.
Bhavanarayana Thota …. స్టార్ టీవీ అలా మొదలైంది… హగ్స్ స్పేస్ కమ్యూనికేషన్స్ అనే సంస్థ 1980ల ఆరంభంలో వెస్టర్న్ యూనియన్ టెలిగ్రాఫ్ కంపెనీ కోసం మూడు ఉపగ్రహాలు సిద్ధం చేసింది. 1984 ఫిబ్రవరిలో ఆ ఉపగ్రహాలను ప్రయోగిస్తే వాటిలో వెస్టార్6 అనే ఉపగ్రహం దారితప్పింది.
కక్ష్యకు దిగువనే ఉండి పోయింది. దాన్ని బీమా చేసిన లాయిడ్స్ అనే బీమా కంపెనీ మీద పెనుభారం పడింది. ఆ నష్టం అంతా ఇంతా కాదు. అందుకే లాయిడ్స్ సంస్థ ఎలాగైనా ఆ నష్టాన్ని పూడ్చుకోవాలని నిర్ణయించుకుంది.
Ads
నేషనల్ ఏరొనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) ని సంప్రదిస్తే, వాళ్ళు చాలా కష్టపడి దాని ఆనవాళ్ళు కనిపెట్టి తెచ్చి, మరమ్మతు చేసి ఇచ్చారు. అప్పుడు లాయిడ్స్ సంస్థ ఆసియాశాట్ అనే ఆసియా ఖండపు మదుపుదారుల సంస్థకు 12 కోట్ల డాలర్లకు ఆ ఉపగ్రహాన్ని అమ్మింది.
1990 లో ఆసియాశాట్ సంస్థ ఒక చైనా రాకెట్ సాయంతో దీన్ని మళ్ళీ ప్రయోగించగలిగింది. ఆ సంస్థలో భాగస్వామి లీ కా షింగ్ కి రియల్ ఎస్టేట్, షిప్పింగ్ లాంటి రకరకాల వ్యాపారాలున్నాయి. ఈ ఉపగ్రహంలోని ట్రాన్స్ పాండర్లను వేరు వేరు అవసరాలకోసం అద్దెకు ఇస్తూ ఉండేవారు.
లీ కా షింగ్ కొడుకు రిచర్డ్ లీ వయసు 23. అమెరికాలోని స్టాన్ ఫోర్డ్ లో చదివి హాంకాంగ్ తిరిగి వచ్చాడు. తండ్రి వ్యాపారంలో పెట్టుబడుల విభాగం చూసుకునే వాడు. పదేళ్ళ పాటు అమెరికాలో చదువుకోవటం వలన టీవీ గురించి బాగా తెలుసు.
- ఆసియా ఖండ వాసులకు అలాంటి వినోదంతో ఎంతమాత్రమూ పరిచయం లేదని కూడా తెలుసు. పైగా రకరకాల భాషలు. కానీ, తన దగ్గర ఉన్న ఉపగ్రహం దాదాపు ఆసియాలో 38 దేశాలను, 270 కోట్ల జనాభాను అందుకోగలదు. పశ్చిమ దేశాల కార్యక్రమాలు సహజంగానే ఆసక్తిక లిగిస్తాయి కాబట్టి ఆసియా మొత్తానికి ఒక టీవీ చానల్ నడిపితే ఎలా ఉంటుంది? ఇదీ అతడి ఆలోచన.
ఆ విధంగా లీ 1991లో శాటిలైట్ టెలివిజన్ ఫర్ ది ఏషియా రీజియన్ (స్టార్) సంస్థ పెట్టుకున్నాడు. తన తండ్రి నీడ నుంచి బైటికి వచ్చి తన ఆలోచనతో ముందుకు వెళ్లాలనుకోవటం కూడా ఈ వ్యాపారంలో అడుగుపెట్టటానికి కారణం. వివిధ దేశాల్లో టీవీ రంగంలో పనిచేస్తున్నవాళ్లను తన సంస్థలోకి తీసుకొని 1991 ఆగస్టులో స్టార్ ప్లస్ చానల్ ప్రారంభించటంతోబాటు ప్రైమ్ స్పోర్ట్స్, బిబిసి న్యూస్, ఎంటీవీ కూడా తన ఉపగ్రహం ద్వారా ఆసియా దేశాలకు అందే ఏర్పాటు చేశాడు. మొత్తం ఈ ఏర్పాటుకు 30 కోట్ల డాలర్లు ఖర్చయింది. 12 కోట్ల డాలర్లు ముందస్తు అడ్వర్టయిజ్ మెంట్ ఒప్పందాల ద్వారా వచ్చింది.
సంపన్నుల కుటుంబాలే లక్ష్యంగా లీ ముందడుగు వేశారు. జనాభా 2 కోట్లే అయినా తైవాన్ మీద దృష్టిపెట్టారు. అక్కడ 50 లక్షల మందికి కేబుల్ ద్వారా ప్రసారాలు అందటం ఒక కారణమైతే, డబ్బున్న మార్కెట్ కావటం ఇంకో కారణం. అప్పుడసలు భారత్ లో స్పందన ఉంటుందని ఊహించనే లేదు. కానీ అప్పటిదాకా దూరదర్శన్ వాతావరణానికే అలవాటుపడ్డ పెద్ద పెద్ద యాడ్ ఏజెన్సీలు ఒక్కసారిగా గోద్రెజ్, బ్రిటిష్ ఎయిర్ వేస్, అముల్ బటర్ లాంటి ప్రకటనలు స్టార్, ఎంటీవీ లో ఇవ్వటానికి క్యూ కట్టాయి.
అమెరికాలో బి గ్రేడ్ కార్యక్రమాలుగా చెప్పుకునే శాంటా బార్బరా, బే వాచ్, ది బోల్డ్ అండ్ ది బ్యూటిఫుల్ లాంటి కార్యక్రమాలకు ఇక్కడ అనూహ్యమైన ఆదరణ కనిపించింది. అంతా ఇంతా అప్పుడు ఒక్కసారిగా భారత మార్కెట్ సామర్థ్యం తెలిసివచ్చింది.
ప్రైవేట్ శాటిలైట్ టీవీ అన్నదే కాదు, స్పాన్సర్ షిప్ అనే పదం కూడా భారత్ కు కొత్తే. అప్పట్లో దూరదర్శన్ టెలికాస్ట్ ఫీజు మాత్రమే వసూలు చేసి స్లాట్స్ కేటాయించేది. గల్ఫ్ యుద్ధాన్ని ప్రత్యక్షంగా ప్రసారం చేసిన సి ఎన్ ఎన్ వలన భారతదేశంలో ఔత్సాహికులైన వ్యాపారులు కేబుల్ టీవీ వ్యాపారం మొదలుపెట్టి డిడి చానల్స్ తోబాటు ప్రైవేట్ చానల్స్ ఇవ్వటం మొదలుపెట్టిన రోజులవి.
- కేవలం నగరాలకే పరిమితమైన ఈ వ్యాపారం స్టార్ రాకతో ఊరూరా ప్రవేశించింది. కేబుల్ కనెక్షన్ ఉందా అని అడగటానికి బదులు చాలాకాలం వరకూ స్టార్ కనెక్షన్ ఉందా అని అడిగేవారంటేనే స్టార్ టీవీకీ, కేబుల్ కనెక్షన్ కూ ఉన్న బంధం అర్థమవుతుంది.
భారత్ లో స్టార్ టీవీ చూసేవాళ్ళు ఇంతమంది ఉండటం లీ అంచనాలకు అందలేదు. పైగా భారతదేశం నుంచి వచ్చిన ఒక బియ్యం వ్యాపారి కూడా అతగాణ్ణి మరింత కంగారు పెట్టాడు. (ఆ బియ్యం వ్యాపారి గురించి తరువాత తెలుసుకుందాం.) ఇలా సాగుతుండగానే మీడియా సామ్రాజ్యపు రారాజు రూపర్ట్ మర్దోక్ 1993 లో 87 కోట్ల డాలర్లకు స్టార్ టీవీ తీసుకున్నాడు. ఖర్చుకు రెండొంతుల ధర పలికి ఊహించని లాభం వచ్చిన ఆనందంలో రెండేసి టికెట్లు సహా ఖర్చులు కూడా భరించి అంతర్జాతీయ పర్యాటక ప్రదేశాల్లో వారం పాటు తిరిగి రావటానికి లీ తన సిబ్బంది మొత్తానికి కానుక ఇచ్చాడు.
- ఇటువైపు మర్దోక్ అంత ఎక్కువ ధర ఎందుకు పెట్టాడో ఎవరికీ అర్థం కాలేదు. వ్యాపారాన్ని పదేళ్ళకు కాదు, ముప్పయ్యేళ్ళకు అంచనావేయాలని రూపర్ట్ మర్దోక్ ఎందుకు చెబుతాడో అర్థం చేసుకోవటానికి నిజంగానే పాతికేళ్ళు దాటాక ఇప్పుడు 60 చానల్స్ తో మన మధ్య ఉన్న స్టార్ గ్రూప్ కనిపిస్తోంది.
కానీ భారత్ లో మర్దోక్ నడక సాఫీగా సాగలేదు. అప్ లింకింగ్ కోసం జీటీవీ వాడుతున్న ఎర్త్ స్టేషన్, పంపిణీ కోసం జీ ఏర్పాటు చేసుకున్న సిటీ కేబుల్ లో స్టార్ వాటా తీసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం న్యూస్ కార్పొరేషన్ (స్టార్ టీవీ యాజమాన్య సంస్థ) 1999 దాకా తన స్టార్ టీవీని ఇంగ్లీష్ కే పరిమితం కావాలి. అంటే, హిందీ కార్యక్రమాలు జీ టీవీ కే సొంతం.
స్టార్ కి భారత మార్కెట్ కొత్త. జీటీవీకి ఈ వ్యాపారం కొత్త. భారత్ లో హిందీ అయితేనే చూస్తారని అర్థమైంది. ఇంగ్లీష్ కార్యక్రమాలను స్టార్ హిందీలోకి డబ్ చేసి ప్రసారం చేస్తే జనం మెచ్చుకోలేదు. నేరుగా హిందీలో చేద్దామంటే ఒప్పందం ప్రకారం అది కుదరదని జీ టీవీ హెచ్చరిక. మొండిగా మొదలుపెడితే లండన్ కోర్టులో జీ టీవీ కేసు కూడా వేసింది.

2000 సంవత్సరం మార్చి. ముంబయ్ లోని అంధేరిలో స్టార్ టీవీ కార్యాలయం.
ఛైర్మన్ రూపర్ట్ మర్దోక్ భారత్ లో స్టార్ టీవీ పనితీరును సమీక్షిస్తున్నాడు. అప్పటికే భారత్ లో డిటిహెచ్ వ్యాపారం ఆలోచన మీద పెద్దమొత్తంలో ఖర్చుపెట్టి వందకోట్ల డాలర్లకు పైగా నష్టపోయి ఉన్నాడు. హిందీ కార్యక్రమాలు చేయకుండా అడ్డుకున్న జీ టీవీతో కలిసి ఉమ్మడి వ్యాపారం చేద్దామని కూడా ఆలోచన చేశాడు రూపర్ట్ మర్దోక్ . ఛైర్మన్ పదవితో బాటు పెద్ద మొత్తం ఇవ్వజూపినా .. సుభాష్ చంద్ర ససేమిరా అన్నాడు. వీటన్నిటితో మర్దోక్ చాలా అసహనంగా ఉన్నాడు. జీ టీవీని వెంటాడాల్సిందేనన్నట్టు సంకేతాలిచ్చాడు. సమావేశం బాగా వేడెక్కి ఉంది.
- కొత్త ప్రోగ్రామింగ్ ఛీఫ్ గా చేరిన సమీర్ నాయర్ అప్పటి స్టార్ టీవీ పరిస్థితిని, తన ఆలోచనలను చెప్పటం మొదలు పెట్టాడు. తాజా రేటింగ్స్ తెలియజెప్పే మొదటి చార్ట్ లోనే జీ టీవీ ఆధిక్యం, గట్టిపోటీ ఇస్తూ రెండో స్థానంలో సోనీ ఉండటం, ఎక్కడో దూరంగా విసిరేసినట్టు మూడో స్థానంలో స్టార్ ఉండటం చూసి టేబుల్ మీద బలంగా గుద్దుతూ “మళ్లీ ఇలాంటి చార్ట్ నాకు కనబడ్డానికి వీల్లేదు” తీవ్రస్వరంతో హెచ్చరించాడు మర్దోక్.
నాయర్ వెంటనే తన ప్రజెంటేషన్ లో అసలు పాయింట్ కి వచ్చేశాడు. ‘హూ వాంట్స్ టు బి ఎ మిలియనేర్’ అనే ఇంగ్లీష్ షోకి హిందీ వెర్షన్ చేద్దామనుకుంటున్నట్టు చెప్పాడు. సినిమాలు సరిగా ఆడని స్థితిలో ఉన్న 57 ఏళ్ళ అమితాబ్ కు ఉన్న సెలెబ్రిటీ స్థాయిని వాడుకోవటానికి హోస్ట్ గా ఒప్పిస్తానన్నాడు. “ఇంతకీ ప్రైజ్ మనీ ఎంత” అడిగాడు మర్దోక్. లక్ష రూపాయలిచ్చి, కార్యక్రమం పేరు ” కౌన్ బనేగా లఖ్ పతి “ అని పెడతానన్నాడు నాయర్.
“అంటే ఎంత?” మళ్లీ అడిగాడు మర్దోక్. ఆయనకు అర్థం కావటానికి “2133 డాలర్లు” అని చెప్పాడు నాయర్. “ఇంత తక్కువా?” పెదవి విరిచాడు మర్దోక్. “కలలో ఊహించుకోవాలంటే ఎంత ఉండాలి?” అని మళ్ళీ అడిగితే కోటి.. అంటే పది మిలియన్లు అని జవాబొచ్చింది. అర్థం కాలేదు. మళ్లీ చెప్పమంటే “213310 డాలర్లు” అని అక్కడెవరో అన్నారు. “అయితే అదే ఖాయం చెయ్యండి” అని వెళ్ళిపోవటానికి లేస్తూ అక్కడ కుర్చీమీద ఉన్న తన కోటు అందుకున్నాడు మర్దోక్ మరో మాటకు తావివ్వకుండా.
- ఆ ఒక్క నిర్ణయం ఈ సహస్రాబ్ది తొలి ఏడాది భారత టీవీ కార్యక్రమాల చరిత్రను ఒక కీలమైన మలుపు తిప్పింది. టీవీ కార్యక్రమాల వీక్షణలో 2000 సంవత్సరం జులై 3 వ తేదీ ఎప్పటికీ చరిత్రగా మిగిలిపోతుంది. ఆ రోజు స్టార్ ప్లస్ రెండు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఆ రెండూ దేనికదే ఒక్కో బృహత్ కార్యక్రమం. అంతర్జాతీయంగా పేరు మోసిన హూ వాంట్స్ టూ బి ఎ మిలియనేర్ అనే గేమ్ షో అమితాబ్ బచ్చన్ యాంకర్ గా “ కౌన్ బనేగా కరోడ్ పతి” పేరుతో ప్రారంభం కావటం ఒకటైతే, ఏక్తా కపూర్ సారధ్యంలోని బాలాజీ టెలీఫిల్మ్స్ సంస్థ వారి సీరియల్ “క్యోంకి సాస్ భీ కభీ బహూ థీ” రెండోది.
భారత చలన చిత్ర రంగ దిగ్గజమైన సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ స్వయంగా హోస్ట్ చేసిన కార్యక్రమం కావటంతో సహజంగానే యావత్ భారతదేశం ఆ కార్యక్రమం కోసం ఎదురు చూసింది. జులై 3 న రాత్రి 9 గంటలకు స్టార్ ప్లస్ చానల్ ట్యూన్ చేసి ఎదురుచూస్తున్న ప్రేక్షకుల ముందుకు హుందాగా నడిచొచ్చిన అమితాబ్ తన గంభీరమైన స్వరంతో “ ష్యూర్? కాన్ఫిడెంట్? లాక్ కియా జాయే?” అనటం ఎంతగా ప్రేక్షకులలోకి వెళ్ళిందంటే ఎవరైనా ఏదైనా సమాధానం చెప్పినప్పుడు ఖరారు చేసుకోవటానికన్నట్టు ఇలా అడగటం అప్పట్లో పరిపాటి అయింది.
ఆ విధంగా భారత టెలివిజన్ చరిత్రలో ఒక అద్భుతమైన గేమ్ షో మొదలైంది. అలా అతుక్కుపోయిన ప్రేక్షకులను అలాగే కొనసాగించే వ్యూహంతో స్టార్ ప్లస్ తెలివిగా రాత్రి 10.30కి క్యోంకి సాస్ భీ కభీ బహూ థీ ప్రారంభించింది. ఎనిమిదిన్నరేళ్ళపాటు సాగిన ఆ సీరియల్ లో కోడలిగా భారత ప్రేక్షకుల మనసు దోచుకున్న తులసి విరానీ పాత్ర ధారి స్మృతి ఇరానీ ఆ తరువాత కేంద్రమంత్రి కావటం తెలిసిందే.
ఈ రెండు కార్యక్రమాల ఘన విజయంతో భారతదేశంలో భారీ సెట్లు, ఖరీదైన కాస్ట్యూమ్స్, విలాసవంతమైన నిర్మాణ విలువలతో, అత్యంత ఆశావహమైన జీవన శైలిని ప్రతిబింబించేలా విదేశీ కార్యక్రమాలకు ఏ మాత్రమూ తగ్గకుండా కార్యక్రమాల రూపకల్పన మొదలైంది.
ఖర్చు పెట్టేకొద్దీ ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చుననే అభిప్రాయం బలపడింది. 1990 ల నాటి కరణ్ జోహార్, యశ్ రాజ్ ఫిల్మ్స్ ను తలపించేలా ముందెన్నడూ భారత టీవీ తెరమీద కనబడని హంగామా మొదలైంది.
– తోట భావనారాయణ
( ఇప్పుడు భారతదేశంలోనే నెంబర్ వన్ చానల్ గా ఉన్న ‘స్టార్ మా’ తెలుగు టీవీ పదేళ్ళకిందట స్టార్ చేతుల్లోకి ఎలా వెళ్ళింది? 2400 కోట్లకు ఎలా అమ్ముడుపోయింది అనే విషయాలు ఇంకోసారి)
ఇండియాలో ప్రస్తుతం టాప్ సెవెన్ చానెల్స్ ర్యాకింగ్స్, జీఆర్పీలు ఇవీ…

Share this Article