Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిప్పులు చిమ్ముతూ ఎగిరీ ఎగిరీ… నెత్తురు కక్కుతూ నేలరాలుతూ నేడు…

July 2, 2023 by M S R

బెల్లంకొండ ప్రసేన్…   వన్డే ప్రపంచ కప్ కు వెస్టిండీస్ క్వాలిఫై కాలేదన్నది వార్త కాదు.. అదొక విషాదం… అద్సరే గానీ వెస్టీండీస్ లేని క్రికెట్ ప్రపంచ కప్.. నిజమేనా!

వెస్టిండీస్ ను చూస్తే మనసు చివుక్కుమనిపిస్తోంది.. నిజానికి వన్ డే క్రికెట్ వాళ్ళ ఓన్ సొంత కప్ ఆఫ్ టీ కదా… వాళ్లకు ఈ ఆట బాయే హాత్ క ఖేల్ కదా.. అసలు వాళ్ళు ప్రాక్టీస్ ఎలా చేస్తారో తెలుసా.. సముద్రపు ఒడ్డున అలల అంచున నిలబడి బంతిని సముద్రంలోకి కొడతారు… అలలతో బంతి తిరిగొచ్చే వ్యవధిని బట్టి అది వెళ్లిన దూరాన్ని కొలుస్తారు…. టీ ట్వంటి కి కావల్సింది అదేకదా…

అద్సరే గానీ వెస్టీండీస్ లేని క్రికెట్ ప్రపంచ కప్.. నిజమేనా… గార్డన్ గ్రీనిడ్జ్ కవర్ డ్రయివ్ వేగానికి బంతి వెళ్లే దారిలో దానికింది పచ్చిగడ్డి భగ్గున కాలిపోయేది. రాయ్ ఫెడ్రిక్స్ ఫైన్లెగ్ మీంచి చేసే హుక్ సౌందర్యానికి బౌలర్ కూడా ముగ్దుడయేవాడు. వివియన్ రిచర్డ్స్ మాన్లీగా కులుకుతూ

Ads

స్టేడియంలోకి నడుస్తుంటే లెక్కలేనంత మంది నీనాగుప్తాలు, మసాబా గుప్తాలను కలకనేవారు. మాల్కం మార్షల్ బంతి ముక్కుముందునుంచి జోరీగ శబ్దం చేసుకుంటూ మెరుపులా వెళ్లడం మాత్రమే చాలా మంది బ్యాట్స్మెన్ కు తెలుసు. యాండీరాబర్ట్స్ వేగం బంతికీ తూటాకూ తేడా చెరిపేసేదట. ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు..

అద్సరే గానీ వెస్టీండీస్ లేని క్రికెట్ ప్రపంచ కప్.. నిజమేనా… ఈ మధ్య కూడా విండిస్ తక్కువేమీ తినలేదు. లారా కవర్ డ్రైవ్ మహా మహా బౌలర్లకూ సౌందర్యాత్మక హింస. గేల్ కొట్టుడు రాక్షసత్వానికి నకలే. బ్రావో బ్రేవోనే కదా. హోల్డర్ రికార్డ్ హోల్డరే గా. ఆంబ్రోస్ హూపర్ చంద్రపాల్ ఒక్కోడూ ఒక్కో మహా హంతకుడు.

అయినా.. అద్సరే గానీ వెస్టీండీస్ లేని క్రికెట్ ప్రపంచ కప్.. నిజమేనా… ఏమైందా కసి… క్లయివ్ లాయిడ్ చూపులకు శాంతానికి నిలువెత్తురూపంగా ఉంటాడా… అతని లోపలి స్పోర్టివ్ క్రూరత్వం ఎనభైమూడు ఫైనల్ లో ఓడిపోయిన తరవాతగానీ భళ్లున బయటపడలేదు. ఈ క్లయివ్ ఫాదర్ థెరెసా అప్పటికే రెండుసార్లు ప్రపంచ కప్పు గెలిచేసుకుని ఉన్నాడు కనుక ముచ్చటగా మూడోసారి కూడా ప్రుడెన్షియల్ ను ఎత్తేసి రిటైరైపోదామనుకున్నాడు. ఆ ఓటమి అతని లోపలి క్రీడా రాక్షసుడిని నిద్రలేపింది. రిటైర్మెంట్ ఆలోచనను అటకెక్కించాడు. భారత్ టూర్ పెట్టుకున్నాడు. ఆరు టెస్టుల్లో మూడింట్లో ఇండియాను చావచితక్కొట్టాడు.

వన్డేల్లో కూడా అదే హింస. వరల్డ్ కప్ హీరో మొహిందర్ ను దాదాపుగా ఎనిమిది సార్లు సున్నా దాటనివ్వలేదు. వాటిలో మూడో నాలుగో పెయిర్స్ ఆఫ్ స్పెక్టికల్స్. అవమానం సహించలేక భారత క్రికెట్ మతస్థులు గవాస్కర్ మీద రాళ్ల వర్షం కురిపించినపుడు బహుశా లాయిడ్ లోలోపల కసిగా నవ్వుకునే ఉంటాడు. ఒక భారత బాట్స్మన్ అప్పటికి అత్యధిక స్కోరు 236 ఈసిరిస్ లోనే గవాస్కర్ చేసినా అభిమానులు క్షమించలేదు.

కపిల్ ఒక ఇన్నింగ్స్ లో 9 వికెట్లు తీసిన ఫీట్ కూడా సిరీస్ ఘోర ఓటమి కింద కప్పెట్టుకుపోయింది. ఆ విధంగా ప్రతీకారంలో పరాకాష్ట లాయిడ్. ఇంత దుర్మార్గులు కూడా చిన్న కుడుముకే పండగనుకుంటారు. యే గెలుపు తరవాతయినా వాళ్ళు దిల్ ఖోల్కె చేసే వింత వింత అల్లరి తాండవాలు నిజంగా నచ్ బలియే లే కదా.

అద్సరే గానీ వెస్టీండీస్ లేని క్రికెట్ ప్రపంచ కప్.. నిజమేనా? నిప్పులు చిమ్ముతూ నింగికి నువ్వెగిరిపోతే నిభిడాశ్చర్యంతో వీరు… నెత్తురు కక్కుతూ నేలకు నువు రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే … అనేది నిజమే కావచ్చుగానీ నేనైతే విండీస్ నెత్తురు కక్కుతూ నేలరాలడాన్ని నిర్దాక్షిణ్యంగా మాత్రం చూడలేకపోతున్నా.. నమ్మలేకపోతున్నా! సారీ కరేబియన్స్…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఫిక్సింగ్… విజయోత్సవాల్లో ఏదో కుట్రకోణం… 11 మంది ఉసురు తీసిందెవరు..?
  • ఆహా… ఏం తెలివి..? ఆటో-పే సబ్‌స్క్రిప్షన్ తిర‘కాసులు’…!!
  • ఏడీ..? ఏమైపోయాడు నేను ప్రేమించిన ఆ నా మణిరత్నం..?!
  • భారీ డిజాస్టర్ దిశగా థగ్ లైఫ్… హిందీవాడు అడ్డంగా ఛీకొట్టేశాడు…
  • అమెరికా అధ్యక్షుడు… ఆ టేబుల్‌కు ఆ రెండు ఇంపార్టెంట్ బటన్లు…
  • మహేష్ బాబును త్వరగా పంపించేయండి, నిద్రకు ఆగలేడు… కెవ్వు కేక..!!
  • తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం కాక..! అసలు దోషి ఎవరు..?!
  • మిలమిల మెరిసిన తార… వెన్నెల పైటేసిన కిన్నెరసాని…
  • అల్లరి నవ్వుల అల్లు రామలింగయ్య … మనెవ్వరికీ తెలియని ఓ ఫ్లాష్ బ్యాక్ …
  • సో, ప్లీజ్… దయచేసి ఎవరూ ఆ ఇద్దరికి మాత్రం ఈ స్టోరీ చూపించొద్దు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions