కంపరం… ఈ పదం సరిపోకపోవచ్చు, కానీ సమయానికి ఆ పదమొక్కటే గుర్తొస్తోంది… వెంకయ్యనాయుడికి రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వకపోవడం దక్షిణ భారతదేశం అనే వేర్పాటు ఉద్యమాలకు ఊతం, బలం, కారణం అంటూ నిన్న ఒకటీరెండు యెల్లో చానెల్స్ రేపిన చర్చ నిజంగా కంపరం కలిగించింది… తెలుగు జర్నలిజం ఏ పాతాళ స్థాయిలో పొర్లుతున్నదో చెప్పడానికి ఇది ఓ ప్రబల తార్కాణం…
ఆఫ్టరాల్, ఓ నాసిరకం చానెల్ ఏదో డిబేట్ పెడితే, ఎవరో మేధావి ఏదేదో సొల్లితే మొత్తం జర్నలిజం భ్రష్టుపట్టిందని ఎలా అంటారు..? అనవచ్చా..? ఇదే కదా మీ ప్రశ్న..! అసలు రంగు పూసుకోకుండా ఉన్న చానెల్ ఏదో చెప్పండి… కాస్త గ్రేడ్ ఎక్కువ, తక్కువ, అంతేతప్ప అందరూ అంతే కదా… కాకపోతే ఏబీఎన్, టీవీ5 మరీ ఎక్స్‌ట్రీమ్… యాజమాన్యాల పొలిటికల్ లైన్‌ను మించి వేల రెట్లు జీవిస్తారు… అదీ అసలు సమస్య…
ఆఫ్టరాల్ టీవీ డిబేట్లు అని తీసిపారేయడానికి కూడా వీల్లేదు… జనం పత్రికల్ని చదవడం చాలావరకు మానేస్తున్నారు… రాజకీయాలు, ఇతరత్రా వార్తల మీద బాగా ఇంట్రస్టు ఉన్న సెక్షన్ తమకు టైముంటే యూట్యూబ్‌లో లేదా టీవీల్లో వార్తల్ని, చర్చల్ని చూస్తుంది… మొత్తం టీవీక్షకుల్లో వీళ్ల శాతం నెగ్లిజబుల్… కానీ పాత్రికేయం పేరిట ఎంతోకొంత విషాన్ని గాలిలోకి వ్యాప్తి చేస్తూనే ఉన్నాయి కాబట్టే చెప్పుకోవాల్సి వస్తోంది…
Ads
అసలు వెంకయ్యనాయుడికి రాష్ట్రపతిగా చాన్స్ ఇవ్వకపోతే దక్షిణాదికి అసంతృప్తి దేనికి..? ద్రవిడ ఆత్మగౌరవానికి వచ్చిన ముప్పేమిటి..? కర్నాటక ప్రజలే కొన్నేళ్ల క్రితం ‘‘వెంకయ్య సకయ్య’’ పేరిట వెంకయ్యా, మమ్మల్ని వదిలెయ్ అంటూ ఉద్యమించిన తీరు గుర్తు లేదా..? అసలు కేరళ, తమిళనాడులో వెంకయ్య ఎందరికి తెలుసు..? పైగా తను ఒక పార్టీలో నాయకుడు… ఒకరికి చాన్స్ ఇవ్వాలా లేదా అనేది ఆ పార్టీ రకరకాల లెక్కలతో నిర్ణయాలు తీసుకుంటుంది…
పార్టీలో అలాంటి నేతలు చాలామంది ఉంటారు… ఎవరికి ఏ చాన్స్ ఇవ్వాలనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం… ఐనా అంతటి అద్వానీకే నిర్బంధ రిటైర్‌మెంట్ ప్రకటించిన పార్టీ ఇప్పుడది… అలాంటిది వెంకయ్యను పక్కనపెడితే అందులో ఆశ్చర్యంతో, ఆందోళనతో గుండెలు బాదుకునే అసాధారణత్వం ఏముంది..? పైగా తను దక్షిణ భారతదేశానికి ప్రతీకా..? ఎలా..? ఇందులో తెలుగువాడి ప్రయోజనాలకు, గౌరవానికి హఠాత్తుగా వచ్చిపడ్డ లోటేమిటి..?
ఐనా తరతరాలుగా నిర్లక్ష్యానికి వదిలేయబడిన ఆదివాసీల నుంచి, అది ఓ మహిళకు ఈ దేశ అత్యున్నత పదవి వస్తున్నదంటే ఇంత ఏడుపు దేనికి..? ఓర్వలేనితనం దేనికి..? మరీ ఇంత అసహనం, ఈ సూడో దక్షిణ ఉద్యమ ప్రేలాపనలు ఏమిటి..? ఎవరో ఒకరిద్దరు వికట మేధస్కులు కులం కోసమో, పార్టీ కోసమో వీరంగం వేస్తే… ఇక మొత్తం ద్రవిడ జనమంతా కత్తులు, కటార్లు, తుపాకులు పట్టుకుని పోరాడాలా ఇప్పుడు..? పార్టీలు, కులాల రంగుల చొక్కాలు వేసుకోవడం వరకూ సరే… కానీ మొత్తం బట్టలన్నీ విప్పేసి, ఒళ్లంతా అదే రంగు పులుముకుని, బజారులో నిలబడి పోతరాజుల్లా కొరడాతో చెళ్లుచెళ్లున కొట్టుకోవాలా..?!
అప్పట్లో యూటర్న్ తీసుకుని ప్యాకేజీ నుంచి మళ్లీ ప్రత్యేకహోదా అంటూ జనంలోపడిన చంద్రబాబు కూడా అమరావతికి అన్యాయం, జాతీయ సమగ్రతకు ముప్పు అని మాట్లాడేవాడు… అదేదో తను సంకల్పం తీసుకోగానే వెంటనే ఏపీ ప్రత్యేక దేశం అయిపోయినట్టు..! థాంక్ గాడ్… ఇంకా నయం… పవన్ కల్యాణ్‌కు వెంటనే ఉపరాష్ట్రపతి పదవి ప్రకటించాలి, లేకపోతే ప్రత్యేక ద్రవిడదేశ పోరాటం… మోడీ దిగిపోయి కేసీయార్‌ను ప్రధానిగా ప్రకటించాలి, లేకపోతే ప్రత్యేక దక్షిణ భారత్ ఉద్యమం… ఉదయనిధి స్టాలిన్‌ను సర్వసైన్యాధ్యక్షుడిగా ప్రకటించాలి, లేకపోతే ఈలం సాయుధపోరాటం… పన్నీర్ సెల్వాన్ని లోకసభ స్పీకర్‌ను చేసేయాలి, లేకపోతే ఉత్తరాదికి మంటపెడతాం… కన్నడ సిద్ధరామయ్యకు రక్షణ మంత్రిత్వశాఖను బేషరతుగా అప్పగించకపోతే మర్యాద దక్కదు…. హమ్మయ్య… ఇలాంటి డిమాండ్లు వినిపించడం లేదు… వాళ్లకు ఏబీన్ చానెల్ లేదుగా…!! అవునూ… మహారాష్ట్రం దక్షిణమా..? ఉత్తరమా..? ఇంకా ఈ మేధావులు స్పష్టమైన విభజనరేఖలు గీయలేదా..?!
Share this Article