తెలంగాణ సమాజాన్ని స్వరాష్ట్రం ఏర్పాటుకు ముందు భాషా యాసల పేరిట వెక్కిరిస్తూ చిన్న చూపు చూసిన రోజులుండేవి. తెలంగాణా ఉద్యమాన్ని సెంటిమెంట్ పెరిట తక్కువ చేసి చూసిన సందర్భాలూ ఉండేవి. ఉమ్మడి రాష్ట్రంలో ద్వితీయ పౌరులు చూస్తూ ఇక్కడి ఉద్యోగాలు మొదలు అన్ని విధాలా వనరులను యధేచ్చగా దోపిడీ చేయడం తెలుసు. ఇక్కడి మనకు అన్నం తినడం కూడా నేర్పింది మేమే అన్న మాటలు అప్పుడూ ఉన్నవి. ఇప్పుడూ వింటూ ఉన్నది చూస్తూనే ఉన్నాం.
తాజాగా స్వరాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా ఆ ధోరణి మరో రకంగా ముందుకు రావడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ‘బలగం’ సినిమాని విశ్లేషించే సాకుతో కొత్తగా మనవి ‘మూఢ నమ్మకాలు’ అంటూ ఒక వాదన తెస్తున్న వైనం మీరు గమనిస్తూనే ఉన్నారు. నిజానికి మన ప్రజానీకపు ఆచార వ్యవహారాలు, సాంస్కృతిక జీవనంలో వేళ్ళూనుకున్న మానవీయ సంబంధాలను, మనవైన జానపద విశ్వాసాలను, బ్రతుకు నేర్పును అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా మన ఆత్మ గౌరవాన్ని గేలి చేయకుండా ఉండలేరు.
Ads
అందుకే సరికొత్తగా శక్తివంతమైన సినీ మాధ్యమం ద్వారా తెలంగాణా జీవితాల్లోని ఆత్మీయ అనుబంధాలను గొప్పగా తెరకెక్కిన విధానం ప్రపంచంలోకి విస్తృతంగా వెళుతున్న ఈ సమయంలో ఆ విజయం వారిని తిరిగి అహంపై దెబ్బ కొట్టింది. యే సినీ రంగమైతే మొన్నటి దాకా మన వేష బాషలను యాసను గేలి చేసిందో ఆ సినిమా రంగం నేడు తెలంగాణ అస్తిత్వాన్ని ఇముడ్చుకొని సగర్వమైన స్థానంలోకి వెళుతుంటే వీరికి ఊపిరాడటం లేదు. ఏదో ఒక మాట అనకుండా ఉండలేని అనివార్య పరిస్థితి తలెత్తింది.
అందుకే ‘బలగం’ సినిమా సాకుతో తెలంగాణా జన జీవన సాంసృతిక బలగాన్ని ఒక్క మాటతో మూడ నమ్మకాలుగా ఎంచుతూ తిరిగి అదే ఆధిపత్య భావజాలాన్ని నిర్లజ్జగా కొనసాగిస్తున్నారు. కొందరు మూడ నమ్మకాలు అంటారు. మరికొందరు శాస్త్రీయత లేమి అంటారు. ఇంకా కొందరు మనలోని వారే, మొదట్లో ఏదో అసంబద్దత ఉంది గానీ ఎండింగ్ కథ బాగుందని మాట్లాడుతారు. పరాయి వారా మనవారా అని కాదు ఇలా ముందుకు వచ్చే విశ్లేషణలను, విమర్శలను, అభిప్రాయాలను నిజానికి మునుపటి ఆధిపత్యం భావజాలం నించి వచ్చిన మాటలు అనుకోనక్కర్లేదు. అది ముమ్మాటికి ఆత్మ న్యూనతా భావం లేదా మింగుడుపడని తనం అనుకోవాలి.
ఒక కమెడియన్ కావడం వల్ల వేణు వెల్దండి జీవితంలోని నవరసాలను లోతుగా దర్శించగలిగారు. మిగతా దర్శకులకన్నా ముందుండి తనకున్న పరిమితుల్లో గొప్ప సినిమా తీశారు. వర్తమానంలో ఈ సినిమా తెలంగాణా జీవితాన్ని సమున్నతంగా నిలబెట్టింది. ఈ రంగం ఇంకా చాలా దూరం నడవకుండా తక్షణమే మరింత బలమైన విశ్వసనీయమైన సినిమాలు నిర్మించడానికి కొండంత బలాన్ని ఇచ్చింది. అదే సమయంలో తెలంగాణేతరులకు మన జీవన విలువల్లోని సంఘటిత శక్తిని గొప్పగా చాట గలిగింది.
వాస్తవానికి దర్శకుడు సినిమాను కావలసి సందేశభరితం చేయకుండా, ప్రత్యామ్నాయ సంస్కృతి పేరిట జీవితాన్ని అనవసర కల్పన చేయకుండా యధాతధంగా చూపడమే ఈ సినిమా గొప్పతనం. అదే అతడి వివేకం. అది బోధపడని ఓ నలుగురు మాట్లాడే మూఢమైన మాటలను సీరియస్ గా తీసుకోకుండా వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా వారికీ బుద్ది చెప్పాలని అనుకోవడం కన్నా వారిని ఇగ్నోర్ చేయడం మరీ మంచిదని ఈ సందర్భంగా నా సూచన.
పైపైకి ఎగబాకే లక్షణం లేని తెలంగాణ సమాజం స్వాభావికంగా విశ్వ జనీనమైన విలువలకు ఆధారం. తినడం, తాగడం, తీరుబాటు జీవనం గడపడం, పండుగ పబ్బాల్లో నిమగ్న మవడం, తీర్థాలు, జాతరలకు పోవడం, చావు పుట్టుకులను సామూహికంగా ఘనంగా సెలెబ్రేట్ చేసుకోవడం, ఒక కళగా ఊరుమ్మడి జీవనంలో ఇంకా మూలకు పడని జానపద కళలు ఇక్కడి జీవ లక్షణం. సజీవ స్రవంతి. అదే సినిమా ఇతివృత్తం.
అంతా ఒక అపురూపమైన సమ్మేళనం. సగర్వవ ఆవిష్కరణ. అందులోని లోపాలను వెతికే యే ప్రయత్నానికైనా సమాధానం ఇచ్చే సందర్భం కాదిది. ఇక్కడి జీవనంలోని శాస్త్రీయత, విజ్ఞానం, వివేకానికి ఆ విలువలే సమానార్తకాలని వారికి బోధపరచాలని ఆశించడం వృధా ప్రయాస. నిజానికి ఆ ప్రయత్నం ఈ సినిమా ద్వారా బలంగానే జరిగింది కనుకే ఈ ‘మూఢ’ అక్కసు అని భావించాలి.
కాబట్టి ఈ తరుణంలో మనల్ని మనం నిలువెత్తు బతుకమ్మగా పెర్చుకుంటున్న తెలంగాణా సమాజం సర్వ రంగాలలో పోలికలకు అందని, వేరే ప్రమాణాలతో భేరీజు వేసి చూసే అభిప్రాయాలను ఎట్టి పరిస్తితులల్లో లెక్కలోకి తీసుకోరాదు. హాస్యాస్పదమైన వారి ఆలోచనలకు నవ్వుకోవడం తప్ప. అందుకే సామాజిక మాధ్యమాల్లో అనవసరంగా సమాధానం చెప్పడం కన్నా వారిని ఇగ్నోర్ చేయడమే సోకాల్డ్ విమర్శకులను తగిన జవాబు అని భావిస్తునాను. వాస్తవానికి మన బలగం ఒక్కటైనప్పుడు సమాధానం చెప్పడం ఎందుకని ఈ చిన్న ప్రతి స్పందన.
– కందుకూరి రమేష్ బాబు 99480 77893
Share this Article