Sankar G……….. కాలాతీత నిత్యనూతనం ఈ మాయల మంత్ర బజార్… దేశ సినీ చరిత్రలోనే అత్యుత్తమ స్క్రీన్ ప్లే గా కితాబులందుకున్న సమ్మోహన మాయాబజార్… తీసేవారికి సినిమా పట్ల ఇష్టం ఉంటే ఇలాంటి మాయలే వస్తాయి. చూసేవారిని మాయామోహితులను చేస్తాయి. సినిమాలో అభిమన్యుడు మూర్చనుండి తేరుకున్నాడు. మనం మాత్రం మాయమోహంలో చిక్కుకుని ఓలలాడుతున్నాం..
‘మాయాబజార్’ సినిమాకి 65 ఏళ్ళు. ఇంతకన్నా ‘మల్టీస్టారర్’ సినిమా ఎవరైనా తీయగలరా ఇప్పుడు? డబ్బు లేక కాదు – నటీనటులు లేక కాదు – సాంకేతిక పరిజ్ఞానం లేక కాదు. ‘కథ’ లేక. కులం కంపు కొట్టని తెలుగు ‘పెట్టుబడి’ లేక.
కాలపరిస్థులతో సంబంధం లేకుండా అప్పటివాళ్లతో ఇప్పటివాళ్లను పోల్చి, ఏదో ఒకటి తేల్చి పారెయ్యటం నా ఉద్దేశ్యం కాదు. నా విమర్శ ఇప్పటి పరిశ్రమ తీరుతెన్నుల మీద. మన సినిమా పరిశ్రమ పెద్ద దద్దమ్మలు ‘కథ’ లేదని పాపం బాధ కూడా పడుతుంటారు. ‘కథ’ కావాలంటే ‘హీరో’ ను చంపెయ్యటమొక్కటే దారి. ఆ పని చేసే దమ్ములేనప్పుడు నోరుమూసుకుంటే సరిపోతుంది.
‘మాయాబజార్’ సినిమాలో ‘హీరో’ ఎవరంటే N T R అనో A N R అనో ఠక్కున సమాధానం చెప్పేవాడే అసలైన ‘అభిమాన మూర్ఖుడు’. వాడిదంతా తెరమీద కనిపించే తోలుబొమ్మల దృక్పథం. వాటి చేత పలికించి, ఆటలు ఆడించి, పాటలు పాడించిన సృష్టికర్తలు వాడి మెదడులో దాదాపుగా వుండరు.
ఇంకొకరు బాగా చూపిస్తే అదే ‘కనిపించేది’ – కాబట్టి అదే ‘సత్యం’ అని నమ్మే ఆ అజ్ఞానమే ‘కళ్ళ ముందు’ ఎంత అన్యాయం జరుగుతున్నా వాళ్ళని చూడనీయదు. నిజంగా ‘చూసే’ కళ్ళే ఉంటే, ఈ దేశంలో దొంగలు, నర హంతకులు పాలకులు కాలేరు. ఈ మాటలు అంటున్నది కష్టజీవుల గురించి కాదు. కష్టపడి చదివి పైకి వచ్చామని చెప్పుకునే మధ్య తరగతి మట్టి బుర్రల గురించి. సినిమా రంగంలో ‘వ్యక్తి పూజ’ అనేది ఈ సినిమా సాధించిన అఖండ విజయం తోనే మొదలైంది.
ఈ సినిమాకి ముందు జనాలెవ్వరూ N T R ని కృష్ణుడిగా ఒప్పుకోలేదు. పైగా కొన్నిచోట్ల పోస్టర్ల పైన పేడ కూడా కొట్టారు. ‘రంగస్థల విస్మృతి’ దాన్ని అంగీకరించేట్టు చెయ్యలేదు. అందమైన రోగిలా వుండే N T R ని ‘దేవుడిని’ చేసి ప్రపంచం మీదికి వదిలినవాడు కె. వి. రెడ్డి. ఈ సినిమాలో కృష్ణుడి కిరీటాన్ని ఆయన డిజైన్ చేసిన తీరు ఈ దేశ సినిమా చరిత్రలోనే లేనిది. ఈ సినిమా తర్వాతే ‘కమ్మ’ వారికి ఒక ‘దేవుడు’ దొరికాడు.
నిజానికి ‘మాయ బజార్’ అనగానే చాలా విషయాలు గుర్తొస్తాయి. వ్యక్తిగతంగా నాకు నచ్చిన కొన్ని విషయాలు రాస్తాను:
1. పింగళి రచనా వైభవం. రాక్షసులకు ‘సంస్కృత వ్యాకరణ సూత్రాలు’ బోధించి, వాళ్ళను ‘చదువు’ పేరుతో హింసించవచ్చనే ఆలోచన ఆయనకు యెట్లా వచ్చిందో నా ఊహకు అందదు.
‘పాండిత్యం కన్న జ్ఞానం మిన్న’, ‘వీరతాడు’, ‘శాత్తరాలన్నీ సొంత తెలివి లేనోల్లకు, మాక్కాదు’ – ఇట్లాటి సంభాషణలు రాసే వాళ్ళు ఈ మధ్యకాలంలో పుట్టే అవకాశమే లేదు. ( అది పరిశ్రమ వైఫల్యం – సమాజానిది కాదు )
2. ‘లాహిరి లాహిరి లాహిరి లో’, ‘నీ కోసమే నే జీవించునది’ ఈ రెండు అద్భుతమైన melodies. అయితే ఇవి కంపోజ్ చేసింది ఎస్. రాజేశ్వర రావు.
3. 60 ఏళ్లుగా కోట్లాది మంది చేత మండుటెండను పండువెన్నెలగా నమ్మిస్తూనే వున్న మహా మాయగాడు ‘మార్కస్ బార్ట్లే’ .
4. సావిత్రి అందం – అపూర్వమైన అభినయం
5. Center of attraction అయిన ఎస్. వి. రంగా రావు
6. ఘటోత్కచుడి పరిచయ సన్నివేశంలో వచ్చే పద్యంలో ‘హిట్లర్’ కనిపిస్తాడు.
చివరిగా ఒక మాట: సృజనాత్మకత అనేది ఒక చోట ఆగిపోయేది కాదు. అసలు ‘ మహాభారతం’ లో లేకుండా, పాండవులే కనిపించకుండా ‘భారతకథ’ను చెప్పి ఒప్పించి మెప్పించటం మామూలు విషయం కాదు. ‘సృజనాత్మక శక్తి’ కి ‘మాయాబజార్’ ని మించిన ఉదాహరణ ఏముంటుంది?
Share this Article