సాధారణంగా ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే ప్రభుత్వ నిర్ణయాలను ప్రతిపక్షాలు కూడా వ్యతిరేకించవు… ఎందుకంటే వాళ్లతో కంటు కావడం ఇష్టం లేక… వాళ్లతో పెట్టుకుంటే నష్టం అనే భావన బలంగా ఉంటుంది గనుక..! నిజానికి కేసీయార్ పైకి ఎన్ని చెప్పినా తను కూడా అంతే కదా… 30 శాతం ఫిట్మెంట్, పదవీ విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంపు నిర్ణయాలపై అనేకచోట్ల ఉద్యోగసంఘాలు కేసీయార్ చిత్రపటాలకు పాలాభిషేకాలు కొనసాగిస్తున్నాయి… కానీ నిజానికి పీఆర్సీ మీద వేసిన కమిటీ ఏం సిఫారసు చేసింది..? ప్రభుత్వం ఎటువైపు అడుగులు వేస్తోంది..? అనే చర్చ మాత్రం జరగడం లేదు… ప్రతి విషయంలోనూ అవసరమున్నా లేకపోయినా గీపెట్టే ప్రతిపక్షాలు ఈ విషయంలో మాత్రం సైలెంట్… కానీ జనంలో మాత్రం ఒక చర్చ జరుగుతోంది… ఒకవైపు కరోనా దెబ్బకు ప్రైవేటు ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారు… వేల మంది బజారున పడ్డారు… చిన్న చిన్న వ్యాపారాలు దెబ్బతిన్నాయి… స్థూలంగా ఆర్థిక వాతావరణమే కకావికలం అయిపోయింది…
రాష్ట్ర ఆదాయంలో 40 శాతం పాత అప్పుల బకాయిలు, మిత్తీలు కడుతున్నారు… జీతాలకూ సర్దుబాటు కష్టమై అప్పులు తెస్తున్నారు… 3 లక్షల కోట్లకు అప్పులు చేరుకున్నయ్… కార్పొరేషన్ల పేరిట అప్పులు మరో లక్ష కోట్లు… ఈ స్థితిలో ఉద్యోగుల పట్ల ఇంత ఔదార్యం చూపించి ఖజానాపై పది వేల కోట్ల దాకా భారం మోపడం ఏమిటి అనే చర్చ ఒకవైపు సాగుతుండగా…….. ఏటేటా పెరిగే జీవనవ్యయానికి తగినట్టు తమ జీతాలు పెరగడం సహజం… అది మా హక్కు, ఎవరైనా మామీద పడి ఎందుకు ఏడవాలి అనేది ఉద్యోగవర్గాల సమర్థన… కానీ సమాజంలో మిగతా సెక్షన్స్ మాటేమిటి..? నాయకులు, ఉద్యోగులు బాగుంటే చాలా..? అనేది మరోవైపు వాదన… అంతేకాదు, అసలు 57 ఏళ్లకు వృద్ధాప్య పెన్షన్ ఇస్తామంటూ 61 ఏళ్లకు ఉద్యోగ పరిమితి పెంచడం ఏమిటనే సెటైర్లు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నయ్… 61 ఏళ్లకు వయోపరిమితి పెంచడం మీద సోషల్ మీడియా బాగా వ్యతిరేకంగా స్పందిస్తోంది… మరి నిరుద్యోగుల మాటేమిటి..? అనే ప్రశ్న బలంగా వినిపిస్తోంది… సాధారణంగా ఉద్యోగుల పట్ల పెద్దగా నెగెటివ్‌గా స్పందించని సీపీఐ దీనిపై భిన్నమైన స్టాండ్ తీసుకోవడం విశేషమే… కొన్ని ఉద్యోగసంఘాలు కూడా ఈ 61 ఏళ్లపై వ్యతిరేకిస్తుండటం కూడా విశేషమే…
Ads
61 ఏళ్లకు వయోపరిమితి పెంచడం మీద యువతలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందనీ, ఇక యువత కొలువుల కొట్లాటకు రెడీ కావాలని సీపీఐ పిలుపునిస్తోంది… ‘‘నిరుద్యోగ భృతి ఇవ్వదు ఈ సర్కారు, కొలువులనూ ఇవ్వదు, పైగా ప్రస్తుత ఉద్యోగుల పదవీవిరమణ వయసు పెంచడంపై యువతలో తీవ్ర వ్యతిరేకత ఉంది’’ అనేది పార్టీ అంచనా… మిగతా పార్టీలు దీనిపై పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు… సరే, ప్రస్తుతం సమాజంలో ప్రభుత్వ ఉద్యోగి మీద వ్యతిరేక భావన ఉంది… అవినీతి కావచ్చు, పనిలో నిర్లక్ష్యం కావచ్చు, పనిచేసినా చేయకపోయినా ఉద్యోగభద్రత కావచ్చు, ప్రైవేటు ఉద్యోగులతో పోలిస్తే అధిక జీతాలు కావచ్చు, అధికారాలు కావచ్చు… అలాంటిది 61 ఏళ్లకు వయోపరిమితిని పెంచడంలో టీఆర్ఎస్, ప్రభుత్వం వైపు నుంచి జస్టిఫికేషన్ ఏమిటి..? రిటైరయ్యేవాళ్ల స్థానంలో నిరుద్యోగులకు చాన్స్ ఇస్తే తప్పేమిటి..? ఈ ప్రశ్నలకు సమర్థమైన జవాబులు కష్టమే… అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది ఏమిటంటే..? యువత, నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత ఉంటుందని తెలిసీ, కేసీయార్ ఇంత చేసినా సరే… మిగతా సమాజం ఏమైపోయినా పర్లేదు అన్నట్టుగా… ఇప్పటి సర్కారు నిర్ణయాలు కూడా సంతృప్తికరంగా లేవట కొందరికి… ఇప్పటికీ నష్టమేనట… కనీసం ప్రజలు ఏమనుకుంటారు అనే సోయి, మేం కూడా సమాజంలో భాగమే అనే భావన కూడా లేనట్టుంది… ఇదుగో, ఈ వార్త అదే… ఖజానా మొత్తం ఊడ్చి, ఇప్పటికిప్పుడు వాళ్ల జీతాలు రెట్టింపు చేసి ఇచ్చినా సరే, ఇంతేనా అని ప్రభుత్వంపై గుర్రుమంటారేమో వీళ్లు…!!
Share this Article