ఆ వార్త చూడగానే వైరాగ్యంతో కూడిన ఓ నవ్వు వచ్చేసింది ఆటోమేటిక్‌గా… అదేమిటంటే..? పాపులర్ డాన్సర్ కమ్ హీరోయిన్ శ్రీలీలను శ్రీచైతన్య విద్యాసంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేశారట, ఆ గ్రూపు యాజమాన్యమే ప్రకటించింది… అసలు ఒక సినిమా హీరోయిన్ ఒక విద్యాసంస్థల గ్రూపుకి బ్రాండ్ అంబాసిడర్ కావడం ఏమిటి..? ఈ అంబాసిడర్ ఏం చేయాలి..? ఒక ఫేమస్ సైంటిస్టు, ఓ పాపులర్ కంపెనీ సీఈవో, దిగువ నుంచి బాగా ఎదిగిన ఎవరైనా పారిశ్రామికవేత్త, ఓ పెద్ద డాక్టర్, ఓ ప్రముఖ ఇంజినీర్ లేదా బాగా ఇన్‌స్పిరేషన్ ఐకన్‌గా ఉండే ఇంకెవరైనా బ్యూరోక్రాట్… వీళ్లు అక్కర్లేదా బ్రాండ్ అంబాసిడర్లుగా..!! వాళ్లను కదా విద్యార్థులకు, పేరెంట్స్‌కు ఓ ఆదర్శంగా చూపాల్సింది…
ఏటేటా ఏవేవో అబద్ధాలను కూర్చి 1, 2, 2, 3, 3, 3 అంటూ ర్యాంకుల ప్రచార హోరు నిర్వహిస్తుంటారు కదా… అన్నింట్లో శ్రీలీల బొమ్మ వేస్తారా..? అది బ్రాండ్ ప్రమోషన్ అవుతుందా..? శ్రీలీల ఎండార్స్ చేసినట్టు భావించాలా పేరెంట్స్..? ఆమెను చూసి తమ పిల్లల్ని ఆ కాలేజీల్లో చేర్పించాలా..? అసలు ఒక కాలేజీలో ఏం చూసి పేరెంట్స్ తమ పిల్లల్ని చేర్పించాలి..? పెద్ద ప్రశ్నలే…
సరే, డబ్బు వస్తోంది కాబట్టి ఆమె బ్రాండ్ అంబాసిడర్ అనే పాత్ర పోషించడానికి సిద్ధపడింది… పైసామే పరమాత్మ… పెద్ద పెద్ద స్టార్లే గుట్కాలు, మద్యం సరోగసీ యాడ్స్ చేస్తుంటే పాపం శ్రీలీల ఓ విద్యాసంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటానికి అంగీకరించడం పెద్ద ఆక్షేపణీయం ఏమీ కాకపోవచ్చు… కానీ ఆ విద్యాసంస్థకు ఏం ప్రయోజనమో ఎంత చించుకున్నా అంతుపట్టని సంగతి…
Ads
గతంలో ఓసారి అల్లు అర్జున్ అలియాస్ బన్నీ ఇదే కాలేజీల ర్యాంకుల ప్రకటనలో కనిపించాడు… తన పక్కన ఫస్ట్ ర్యాంకు… దాని మీద కూడా బాగా ట్రోలింగ్ సాగినట్టు గుర్తు… తరువాత బన్నీ అలాంటి ప్రకటనల్లో కనిపించలేదు… ఇప్పుడు హఠాత్తుగా ఈ శ్రీలీల బ్రాండ్ ప్రకటన కనిపించింది… ఎవరైనా మేం బాగా చదువు చెబుతాం, మా హాస్టళ్లలో మంచి వసతులు కల్పిస్తాం అని చెప్పుకుంటారు గానీ ఇలా శ్రీలీల బ్రాండ్ ప్రమోషన్ చూసి చేర్పిస్తారా..? హేమిటో…
ఒకింత నయం… ఆమె డాక్టరీ ఫైనల్ చదువుతోంది… పర్లేదు, కాస్త ఆ కాలేజీల గురించి నాలుగు మంచి మాటలు చెప్పినా బాగానే ఉంటయ్, కాకపోతే శ్రీలీల అనగానే ‘కుర్చీ మడతబెట్టి’ బాపతు సాంగ్స్ గుర్తొస్తాయి కదా, అది మరో మైనస్ పాయింట్…
చాన్నాళ్ల క్రితం ఓ ప్రముఖ దేవస్థానానికి ఎవరో గాయకుడిని బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకున్నారు… అసలు దేవుడికి బ్రాండ్ ప్రమోషన్ అవసరమా..? ఆ కార్యనిర్వహణాధికారిని నేను అదే అడిగితే సరైన సమాధానం రాలేదు, సరికదా మేమిచ్చే పైసలకు ఆ ఫలానా సింగర్ గాకుండా జెన్నిఫర్ లోపెజ్ వస్తుందా అని వెటకారం దట్టించాడు… తరువాత కొన్నాళ్లకు ఆ బ్రాండ్ అంబాసిడరూ మాయం, అక్కడి నుంచి ఆ ఈవో మాయం…
ఒక ప్రొడక్ట్, ఒక జువెలరీ షాప్, ఒక బట్టల షాపు, ఒక సూపర్ మార్కెట్, ఓ ఉత్పత్తుల కంపెనీ లేదా మరొకటి… వీటికి బ్రాండ్ అంబాసిడర్లు అంటే వాళ్ల ఫోటోలతో యాడ్స్ వేసుకుంటారు… కొత్త షాపులకు రిబ్బన్లు కత్తిరింపజేస్తారు,.. మరి ఓ విద్యాసంస్థ బ్రాండ్ అంబాసిడర్ ఏం చేయాలి..? ఏమోలెండి… అవునూ, నారాయణ గారూ, మరి అన్నింట్లోనూ శ్రీచైతన్యతో పోటీపడే మీరు మీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరినైనా వెతుకుతున్నారా సార్..? అనుపమ, రష్మిక, కీర్తిసురేష్ ఎట్సెట్రా..!!
Share this Article