తక్కువ ఖర్చులో సినిమా తీసి, మంచి వసూళ్లు సాధించగలిగేవాడే ఈరోజుల్లో తోపు… వంద కోట్లు, రెండొందల కోట్లు… అవసరమున్నా లేకపోయినా గ్రాఫిక్స్… ఆమేరకు వసూళ్లు వస్తే వోకే, లేకపోతే మునుగుడే… అబ్బే, తక్కువ ఖర్చుతో నాణ్యత రాదు బాసూ అనేవాళ్లుంటారు… చాలా తప్పుడు అభిప్రాయం… కాంతార సంగతేమిటి..? 15 కోట్ల ఖర్చు… 400 కోట్ల వసూళ్లు…
మరో బ్రహ్మాండమైన ఉదాహరణ ఏమిటో తెలుసా..? మలయాళంలో జయజయజయహే అనే సినిమా… కేవలం 5 కోట్ల ఖర్చు… మరీ అంత పేరున్న నటీనటులు కూడా ఏమీ కాదు… 40 కోట్లు వసూలు చేసింది… అదీ సినిమాలో దమ్ము… మే నెలలో షూటింగ్ స్టార్ట్ చేసి, 42 రోజుల్లో పూర్తి చేసి, అక్టోబరులో రిలీజ్ చేశారు… అంటే 6 నెలలు… తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నారు…
ఇదెందుకు చెప్పుకోవడం అంటే… ఆర్ఆర్ఆర్, పొన్నియిన్ సెల్వన్, రాధేశ్యామ్, కేజీఎఫ్-2, బ్రహ్మాస్త్ర… రాబోయే సాలార్, ఆదిపురుష్… వందల కోట్ల బడ్జెట్… 70 శాతం వరకు ఖర్చు గ్రాఫిక్స్, హీరోలు, దర్శకుల రెమ్యునరేషన్లే… ఇదొక పిచ్చి… ప్రస్తుతం ఆ పైత్యమే… ఆ భ్రమలు బద్ధలు కావాలంటే కాంతారలు, జయజయజయహేలు రావాలి… కొన్ని వార్తలు కనిపించాయి… శాకుంతలం సినిమాపై దర్శకుడు గుణశేఖర్ భయంలో పడ్డాడు అని… ఎందుకు అంటే…
Ads
సమంత నటించిన యశోద బిలో యావరేజీగా నిలిచింది… ఏదో శాటిలైట్, డిజిటల్ డబ్బులతో గట్టెక్కింది గానీ లేకపోతే అది నష్టాల ప్రాజెక్టే… సమంత జనాన్ని థియేటర్లకు పెద్దగా రప్పించే సీన్ లేదని అర్థమైంది కాబట్టి గుణశేఖర్ ఇప్పుడు భయపడుతున్నాడు, యశోద ఆఫ్టరాల్ 25 కోట్ల సినిమా, కానీ గుణశేఖర్ తీసిన సినిమా శాకుంతలం ఖర్చు 70 కోట్లు, మరి అంతగా వసూళ్లు వచ్చేనా అనేది గుణశేఖర్ భయానికి కారణం అనేది ఆ వార్తల సారం… కానీ తప్పు…
యశోద సేఫ్ ప్రాజెక్టు… సమంత కాబట్టే దాన్ని అలవోకగా మోసింది… ఓ వుమెన్ సెంట్రిక్ సినిమా ఇప్పటికే 25 కోట్ల వరల్డ్ వైడ్ కలెక్షన్లు సాధించింది… స్టిల్ రన్నింగ్… శాకుంతలం విషయానికి వస్తే… సినిమాను మోయాల్సింది సమంత కాదు, కథ… శకుంతల పాత్రకు సమంత బాగుంటుంది, బాగా చేస్తుంది అనుకుని ఆమెను తీసుకున్నారు తప్ప, ఆమె మాత్రమే జనాన్ని రప్పించగలదు అనే భావనతో కాదు… పైగా ఆ కథ రియల్ పాన్ ఇండియా కథ… సినిమాను కూడా అయిదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు…
పెద్దగా పేరున్న నటీనటులు ఎవరూ లేరు… మరి 70 కోట్లు ఎందుకు ఖర్చు చేసినట్టు..? సమంతకు మాత్రమే కాస్త చెప్పుకోదగిన రెమ్యునరేషన్… మరి అంత భారీ వ్యయం దేనికి..? గుణశేఖర్‌కు గ్రాఫిక్స్ పిచ్చి కూడా లేదు… ఆ కథకు గ్రాఫిక్స్ అవసరమే లేదు… కానీ గుణశేఖర్‌కు సెట్టింగుల పిచ్చి… దానికి ఎక్కువ ఖర్చు… బ్లూమ్యాట్, ఓ మోస్తరు గ్రాఫిక్స్‌తో రాజమౌళి మహిష్మతి నగరాన్నే ఆవిష్కరించాడు… ఇంకా సెట్టింగులు ఏమటయ్యా గుణశేఖరా..? అప్పుడెప్పుడో 2020లో పురుడు పోసుకుని, 2021లో షూటింగ్ స్టార్టయితే… ఈరోజుకూ తెమల్లేదు… వడ్డీలు గట్రా తడిసిమోపెడు… త్రీడీ పేరిట ఇప్పుడు మరికొంతకాలం వాయిదా వేశారు… అంటే, ముందు నుంచీ సరైన ప్లానింగ్ దిక్కులేదని అర్థం…
సో, ఇక్కడ ఇష్యూ ఏమైనా ఉంటే అది గుణశేఖర్ వైపు నుంచే… అంతే తప్ప, సమంత వైపు నుంచి ఏమీ లేదు… ఆమె సినిమాకు అదనపు బలం… తన వైపు నుంచి మ్యాగ్జిమం ఇచ్చేసింది… అంతే… సినిమా నడవాలంటే అది కథ, దర్శకత్వ మెరుపుల వల్లే సాధ్యం… ఎప్పుడో పూర్తయింది… కానీ రిలీజ్ డేట్ ఎప్పుడో ఎవరూ చెప్పలేని దురవస్థ… పైగా దిల్ రాజు వంటి బలమైన శక్తి పంపిణీ చేయబోతోంది, సహనిర్మాత కూడా… నిజానికి గుణశేఖర్ భయపడాల్సింది వేరే ఉంది…
ఇందులో దుర్వాస మహర్షిగా నటిస్తున్నాడు… మోహన్‌బాబు, ఆయన కుటుంబం మీద ప్రస్తుతం నెగెటివిటీ కమ్మేసి ఉంది… మంచు విష్ణు జిన్నా ఫలితం చూశాం కదా… అసలే మోహన్‌బాబు, ఆపై తనలాంటి దుర్వాసుడి పాత్ర… అఫ్‌కోర్స్, గుణశేఖర్ తనను ఏరకంగా వాడుకున్నాడు అనేది చెప్పలేం… నిజానికి శకుంతల కథలో దుర్వాసుడి పార్ట్ చాలా తక్కువ… మోహన్‌బాబు వంటి సీనియర్ నటుడికి అంత స్కోప్ ఏముంటుంది..? కణ్వమహర్షిగా ఎవరు చేస్తున్నారనేది ముఖ్యం… అది కీలకపాత్ర… ఎవరు పోషిస్తున్నారో ఎవరికీ తెలియదు… ఇదీ సినిమా అసలు ముఖచిత్రం… సమంతను ఆడిపోసుకోవాల్సిన అవసరమే లేదు..!
Share this Article