ఉంటారు… ఎందుకుండరు..? ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి) పేరిట ఏటా ఓ జాతర జరుపుతుంది కదా కేంద్ర ప్రభుత్వం… వివిధ కేటగిరీల కింద ప్రదర్శనలకు, గుర్తింపులకు ఓ జ్యూరీ ఉంటుంది… ఎందుకు లేరు..? తెలుగు నుంచి దర్శకుడు వీఎన్ ఆదిత్య ఉన్నాడు… ప్రేమరాజ్ కూడా ఉన్నాడు… వాళ్లిద్దరూ ఎవరు అని అడక్కండి… సినిమా పర్సనాలిటీలేనట… ఇఫి మీదొట్టు…
వాళ్లేం చేస్తారు..? ఏమీ చేయరు… మనలాగే ఎడ్డిమొహాలు వేసుకుని చూస్తుంటారు… అంతకుమించి చేయనివ్వరు వాళ్లను… చేయాలని చూస్తే, అక్కడ ఉండనివ్వరు… ఇఫి ముద్రించిన ఓ కేటలాగ్… అందులో జీవనతరంగాలు సినిమాను హిందీ చిత్రం అని రాసిపారేశారు… కనీసం దాన్ని కూడా చూడలేకపోయారా ఈ సోకాల్డ్ జ్యూరీ సభ్యులు… ఇటీవల మరణించిన ప్రముఖుల్ని గుర్తుచేసుకునే హోమేజ్ కేటగిరీలో కృష్ణంరాజు, తాతినేని రామారావులను కంబైన్డ్‌గా చూపించేసి, వారిద్దరి స్మృతికి ఉమ్మడి చిహ్నంగా జీవనతరంగా సినిమాను ప్రదర్శిస్తారు…
అసలు ఆ జీవనతరంగాలు సినిమాలో కృష్ణంరాజుది పెద్ద ప్రాధాన్యమున్న రోల్ కాదు, అందులో తను హీరో కూడా కాదు… అది శోభన్ బాబు సినిమా… ఐనా ఇద్దరు వేర్వేరు పర్సనాలిటీలను ఒక్కచోట కలిపేసి, కుట్టేసి, ఇద్దరికీ ‘ఉమ్మడి స్మృతి’ ఏమిట్రా అని ఎవరిని అడగాలి మనం..? ఇండియన్ రీస్టోర్డ్ క్లాసిక్స్ విభాగంలో ‘శంకరాభరణం’ (Sankarabharanam) ఎంపిక చేశారు… ఎస్, శంకరాభరణం మంచి సినిమాయే… కానీ…
Ads
‘శంకరాభరణం’ గురించి రాసీ, రాసీ మీడియాకే కలాలు అరిగిపోయాయి… చిత్రోత్సవాల్లో చూపీ చూపీ ఆ సినిమా రీళ్లే అరిగిపోయాయి… ఎప్పుడో 1980 నాటి సినిమా అది… కళాఖండమే… క్లాసికే… కానీ తెలుగు సినిమా ఇక అక్కడే ఆగిపోయిందా..? తెలుగు సినిమా అనగానే శంకరాభరణం తప్ప మరేమీ లేదా..? ఇఫి నిర్వాకాన్ని తెలుగు సినిమా పట్ల పరాభవం అనుకుందామా..?
శంకరాభరణానికి మళ్లీ మళ్లీ గుర్తింపు అని మనకు మనమే చంకలు గుద్దుకుందామా..? అరుదైన గౌరవం అంటూ హెడ్డింగులు పెట్టుకుని, మాకు కూడా హెడ్లు లేవని చాటుకుందామా..? ఏవేవో సినిమాల దాకా ఎందుకు..? ఈ సినిమా తీసిన పూర్ణోదయా మూవీస్ నుంచే వచ్చిన సాగరసంగమం, స్వాతిముత్యం సినిమాలు బోలెడు చిత్రోత్సవాల్లో ప్రదర్శితమయ్యాయి… నిజానికి శంకరాభరణం ఓ ఛాందసం మాత్రమేననీ, కమల్‌హాసన్ నటించిన సాగరసంగమం, స్వాతిముత్యం సినిమాలది విశేషస్థానం అనే అభిప్రాయాలు కూడా ఉన్నవే…
శంకరాభరణం సినిమా మీద విమర్శలు లేవా..? అందులో ప్రధానమైంది శాస్త్రీయ సంగీతం… ఆ పాటల మీదే చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు అప్పట్లో… అంతెందుకు..? ఆ పాటలు పాడిన బాలసుబ్రహ్మణ్యానికి అసలు శాస్త్రీయ సంగీతంలో శిక్షణ, ప్రవేశం, సాధన లేవన్నారు… అఫ్‌కోర్స్, అలా వెక్కిరించబడిన పాటలే ఈరోజుకూ క్లాసిక్కులుగా ఇంటింటా వినిపిస్తూనే ఉన్నాయి… అది ప్రజాదరణ… పండిత శూలశోధనకు అది అతీతం…
ఇండియన్ పనోరమా విభాగంలో తెలుగు నుంచి కేవలం రెండు చిత్రాల్ని ఎంపిక చేశారు… అందులో ‘అఖండ’ (Akhanda), ‘సినిమా బండి’ (Cinema Bandi)… ఈ సినిమా బండి ఎప్పుడొచ్చిందో, ఎప్పుడు పోయిందో ఎవరికీ తెలియదు… అఖండ ఈ ఉత్సవాల్లో ప్రదర్శనకు ఎలా వచ్చిందో, ఎందుకొచ్చిందో కూడా తెలియదు… రెండూ ఎక్స్‌ట్రీమ్ కంట్రాస్ట్…
అఖండ పాపులర్, కమర్షియల్ ప్రాజెక్టు… బీభత్సం, హింస, రక్తపాతం, అభూతకల్పనలు, మితిమీరిన హీరోయిజం ఎట్సెట్రా ఉంటాయి… చిత్రోత్సవానికి ఇదెలా ఆప్ట్..? అరుదైన పురస్కారం, విశేష గౌరవం, అరుదైన గుర్తింపు అని రాసుకుందాం… అవునూ… నిజంగానే ఓ ప్రశ్న… వీఎన్ ఆదిత్య పేరు ఎక్కడో విన్నట్టు అనిపిస్తోంది గానీ, ఈ ప్రేమరాజ్ ఎవరు..? ఇలాంటి జ్యూరీల పనులు గాకుండా ఇంకా ఏం చేసేవాడు..? ఎవరికైనా తెలిస్తే చెప్పండి ప్లీజ్…!
Share this Article