రాబోయే రోజుల్లో… జోస్యాలు చెప్పే స్వాములు, ప్రవచనకర్తలు, పలు డిబేట్లకు వచ్చే గెస్టులు, టీవీ న్యూస్ ప్రజెంటర్లు కూడా డాన్సులు అనబడే పిచ్చి గెంతులు నేర్చుకుంటే తప్ప టీవీ స్టూడియోల్లో అడుగుపెట్టనివ్వరేమో బహుశా…!! జోక్ అనిపిస్తోందా..? అస్సలు జోక్ కాదు… చూస్తూ ఉండండి… ఇప్పుడు ప్రతి టీవీషో ఓ తిక్కగెంతుల ప్రోగ్రామే అయిపోతోంది… డాన్స్, మ్యూజిక్, కామెడీ, ఫుడ్… ఏ ప్రోగ్రామైనా సరే, యాంకర్లకు గెంతులు తప్పవు… ఎంతటి తోపు అయినా సరే, కంటెస్టెంట్లు కూడా గెంతులు వేయాల్సిందే…
వేయడం రాకపోతే రానివ్వరు… సో, నేర్చుకుని మరీ నాలుగు స్టెప్పులు వేయాల్సిందే… అంతెందుకు..? అంతటి సీనియర్ సుమ కూడా స్టెప్పులేస్తోంది… తప్పదు… నిన్నో మొన్నో ఈటీవీ ప్రోమో ఒకటి కనిపించింది… ఫాఫం, రాకెట్ రాఘవ అనే కమెడియన్ ఓ డాన్సర్‌తో (ఆమె కూడా కమెడియన్ కావచ్చు బహుశా) ఓ పాటకు స్టెప్పులేస్తూ తెగ ప్రయాసపడుతున్నాడు… తప్పదు… ఎంతటి సీనియర్ కమెడియన్ అయినా సరే గెంతాల్సిందే… గెంతని వాడికి పుట్టగతులుండవ్ ఇప్పుడు టీవీ షోలలో… బిగ్‌బాస్ వంటి రియాలిటీ షోలకు అర్హత సాధించాలంటే ఈ స్టెప్పులు తెలియక తప్పదు, తెలియకపోతే ఆడిషన్లలోనే అడ్డంగా కొట్టేస్తారు…
సో వాట్..? ప్రమోషన్ల కోసం వచ్చే స్టార్లు, నిర్మాతలు, దర్శకులైనా సరే, టీవీ షోలకు వస్తే గెంతులేయాల్సిందే… రోజా, మనో, ఇంద్రజ, ప్రియమణి వంటి జడ్జిలైనా సరే… డాన్స్ చేయాల్సిందే… ఢీ షోకు ఎఫ్-3 ప్రమోషన్ కోసం వచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి కూడా స్టెప్పులేశాడు… అసలు ఆ ప్రోమో చూస్తే ఆశ్చర్యమేసింది… ఎందుకంటే..?
Ads
ప్రదీప్ అదేదో సినిమాలో హీరో అయినా సరే, తనకు ఈ డాన్సులు అనబడే స్టెప్పులు పెద్దగా రావు, ఆ రిథమ్ తనకు సరిగ్గా కుదరదు… తను మ్యూజిక్, డాన్స్, కామెడీ స్కిట్లకు యాంకరింగ్ చేస్తున్నా సరే, ఇంత సీనియర్ అయినా సరే, స్టెప్పుల జోలికి పోడు సాధారణంగా… ఎప్పుడైనా ఒకటీరెండు స్టెప్పులు వేయడం తప్ప…! కానీ ఎంతతోపు అయితేనేం తప్పదు కదా… ఓ పాటకు స్టెప్పులేశాడు… కష్టపడ్డాడు… చెమటలు కక్కాడు… మరి తనకూ డాన్స్ వచ్చును అని ప్రూవ్ చేసుకోవాలి కదా… పైగా గతంలో తను డాన్స్ పోటీల్లో పాల్గొన్నవాడే…
ఈటీవీ పాడుతా తీయగా కార్యక్రమానికి ఇంకా ఈ వైరస్ అంటుకోనట్టుంది… ఏమో, మారక తప్పదేమో… ఏళ్లుగా శృతులు, నోట్లు, సంగతులు, స్వరాలు సాధన చేస్తున్న గాయకులైనా సరే… నాలుగు స్టెప్పులు అర్జెంటుగా నేర్చుకోకపోతే ఇక పోటీల్లోకి రానివ్వరేమో… ఆ దుర్దినాలు కూడా రానున్నాయేమో… ఇది న్యూస్ చానెళ్లకు కూడా బలంగా పాకి… నిలబడి న్యూస్ ప్రజెంట్ చేసే యాంకరిణి స్టెప్పులేస్తున్న సీన్లు… డిబేట్‌కు వచ్చే వక్తలు స్టెప్పులతో వచ్చి కుర్చీల్లో కూర్చునే సీన్లు ఒక్కసారి ఊహించుకొండి… ఏమో… స్టెప్పులండీ స్టెప్పులు…!!
Share this Article