.
Bhavanarayana Thota …. శ్రీబాగ్ భవనం అలా మిగిలింది!
తొలి తెలుగు దినపత్రిక కాకపోయినా, విజయవంతంగా నడిచిన తొలి తెలుగు పత్రిక ఆంధ్రప్రత్రిక. అమృతాంజనం వ్యాపారంలో వచ్చిన డబ్బుతో ఆంధ్రపత్రిక పెట్టి సేవ చేశారు దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు.
Ads
అంత చేసినా, అమృతాంజనం, ఆంధ్రపత్రిక ద్వయం మీద ఛలోక్తులకు కొదవలేదు. “చదవండి ఆంధ్రపత్రిక – వాడండి అమృతాంజనం” అని కొంతమంది అంటే .. “ఆంధ్రపత్రిక తోడ అమృతాంజనమిచ్చి తలనొప్పి బాపెడు ధన్యుడెవరు?” అంటూ కాశీనాథునివారి మీద ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య లాంటివాళ్ళు పద్యాలే రాసేశారు.
ఇంతకీ ఇప్పుడు అమృతాంజనం, ఆంధ్రపత్రిక గురించి ఎందుకంటే.. ఆ ఆవరణలో ఉన్న శ్రీబాగ్ భవనాన్ని గుర్తు చేయటానికి. పీఆర్ సుందరయ్యర్ అనే తమిళ న్యాయవాది దగ్గర నాగేశ్వరరావు పంతులు ఈ ప్రదేశాన్ని కొనుక్కున్నారు.

అమృతాంజనం భవనం, అక్కడే ఆయన నివాసమైన శ్రీబాగ్ భవనం ఉన్నాయి. 1937 నవంబర్ 16న మద్రాసులో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు నివాసమైన శ్రీబాగ్ లో సమావేశమై, ఒక ఒప్పందానికి వచ్చారు. ఈ ఇంటి పేరుమీదనే ఈ చరిత్రాత్మక ఒప్పందానికి శ్రీబాగ్ ఒడంబడిక అని పేరు వచ్చింది.
ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో కోస్తా, రాయలసీమ నాయకుల మధ్య విభేదాలు ఉండేవి. 1926లో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంలో విభేదాలు మొదలయ్యాయి. అప్పటి మద్రాసు ముఖ్యమంత్రి సుబ్బారాయన్ తీసుకున్న నిర్ణయాలు ఇందుకు ఇతోధికంగా తోడ్పడ్డాయి.
ఆ తరువాత, 1913-1935 మధ్య జరుగుతూ వచ్చిన ఆంధ్ర మహాసభ సమావేశాల్లోనూ, ఆంధ్ర కాంగ్రెసు కమిటీ ఎన్నికల్లోనూ ఇవి బయటపడుతూ ఉండేవి. 1917లో నెల్లూరులో జరిగిన ఆంధ్ర మహాసభ సమావేశాలలో ప్రత్యేకాంధ్ర తీర్మానాన్ని ఓడించడానికి రాయలసీమ, నెల్లూరు ప్రతినిధులు తీవ్రంగా ప్రయత్నించారు.
1924లో విజయవాడలో జరిగిన ఆంధ్ర కాంగ్రెసు కమిటీ ఎన్నికలలో అధ్యక్ష పదవికి పోటీచేసిన రాయలసీమకు చెందిన నాయకుడు, గాడిచర్ల హరిసర్వోత్తమ రావును ఆంధ్ర నాయకులు ఓడించారు. 1937లో విజయవాడలో జరిగిన ఆంధ్ర మహాసభ రజతోత్సవాల్లో పాల్గొన్న నాయకులు విభేదాలను తొలగించు కోవాలన్న నిశ్చయానికి వచ్చారు.
మంత్రివర్గం ఏర్పాటు, నీటిపారుదల, రాజధాని మొదలైన విషయాల్లో రాయలసీమకు రక్షణలు అవసరమన్న భావన రాయలసీమ నాయకులది. ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగిన ఒప్పందమే శ్రీబాగ్ ఒడంబడికగా ప్రసిద్ధమైంది.
*****
హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకప్పటి నివాసం పేరు ‘శ్రీబాగ్’
‘మూడు రాజధానుల ఆలోచన’కు మూలమే ‘శ్రీబాగ్’ ఒప్పందమంటారు వైసీపీ వాళ్ళు.
మూడేళ్ళ కిందట రాయలసీమలో ‘శ్రీబాగ్’ ఒప్పందపు 85 వ వార్షికోత్సవపు ర్యాలీ జరిపారు. ఇంతటి ప్రాధాన్యమున్న ‘శ్రీబాగ్’ తో నాకున్న సంబంధం.. 30 ఏళ్ల కిందట ఆంధ్రప్రభలో రాసిన ఒక ఫాలో అప్ వార్త మాత్రమే.
అప్పట్లో ఒక కీలకమైన సమాచారం తెలిసినా రాయలేకపోయిన సందర్భమది. తప్పనిసరి పరిస్థితుల్లో ‘అసలు వార్త’ రాయకుండా కొసరు వార్త మాత్రమే రాసి సంతృప్తి పడాల్సి వచ్చింది. కానీ ఆశించిన ఫలితం దక్కింది.
*****
1995 మే నెలలో ఒకరోజు సీనియర్ జర్నలిస్ట్ బీఎస్సార్ కృష్ణ గారింటికి వెళ్ళా. (ఆయనది గుంటూరు జిల్లా సిరిపురం. ఎప్పుడూ తెల్లటి ఖద్దరు పంచె, లాల్చీతో కనిపించే సన్నటి నిలువెత్తు విగ్రహం. కాంగ్రెస్ వాది. ఎన్టీఆర్ క్లాస్ మేట్ కాబట్టి రాజకీయంగా విభేదించినా, ఆయన కోరిక మీద గండిపేటలో తెలుగుదేశం వాళ్ళకు రాజకీయ శిక్షణ ఇచ్చారు.
జర్నలిస్టుగా ఆయన తొలినాళ్ళలో ‘పొగాకు రైతు’ పత్రికకు ఎడిటర్ . ఆ తరువాత మద్రాసులో అమెరికా వాళ్ళ ‘యునైటెడ్ స్టేట్స్ ఇన్ఫర్మేషన్ సర్వీస్’ తెలుగు సంపాదకుడయ్యారు. మద్రాసులో ఏ సాహిత్య కార్యక్రమం జరిగినా ఆయన ఉండాల్సిందే.
ఆంధ్ర జ్యోతిలో ప్రచురితమైన ఆయన కాలమ్ ‘ఇంటా బయటా’ ఆ తరువాత కాలంలో ‘సంధి యుగం’ పేరుతో పుస్తకంగా వచ్చింది.)
తరచూ ఆయన్ని కలవటం, ఆయన అనుభవాలు వినటం అలవాటైపోయింది. ఆరోజు వెళ్ళేసరికి ఒకాయన అప్పటికే ఏదో సీరియస్ గా మాట్లాడుతూ ఉన్నారు. కృష్ణ గారు నన్ను కూర్చోమన్నట్టు సైగ చేశారు. ఏం మాట్లాడకుండా కూర్చున్నా.
ఆయన్ని నాకు గాని, నన్ను ఆయనకి గాని పరిచయం చేయలేదు. అప్పటికే వాళ్ళ కాఫీ పూర్తయినట్టుంది. నాకొక్కడికే కాఫీ వచ్చింది. సంభాషణ కూడా ఒక కొలిక్కి వచ్చింది. కృష్ణ గారు ధైర్యం చెబుతూ ఆయన్ని సాగనంపారు.
అలా ఆయన వెళ్ళిపోయాక అసలు విషయం చెప్పారు. వచ్చినాయన కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి మనవడు. అంటే అల్లుడు శివలెంక శంభుప్రసాద్ గారి కొడుకు రాధాకృష్ణ గారు. ఆయా అప్పట్లో వ్యాపారం కోసం శ్రీబాగ్ భవనాన్ని బాంకులో తనఖా పెట్టి అప్పు తీసుకున్నారు. ఈ సంగతి తెలిసిన జయలలిత నెచ్చెలి శశికళ ఆ భవనం మీద కన్నేశారు.
బాంకు మేనేజర్ ఒకప్పుడు జయలలిత సహ విద్యార్థి కావటంతో ఆమెను పిలిపించి వాళ్ళ మనసులో మాట చెప్పారు. శ్రీబాగ్ స్థానంలో ఒక స్టార్ హోటల్ కట్టాలన్నది శశికళ ఆలోచన. ఆ భవనాన్ని కారు చౌకగా కొట్టేసే వ్యూహాన్ని అమలు చేసే బాధ్యత ఆ బాంక్ మేనేజర్ కే అప్పజెప్పారు.
దీంతో ఆ మేనేజర్ కొంత బెదరింపు ధోరణిలో మాట్లాడారని రాధాకృష్ణ గారు బీస్సార్ గారికి చెప్పారు. ఇదీ స్థూలంగా బీస్సార్ గారు నాకు చెప్పిన విషయం. అయితే, ఇది ఆంధ్రప్రభలో వార్తగా వస్తే దాని ప్రభావం అంతగా ఉండకపోవచ్చునని, ఇంకోవైపు రాధాకృష్ణ గారిని బెదిరించే ప్రమాదముందని కృష్ణ గారు నన్ను హెచ్చరించారు.
అందుకే ఈ విషయం ఇండియన్ ఎక్స్ ప్రెస్ రిపోర్టర్ బాలాజీతో మాట్లాడా. అతనికి విషయం అర్థమైంది. కానీ వార్త రాగానే పెద్ద ఎత్తున హడావిడి జరిగితే తప్ప ఫలితం ఉండదన్నాడు. హడావిడి జరగాలంటే కాంగ్రెస్ వాళ్ళు జోక్యం చేసుకోవటం తప్పనిసరి అనే అభిప్రాయానికొచ్చాం.
ఇద్దరం ఇండియన్ ఎక్స్ ప్రెస్ వెనక వీధిలో ఉండే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ సత్యమూర్తి భవన్ కి వెళ్ళాం. అప్పటికే ఫోన్ చేసి ఉండటం వల్ల పీసీసీ ప్రెసిడెంట్ కుమరి అనంతన్ (తెలంగాణ గవర్నర్ గా పనిచేసి తమిళిసై తండ్రి ఆయన. సాహిత్యం మీద పట్టున్న రాజకీయ నాయకుడాయన) ఎదురు చూస్తున్నారు.
బాలాజీ ఈ వ్యవహారం చెప్పగానే ఆయనలో ఉత్సాహం పెరిగింది. ఆ భవనంలో ఒకప్పుడు గాంధీ బస చేశారని, తన జ్ఞాపకంగా కొన్ని వస్తువులు కూడా అక్కడ వదిలి వెళ్లారని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటుందని చెప్పారు.
నిజానికి అప్పటికే తమిళనాట జయలలిత మీద వ్యతిరేకత పెరుగుతోంది. సుబ్రమణ్య స్వామి కేసులు పెడుతూ వస్తున్నారు. జయలలితతో తెగతెంపులు చేసుకోవటమే మంచిదని కాంగ్రెస్ అనుకుంటున్న సమయమది. అందుకే, వార్త వస్తే అదే రోజు ఉదయం పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హామీ ఇచ్చారాయన.
అనుకున్నట్టే ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ఫస్ట్ పేజ్ లో వార్త వచ్చింది. శ్రీబాగ్ భవనాన్ని బలవంతంగా లాక్కొని దాని స్థానంలో శశికళ స్టార్ హోటల్ కట్టే ఆలోచనలో ఉన్నారన్నది ఆ వార్త సారాంశం. ఉదయం 8 గంటలకే కాంగ్రెస్ ధర్నా మొదలైంది.
కుమరి అనంతం అయితే, ఏకంగా నిరాహారదీక్షకు దిగారు. కాంగ్రెస్ నాయకులు ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. మిగిలిన పత్రికలతోబాటు ఆంధ్రప్రభలో కూడా ఆ వార్త వచ్చింది. అన్నా డీఎంకే వాళ్ళు మొదట్లో కొంత ప్రతిఘటించారు. ఆ వార్త నిజం కాదని ఒకసారి, ఒకప్పుడు గాంధీ ఉంటే మాత్రం ఆ ఇంటి యజమాని అమ్ముకుంటానంటే మధ్యలో మీకెందుకు అంటూ ఇంకోసారి అన్నారు గాని చివరికి తప్పుకున్నారు.
ఏమైతేనేం, శశికళ వెనక్కి తగ్గారు. శ్రీబాగ్ భవనం మిగిలింది. నాకు ఆ జ్ఞాపకం మిగిలింది. శివలెంక రాధాకృష్ణ గారి కొడుకు శంభుప్రసాద్ (తాతగారి పేరు) ఇప్పటికీ అమృతాంజనం వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ నడుపుతున్నారు. నాలుగోతరం అయినా ఆయన చక్కటి తెలుగు మాట్లాడుతున్నారు. ఆడగ్గానే శ్రీబాగ్ భవనం తాజా ఫోటో పంపారు….. – తోట భావనారాయణ (9959940194)
పోస్ట్ స్క్రిప్ట్: అన్నట్టు .. ఇప్పుడు ఆంధ్రపత్రిక విజయవాడ నుంచి వస్తోంది. ‘ఈనాడు రామయ్య’ గా పేరున్న జర్నలిస్టు కంచర్ల రామయ్య దాన్ని పునఃప్రారంభించారు. ఆయన ఈ మధ్యనే చనిపోయారు. వాళ్ల కొడుకుల్లో ఒకరు కందుకూరులో ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ నడుపుతుండగా ఇంకొకరు టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్…
Share this Article