ఈ వార్త చదివేకొద్దీ అసహజంగా తోచింది… ఏదో ఉంది… అదేమిటో అర్థం గాకుండా ఉంది… సాధారణంగా ఈనాడు ఒక సంస్థను గానీ, ఓ కమర్షియల్ ఆర్గనైజేషన్‌ను గానీ ఓ వాణిజ్య ప్రకటన తరహాలో ప్రమోట్ చేస్తున్నట్టుగా వార్తల్ని అనుమతించదు… ఇదేమో దానికి భిన్నంగా ఉంది… డెస్క్ కూడా వార్తలో ధ్వనించే సందేహాలకు నివృత్తి ప్రయత్నం కూడా చేసినట్టు లేదు… ఏదో వార్త వచ్చింది, వేసేశాం అన్నట్టుగా ఉంది… అదీ మెయిన్ పేజీలో…
విషయం ఏమిటంటే..? మంచిర్యాలకు చెందిన ఓ మహిళ… 2013లో పెళ్లయ్యింది… ఏడేళ్లయినా పిల్లల్లేరు… వరంగల్‌లోని ఓ సంతాన సాఫల్య కేంద్రంలో 2020 నుంచీ చికిత్స తీసుకుంటున్నారు… వైద్యులు పరీక్షల కోసం ఆమె అండం, భర్త వీర్యం సేకరించి భద్రపరిచారు… దురదృష్టం కొద్దీ భర్త కరోనాతో 2021లో చనిపోయాడు… ఆమె కూడా వేరే పెళ్లి చేసుకోకుండా అత్తామామలతోనే ఉంటోంది…
మరణించిన భర్త జ్ఞాపకం కావాలని, తల్లిని కావాలని ఆమెకు కోరిక… ఎలాగూ భద్రపరిచిన భర్త వీర్యం ఉంది కదా… అత్తామామలకు చెప్పింది, వాళ్లు సరేనన్నారు… హైకోర్టుకు వెళ్లింది, కోర్టు కూడా భార్య ఇష్టానికి వదిలేసింది… ఎప్పుడో భద్రపరిచిన వీర్యం, అండాలను ఫలదీకరించి ఐవీఎఫ్ పద్దతిలో చికిత్స చేశారు… అది ఫలించి ఆమె మార్చి 22న ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది… ఇదీ వార్త…
Ads
బాగుంది… భర్త మరణం తరువాత కూడా ఆ భర్త జ్ఞాపకంగా సంతానాన్ని కావాలనుకున్న ఆమె కోరిక కొత్తగా ఉంది… ఖచ్చితంగా ఇది మంచి వార్తే… అయితే… వార్తలో ఆ దంపతుల పేర్లు లేవు… దాచిపెట్టాల్సిన పనేమీ లేదు ఇందులో… ఎలాగూ కోడలు తమతోనే ఉంటోంది కాబట్టి తమ కొడుకు వీర్యంతో ఆమె సంతానం పొందుతానంటే అత్తామామలు కూడా ఎందుకు వద్దంటారు..? అందులో వాళ్ల గొప్పతనం ఏమిటో అర్థం కాలేదు… కొడుకు వీర్యంపై వాళ్లకేమీ హక్కు ఉండదు…
భద్రపరిచిన అండం, వీర్యంతో కృత్రిమ గర్భధారణ కొత్తేమీ కాదు… ప్రపంచవ్యాప్తంగా లక్షల కేసులు ఏటా నమోదవుతూనే ఉన్నాయి… వీర్యం, అండం తదుపరి పరీక్షల కోసం ఆ హాస్పిటల్ భద్రపరచడం ఏమిటో కూడా అర్థం కాలేదు… ఒకవేళ భర్త వీర్యాన్ని స్టోరేజీ నుంచి తీసుకున్నా సరే, ఆమె లైవ్ అండాన్ని తీసుకోవచ్చు… సరే, అదెలా ఉన్నా, కేసు హైకోర్టు దాకా వెళ్లింది కదా… ఏ గ్రౌండ్ మీద..? అది కదా అసలు వార్త… ఎందుకు న్యాయపరమైన వివాదం వస్తుందని ఆమె సందేహించింది..? ఆమె హైకోర్టును ఏం కోరింది..? కోర్టు దేనికి క్లారిటీ ఇచ్చింది..?
చాన్నాళ్లుగా దంపతులకు చికిత్స చేస్తున్నారు, కానీ గర్భధారణ జరగలేదుట… భర్త మరణించాక ఇట్టే సక్సెస్ అయ్యింది… బహుశా ఆస్తిసంబంధ వివాదాలో, వ్యవహారాలో ఏమైనా ఉన్నాయా..? మరణించిన భర్త వీర్యంతో సంతానం అనేది అసాధారణమైన కోరిక… అయితే దాని వెనుక ఏవో బలమైన రీజన్స్ ఉంటాయి… అవి లీలామాత్రంగా కూడా రాయలేకపోతే అది సంపూర్ణ వార్తాకథనం కాబోదు… అందుకే మంచి హ్యూమన్ ఇంట్రస్టింగు స్టోరీని ఓ సింగిల్ కాలమ్‌కు పరిమితం చేయడం, అదీ ఇస్తినమ్మ వాయినం తరహాలో రాయడంతో కథనంలో లైఫ్ పోయింది…!!
దీనిపై హిందుస్థాన్ టైమ్స్ స్టోరీ వివరంగా ఉంది… మనకున్న రూల్స్ ప్రకారం ఐవీఎఫ్‌కు భర్త అనుమతి కావాలి… కానీ ఇందులో భర్తే లేడు కదా… అందుకని మొదట ఆ హాస్పిటల్ రిజెక్ట్ చేసింది కేసును… కానీ భార్య హైకోర్టుకు వెళ్లింది… కోర్టు కూడా వేగంగా క్లియర్ చేసింది… గతంలో ఇలాంటి కేసులు ఉండటంతో పెద్దగా సంశయాలు, అభ్యంతరాలు ఏమీ రాలేదు… అలాగే భర్త మరణించాక అండాన్ని, వీర్యాన్ని కలపలేదు… అప్పటికే పిండం ఫలదీకరించబడి ఉంది… కోర్టు క్లారిటీ వచ్చాక ఆమె గర్భంలోకి ప్రవేశపెట్టారు…
ఆంధ్రజ్యోతిలోనూ మెయిన్ పేజీలో ఈ స్టోరీ రన్ చేశారు, అది కాస్త సంశయరహితంగా ఉంది… చిన్నగా పబ్లిష్ చేసినా సరే, క్లారిటీ ఉంది…
Share this Article