బహుశా 2017 కావచ్చు… అప్పట్లో సోమిరెడ్డి ఏపీ వ్యవసాయ మంత్రి… అసలే నెల్లూరు రెడ్డి సాబ్, అందులోనూ మంత్రి… పైగా తెలుగుదేశం పాలన… మరి ఆ ఖదర్ చూపించుకోకపోతే ఎలా..? ప్రతి అంశంలోనూ మంత్రి గారి వైభోగం కనిపించేది… సర్లెండి, పోస్టు ఉన్నప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రాజరికం చూపించుకునేది అంటారా..? అవున్లెండి… కాకపోతే మరీ ఓ పత్తి చేను పరిశీలనకు వెళ్లినప్పుడు కూడా… రోడ్డు మీద నుంచి చేను దాకా ఆకుపచ్చ కార్పెట్ పరిపించుకుని, దాని మీద నడుచుకుంటూ సుతారంగా, సుకుమారంగా, ఎండ కన్నెరగని రాజకుమారుడిలా వెళ్లి, ఆ రైతునే ఉల్టా తిట్టేసిన ఓ సంఘటన గుర్తొస్తే… ఈరోజుకూ సోమిరెడ్ది పేరు వింటేనే చిరాకు… ఓ జలదరింపు… నాయకులు మరీ ఇలా ఉంటారా, నేల మీద మామూలుగా ఓ నాలుగు అడుగులు వేయలేనంత మరీ సూపర్ ఓవరాక్షన్ అవసరమా..? అని హాశ్చర్యం… అనుమానించకండి… ‘ముచ్చట’ అబద్ధం చెప్పదు… కాసేపు వెతికితే ఆనాటి ఫోటో, వార్త కూడా దొరికాయి… ఇదుగో…
ఇది ఇప్పుడు ఎందుకు చెప్పుకోవడం అంటే..? సారు గారి తాజా ప్రెస్‌మీట్ వివరాలు చదువుతుంటే… అప్పుడు కలిగిన ఎక్కువ మిక్కిలి జాలి మళ్లీ ఆయనపై ఇప్పుడు కలిగింది… ఆయన ఏమంటాడంటే..? ‘‘సభాహక్కుల ఉల్లంఘన కేవలం ఎమ్మెల్యేల విషయంలోనే వర్తిస్తుంది… అసలు మంత్రులు ఎన్నికల కమిషనర్ మీద స్పీకర్‌కు ఫిర్యాదు చేయడం ఏమిటి, స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి వెంటనే అప్పగించడం ఏమిటి, కమిటీ వెంటనే భేటీ వేయడం ఏమిటి… మొత్తం ఆశ్చర్యంగా ఉన్నాయి… రాజ్యాంగంలోని ఆర్టికల్ 194 ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీ కింద ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా మాట్లాడొచ్చు, స్వతంత్రంగా వోటు వేయొచ్చు… ఆ ఆర్టికల్ ప్రకారం ఎమ్మెల్యేల హక్కుల్ని ఎవరూ తప్పుపట్టే చాన్స్ లేదు, కోర్టులకు కూడా సమీక్షించే అధికారం లేదు… అసలు మంత్రి అనేది ఓ పొలిటికల్ పోస్టు, వారు ప్రభుత్వంలో భాగం…
Ads
1983లో ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో శాసనమండలిలో ఈనాడు రామోజీరావుపై రోశయ్య ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశారు… చివరకు హైకోర్టు స్టే ఇవ్వగా, సుప్రీం కోర్టు కూడా స్టేను సమర్ధించింది… 2007లో తమిళనాడు సీఎంగా జయలలిత ఉన్న సమయంలో హిందూ, మురసోలి పత్రికలపైనా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసినా కోర్టులు తప్పుపట్టాయి… ఏపీలో హిందూ, జమీన్ రైతు పత్రికలకూ ఇదే పరిస్థితి ఎదురైనప్పుడు కూడా కోర్టులు స్టే విధించాయి… మహారాష్ట్రలో విలాస్ రావు దేశముఖ్ సీఎంగా ఉన్న సమయంలో ఎస్ఈసీపై కక్ష కట్టి రెండు రోజులు జైలు శిక్ష వేశారు… ఈ రోజు జైలుకు పంపి రేపు ఉదయాన్నే వదిలేశారు… మహారాష్ట్ర శాసనసభ చర్యను సాక్షాత్తూ సుప్రీం కోర్టే తప్పుపట్టింది…
……. ఇవీ ఆయన మాటలు… మంత్రి అనేది పొలిటికల్ పోస్టు సరే, కానీ బేసిక్‌గా పెద్దిరెడ్డి, బొత్స ఎమ్మెల్యేలు కదా.., ఆ తరువాతే మంత్రులు… మరి ఎమ్మెల్యే విషయంలోనే సభాహక్కులు వర్తిస్తాయని నువ్వే బల్లగుద్ది చెబుతూ… ఈ మంత్రులకు అవి వర్తించవు అన్నట్టుగా మాట్లాడితే, దాన్ని ఏమనాలి…? అంటే, వినేవాడు విలేకరి అయితే నువ్వెన్నయినా చెబుతావా..? మంత్రులు ప్రభుత్వంలో భాగం కాబట్టి, ఎమ్మెల్యేలు గాకుండా పోయారా..? హిధంతా హేమిటి శారూ..?!
మిగతా వివరాలకు వస్తే… నువ్వు చెప్పింది కరెక్టు… ఈనాడు రామోజీరావుపై పెట్టబడిన సభాహక్కుల ఉల్లంఘన నుంచి మరికొన్ని పత్రికల ఉదంతాలూ నిజమే… కానీ అవి వేరు… పత్రికలకు ఓ ఝలక్ ఇవ్వడానికి, అదుపులోకి తెచ్చుకోవడానికి అధికారంలో ఉన్న పార్టీలు చూపించే కొరడా అది..! మరీ సుప్రీంతో ఘర్షణకు దిగి, వాళ్లను జైలుకు పంపించాల్సిందే అన్నంత కసి, కోపం ఏమీ చూపించరు… నిజంగానే కోర్టులు ఇచ్చిన స్టేలను ఆయా స్పీకర్లు లేదా మండలి చైర్మన్లు నిరాకరిస్తే, కోర్టులతో ఘర్షణకు దిగితే కథ వేరే ఉండేదేమో…
మహారాష్ట్ర స్పీకర్ ఏకంగా ఎన్నికల కమిషనర్‌నే జైలుకు పంపించాడు… అది ఒక్క రోజైనా సరే, అసెంబ్లీయే సుప్రీం అనే సంకేతాన్ని ఇచ్చాడు స్పీకర్… అయితే స్పీకర్లు ఎలా వ్యవహరించినా కోర్టులు చూస్తూ ఊరుకోవాలా అనేది ప్రశ్న… లేదు… స్పీకర్ల నిర్ణయాలు కూడా జుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తాయి… రాజ్యాంగ స్పూర్తికి భిన్నంగా స్పీకర్లు వెళ్తే కోర్టులు జోక్యం చేసుకుంటాయి… (1992లో ఓ కేసులో సుప్రీం ఈ క్లారిటీ ఇచ్చింది..) ఈమధ్య ఎమ్మెల్యేల అనర్హతలపై స్పీకర్లు తీసుకునే నిర్ణయాల్లో సుప్రీం పలుసార్లు జోక్యం చేసుకుంది…
ఇప్పుడు జగన్ వర్సెస్ నిమ్మగడ్డ పంచాయితీ అన్నిరకాల గీతలనూ దాటేసింది… దూకుడుగా కదులుతున్న నిమ్మగడ్డను నిలువరించడానికే కాదు, ఎదురుదాడికి జగన్ ఎంచుకున్న అస్త్రం అది… అందుకే అంత వేగంగా స్పీకర్ కదిలాడు, ప్రివిలేజ్ కమిటీ కదిలింది… రేప్పొద్దున నిమ్మగడ్డకు నోటీసులు ఇస్తారా..? పిలుస్తారా..? ఆయన వెళ్తాడా..? కోర్టుకు పోతాడా..? కోర్టు స్టే ఇస్తుందా..? స్పీకర్ల విచక్షణాధికారంపై స్పీకర్ స్థిరంగా నిలబడతాడా..? అసలు ఇలాంటి విషయాల్లో స్పీకర్ల అధికార పరిధి ఏమిటో తేల్చండి అని అవసరమైతే సుప్రీంలోనూ స్పీకర్ పోరాడతాడా..? చట్టసభ స్పీకర్ల విచక్షణాధికారాల్లోకి సుప్రీం ఎంటరవుతుందా..? చూడాలి… ఏమో, ఈ కేసు ఓ ప్రిసిడెంటుగా మారనుందేమో, కథ వేరే ఉండబోతున్నదేమో…!! సో, డియర్ సోమిరెడ్డి గారూ… జస్ట్, వెయిట్… కోర్టులు ఒప్పుకోవు, ప్రివిలేజులకు భయపడకు, నువ్వు ఏమాత్రం తగ్గకు అంటూ… ఎగేస్తూ, ఉబ్బిస్తూ… నిమ్మగడ్డను మీరే బావిలోకి నెట్టేస్తున్నారా రెడ్డి గారూ..!!
Share this Article