ఈ కాలపు విశేషాలను, నిజాల్ని, చరిత్రను, కాలాన్ని సూచించే వస్తువుల్ని, ఫోటోల్ని ఓ పెట్టెలో నిక్షిప్తం చేసి, లోతు భూగర్భంలో దాచేసి… ఏళ్ల తరువాత బయటికి తీసేలా జాగ్రత్తలు, ఏర్పాట్లు చేయడం చాలా దేశాల్లో చూసిందే… టైమ్ క్యాప్సూల్స్ అంటాం కదా… తెలుగులో కాలనాళిక… ఆమధ్య 15 ఏళ్ల క్రితం కావచ్చు, టాలీవుడ్ కూడా ఓ కాలనాళికను రూపొందించి, పాతేసినట్టు గుర్తు… ఐనా అందులో ఏముంటాయిలే, మన సినిమాల సోది విశేషాలు తప్ప…
రెండేళ్ల క్రితం అయోధ్య గుడి నిర్మాణం మొదలుపెట్టినప్పుడు… గుడి చరిత్ర, వివాదం, పోరాటం, అంతిమఫలితం వివరాల్ని రాగిరేకుల మీద చెక్కించి ఇలాగే భూగర్భంలో దాచేశారు… భవిష్యత్తులో దాని అవసరం ఉంటుందని భావన… అయితే 1973లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పాతించిన ఓ టైమ్ క్యాప్సూల్ ఏమైందనేది ఇప్పటికీ ఓ మిస్టరీ… ఇదొక ఇంట్రస్టింగు కథ…
అప్పట్లో ఆమె హవా జోరుగా ఉంది… ఎందుకో ఆమెకు ఓ ఆలోచన వచ్చింది… భారత స్వాతంత్ర్యం వచ్చాక మొదటి 25 ఏళ్లపాటు ఎదుర్కున్న సవాళ్లు, సాధించిన విజయాలు, వేసిన అడుగులు, చేసిన ఆలోచనలన్నీ ఓ కాలనాళికలో భద్రపరచాలనేది ఆ ఆలోచన… ఇందిర అనుకున్నాక ఏదీ ఆగదు కదా… కాలపాత్ర అని పేరు పెట్టేసి, ఈ బాధ్యతను ఐసీహెచ్ఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్)కు అప్పగించేసింది… మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలోని హిస్టరీ ప్రొఫెసర్ కృష్ణస్వామి డాక్యుమెంటేషన్ బాధ్యత ఇచ్చారు…
Ads
ఆయనకు ఇందిర మనోగతం తెలుసు… ఐనా మొదటి 25 ఏళ్లు అంటే, తండ్రీబిడ్డల పాలన విజయాలే చరిత్ర కదా… అదే రాశాడు… దాన్ని అప్పటి ఆర్కైవ్స్ కమిషనర్, ప్రముఖ చరిత్రకారుడు భద్రీనాథ్ పరిశీలన, అభిప్రాయం కోసం పంపించాడు… ఆయన మొత్తం చదివి, చాలా నిజాల్ని తప్పులతడకలుగా రికార్డ్ చేశారని మొహమాటం లేకుండా మొహం మీదే చెప్పేశాడు… ఈలోపు ఇతర పార్టీలు నీ గొప్పల్ని భావితరాల కోసం ఇలా ప్రచారం చేసుకుంటున్నావా ఇందిరా అని వెటకరించడం మొదలుపెట్టాయి… అవన్నీ పట్టించుకుంటే ఆమె ఇందిర ఎలా అవుతుంది…?
1973, ఆగస్టు 15న ఎర్రకోట ముందే ఆ కాలపాత్రను భూగర్భంలోకి పంపించేసింది… 1000 సంవత్సరాల తరువాత వాటిని వెలికితీయాలని రాసిపెట్టారు… కానీ ఇది ఇండియా… అవన్నీ కుదరవు… తరువాత వచ్చిన జనతా ప్రభుత్వం బయటికి తీయించింది… అంతకుముందే ఈమేరకు ఆ పార్టీ ప్రజలకు హామీలు చేసి ఉన్నది… ఆ డాక్యుమెంట్లలో నెహ్రూ, ఇందిర సాధించిన గొప్పలు తప్ప ఇంకేమీ లేవని అప్పట్లో కొందరు జర్నలిస్టులు చెప్పుకున్నారట మరి…
ఆ కాలపాత్ర ప్రాజెక్టుకు ఇందిర జస్ట్, 8 వేలు ఖర్చు పెడితే… దాన్ని వెలికితీయడానికి జనతా ప్రభుత్వం 58 వేలు ఖర్చుపెట్టింది… ఇక ఆ తరువాత ఆ కాలపాత్ర ఏమైందో ఈరోజుకూ ఎవరికీ తెలియదు… ధ్వంసం చేశారా, తిరిగి పాతిపెట్టారా, ఎక్కడైనా దాచిపెట్టారా, లేక ఎవరైనా మాయం చేసేశారా..? అసలు అందులో ఏం రాసి పెట్టారు..? అదీ మిస్టరీ…
2012లో మానుషి పత్రిక ఎడిటర్ మధు కిశ్వర్ సమాచార హక్కు చట్టం కింద ప్రధాని కార్యాలయాన్ని అడిగింది… మా దగ్గర ఆ వివరాలేవీ లేవు అని జవాబు వచ్చింది… నేషనల్ ఇన్‌ఫర్మేషన్ కమిషన్ వద్దకు వెళ్లింది… ఐనా నో రిజల్ట్… అన్నట్టు మోడీజీ… మీకేమైనా అవుడియా ఉందా పీఎం సార్…?! జనంలోకి విడుదల చేసి, నెహ్రూ కుటుంబాన్ని బదనాం చేయొచ్చనే ఆలోచన తట్టలేదా..?!
Share this Article