి అని కుటుంబం ఆందోళనపడింది… దటీజ్ అక్షయ్…
Ads
కాకపోతే ఇప్పుడు గ్రహణదశ నడుస్తోంది… బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్విరాజ్, రక్షాబంధన్, రామసేతు… వరుసగా నాలుగు ఫ్లాపులు… కొంతలోకొంత రామసేతు నయం… కట్‌పుత్లి అని స్ట్రెయిట్ ఓటీటీ సినిమా తీస్తే అదీ ఫ్లాప్… కొడుకు ఆరవ్‌కు సినిమాలు ఇంట్రస్టు లేవు, ఫ్యాషన్ డిజైనర్ అవుతానంటాడు… మొన్నామధ్య హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్ జరిగింది… అక్కడ అక్షయ్‌తో ఆసక్తికర సంభాషణలు జరిగాయి… వెరీ ప్రాక్టికల్ హీరో…
‘‘ఎవరైనా బాగా కష్టపడుతుంటే, ఎందుకంత కష్టపడుతున్నావ్ అంటారా..? నన్ను పదే పదే అడుగుతుంటారు… అరె, ఇంత స్మగ్లింగ్ దేనికిరా..? ఇంత జూదం ఎందుకురా..? ఎందుకింతగా తాగుతున్నావ్‌రా..? అన్నట్టుగా ఉంటాయి ఆ ప్రశ్నలు… అవకాశాలు వస్తున్నాయ్, నిర్మాతలకు కావల్సింది ఇస్తాను…
ఎస్, ఏటా నాలుగైదు సినిమాలు చేయగలను ఇప్పటికీ… కానీ ఎవరి అవకాశాల్ని నేను దొంగిలించడం లేదు కదా… నా దగ్గరకు వచ్చిన అవకాశాల్నే ఆనర్ చేస్తున్నాను… ఇవేకాదు, యాడ్స్ కూడా చేస్తాను… ఎవరి నోటి బుక్కనూ నేను ఎత్తుకెళ్లడం లేదు… నో రిగ్రెట్స్… అంతేకాదు ఈ గడ్డు రోజులు దాటడానికి నా పారితోషికం 35- 40 శాతం తగ్గించుకోవడానికి కూడా రెడీ….
విచిత్రంగా మీడియా వాళ్లూ అదే అడుగుతుంటారు… అంత పొద్దున్నే ఎలా లేవగలుగుతున్నారు అనేది ఓ ప్రశ్న… రాత్రి ఎర్లీగా పడుకుంటాను కాబట్టి అని చెబుతాను… మరి రాత్రి ఎర్లీగా ఎందుకు పడుకుంటారు అని అదనపు ప్రశ్న… అరె, ఫూల్, రాత్రిళ్లు అంటేనే పడుకోవడానికి కదా అని చెప్పాలన్నంత కోపమొస్తుంది…
నేనేం తప్పు చేస్తున్నాను, ఏమీ లేదు… సినిమాల జయాపజయాలు కెరీర్‌లో భాగం… ఒక సినిమాకు అవసరాన్ని బట్టి 50 నుంచి 90 రోజులు ఇస్తాను… అంతే, ఇక పెద్దగా ఆలోచించేది ఏమీ లేదు… మా ఆరవ్‌తో అర్జెంటుగా కొన్ని సినిమాల్ని చూపించాలి… ఆ తరువాత ఏమైనా మారతాడో చూడాలి… పదే పదే నా కెనడా పాస్‌పోర్టును పట్టుకుని కెనెడియన్ కుమార్ అని వెక్కిరిస్తున్నారు… ఇండియన్ పౌరసత్వం తీసుకోవాలి… సెలవు…’’
Share this Article